Ukraine: ఉక్రెయిన్‌లో ఇక పేట్రియాట్ క్షిపణుల తయారీ…
Ukraine: ఉక్రెయిన్‌లో ఇక పేట్రియాట్ క్షిపణుల తయారీ…
ట్రంప్ లైసెన్స్ ఇచ్చారని జెలెన్స్కీ ప్రకటన
వాషింగ్టన్: ఇకమీదట ఉక్రెయిన్‌లోనే దేశీయంగా అమెరికా పేట్రియాట్ క్షిపణులు తయారు చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఇచ్చారు. మంగళవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ట్రంప్ మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన సంభాషణల సందర్భంగా జెలెన్స్కీకి ఈ పూర్తి భరోసా లభించింది.
రష్యా యుద్ధం, అమెరికా-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై నాయకులు ఇద్దరూ చర్చలు జరిపారు. జులై నెలలో రెండుసార్లు జెలెన్స్కీ అమెరికా వెళ్లి ట్రంప్‌తో సంభాషణలు చేశారు. ఈ రెండో విడత సమావేశంలో గతంకంటే భిన్నంగా హామీలను రాబట్టారు.
రష్యాపై దాడుల ఉద్ధృతి పెంచడం ద్వారా విజయాలు సాధించి ట్రంప్ దగ్గర జెలెన్స్కీ మంచి మార్కులు సంపాదించారు. దీంతో ఆయనకు పేట్రియాట్ క్షిపణులను దేశీయంగా తయారు చేసుకునేందుకు లైసెన్సు లభించింది.
“ఆయన లైసెన్సులు ఇస్తామని ప్రకటించారు. నేను శక్తిమంతమైన అమెరికా సైనిక కంపెనీల అధిపతులతో సమావేశం జరిపాను. మేం ఇద్దరం కలిసి ఉత్పత్తి చేస్తాం” అని ఫాక్స్ న్యూస్ ‘హానిటీ’ కార్యక్రమంలో జెలెన్స్కీ చెప్పారు.
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జూన్ 15 నుంచి 17వ తేదీ వరకు జరిగిన జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం గురించి ప్రధాన చర్చ జరిగింది. ఉక్రెయిన్‌కు పూర్తి మద్దతు ఇవ్వాలని యూరప్ దేశాలు గట్టి నిర్ణయం తీసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా జెలెన్స్కీ చాలా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. ఈ పూర్వరంగంలో పేట్రియాట్ క్షిపణుల తయారీకి అనుమతి లభించింది.
ఈ విషయంపై జెలెన్స్కీ ‘హానిటీ’ కార్యక్రమంలో మాట్లాడుతూ, యుద్ధం ఇప్పుడు రష్యా చేతుల్లో లేదని అన్నారు. భవిష్యత్తు యుద్ధాన్ని, దాని గమనాన్ని తమ పాశ్చాత్య దేశాల మిత్రులే నిర్దేశిస్తారని ప్రకటించారు.
ఇటీవలికాలంలో తాము చేసిన దాడుల్లో రష్యా చాలా తీవ్ర నష్టాలను చవిచూసిందని, ఆర్థికంగా దెబ్బతిందని చెప్పారు. ఇదిలా ఉండగా రష్యాపై ఉక్రెయిన్ బుధవారం తెల్లవారకముందే డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది.
డబ్బు సంపాదనే జెలెన్స్కీ లక్ష్యం
యూరప్ నుంచి వీలైనంత డబ్బు సంపాదించడంకోసమే జెలెన్స్కీ ప్రయత్నాలు చేస్తున్నారని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ రాయబారి రోడియన్ మిరోష్నిక్ విమర్శించారు. ఉక్రెయిన్‌కు ఇరాన్ వల్ల ప్రమాదం పొంచి ఉందని చెప్పడం కూడా ఈ సంపాదన మార్గాలలో ఒకటని విమర్శించారు.
ఆయన ప్రతి చర్యలోనూ డబ్బు సంపాదనే ఉందన్నారు. ఆయన విదేశీ సంబంధాలలో చివరి మాటలన్నీ “మరింత సాయం చేద్దాం, మరిన్ని ఆయుధాలు ఇద్దాం” అనే మాటలతోనే ముగుస్తున్నాయని విమర్శించారు.
ఇరాన్ నౌకపై కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్ దాడి చేసి ఒక నావికుణ్ణి చంపిందని, ఇప్పుడు దాన్ని కూడా డబ్బు సంపాదన కోసం వాడుకుంటున్నారన్నారు.