Skip to content
ఎడిట్ పేజి వార్తలు

విద్యార్థి ఉద్యమానికి మరోవైపు..

Prajapaksham 23 Jul 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
విద్యార్థి ఉద్యమానికి మరోవైపు..

Delhi Protest LIVE: ఢిల్లీలో సీజేపీ ఛలో పార్లమెంట్ ఉద్రిక్తం.. CJP నిరసనకారులపై లాఠీఛార్జ్..టియర్ గ్యాస్ ప్రయోగం...

ఢిల్లీలో జంతర్‌మంతర్‌ నుంచి పార్లమెంట్‌ వరకు ప్రతిధ్వనిస్తున్న విద్యార్థుల నినాదాలను కేవలం నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీకి పరిమితం చేస్తే, ఆ ఉద్యమ అసలు సారాన్ని అర్థం చేసుకోలేం. యువత ఆందోళన కేవలం ఒక పరీక్షపై పెల్లుబికిన ఆగ్రహం మాత్రమే కాదు… ఒక తరం భవిష్యత్తుపై పెరుగుతున్న అనిశ్చితికి వ్యక్తీకరణ. నీట్‌ లీకేజీ ఆగ్రహానికి ఆజ్యం పోసింది. అసలు సమస్య మాత్రం దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సంక్షోభం. లక్షలాది మంది యువత చదువును జీవిత భద్రతకు మార్గంగా నమ్మింది. కానీ ఇప్పుడు విద్య, ఉద్యోగం, జీవన భద్రత అనే గొలుసు క్రమంగా తెగిపోతోంది. ఆ తెగిన గొలుసు శబ్దమే నేడు ఢిల్లీలో వినిపిస్తున్న నిరసన. ప్రతి సమాజంలో యువత అసంతృప్తి ఒక్కరోజులో పుట్టదు. అది సంవత్సరాలుగా పేరుకుపోయిన నిరాశ, అవకాశాల కొరత, వ్యవస్థపై విశ్వాసం క్షీణించడం వల్ల ఏర్పడుతుంది. భారతదేశం ప్రస్తుతం అదే దశలో ఉంది. అధికారిక గణాంకాలే ఆ ప్రమాద ఘంటికను మోగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తున్న కొత్త పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే గణాంకాల ప్రకారం, 15 నుంచి 29సంవత్సరాల మధ్య యువత నిరుద్యోగం నిరంతరం పెరుగుతోంది. 2025 ఏప్రిల్‌లో 13.8 శాతంగా ఉన్న యువ నిరుద్యోగం, 2026 మేలో 15.9 శాతానికి చేరి, 2026 జూన్‌లో 16.2 శాతం అనే అత్యధిక స్థాయికి చేరింది. ఇది సాధారణ గణాంకం కాదు. ప్రతి వందమంది యువతలో పదహారు మందికి పనిలేదని చెప్పే కఠిన వాస్తవం. ఈ గణాంకాల్లో మరింత ఆందోళనకర అంశం యువతుల పరిస్థితి. 2026 జూన్‌లో యువ మహిళల నిరుద్యోగం 20.7 శాతానికి చేరింది. పట్టణ ప్రాంతాల్లో అది 25.3 శాతానికి పెరిగింది. అంటే నగరాల్లో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ప్రతి నలుగురు యువతుల్లో ఒకరికి ఉద్యోగం లేదు. మహిళా సాధికారత గురించి ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా, ఉపాధి అవకాశాలే లేకపోతే ఆ సాధికారత నినాదాల కే పరిమితమవుతుంది. ఉపాధిలేని సాధికారత సామాజిక వాస్తవం కాదు. పట్టణ భారతదేశంలో యువ నిరుద్యోగం 18.2 శాతానికి చేరుకోవడం కూడా సాధారణ విషయం కాదు. ఎందుకంటే అత్యధిక ప్రొఫెషనల్‌ విద్యాసంస్థలు, పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రాలు, కార్పొరేట్‌ ఉద్యోగాలు, ప్రభుత్వ నియామకాల కోసం సిద్ధమయ్యే యువత నగరాల్లోనే ఎక్కువగా ఉంటుంది. వారు సంవత్సరాల పాటు కోచింగ్‌, పరీక్షా ఫీజులు, వసతి, పుస్తకాల కోసం కుటుంబాల పొదుపులను ఖర్చు చేస్తారు. ఒక ఉద్యోగం వస్తుందనే ఆశతో అప్పులు కూడా చేస్తారు. చివరకు పరీక్షలే పారదర్శకంగా జరగకపోతే, ఆగ్రహం వీధుల్లోకి రావడం సహజం. నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీని ఈ నిరుద్యోగ సంక్షోభం నుంచి వేరుగా చూడడం పొరపాటు. ఎందుకంటే భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు, వృత్తిపరమైన కోర్సులు, వైద్య విద్య వంటి అవకాశాలు ఇప్పుడు అత్యంత పరిమితమయ్యాయి. లక్షలాది మంది కొద్దిపాటి సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ తీవ్రమైన పోటీలో ప్రతి మార్కుకు విలువ ఉంది. ప్రతి ర్యాంకు జీవితాన్ని మారుస్తుంది. అలాంటి సమయంలో ప్రశ్నాపత్రం లీకవడం కేవలం పరీక్షలో అవకతవక కాదు. అది కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల శ్రమను అవమానించడం. నిరుద్యోగం ఎక్కువగా ఉన్న సమాజం లో పరీక్షా వ్యవస్థపై నమ్మకం కోల్పోవడం మరింత ప్రమాదకరం. ఒకప్పుడు విద్య అంటే జ్ఞానం. తర్వాత విద్య అంటే ఉద్యోగం. ఇప్పుడు పరిస్థితి మరో మెట్టు దిగజారింది. విద్య పూర్తయినా ఉద్యోగం వస్తుందనే హామీ లేదు. ఉద్యోగం వచ్చినా అది స్థిరంగా ఉంటుందనే నమ్మకం లేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, గిగ్‌ ఎకానమీ, తాత్కాలిక నియామకాలు యువత జీవితాన్ని అనిశ్చితిలోకి నెట్టేశాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నియామకాలు మాత్రమే కొంత భద్రత కల్పించే మార్గంగా కనిపిస్తున్నాయి. అందుకే ప్రతి ప్రభుత్వ పరీక్షపై లక్షలాది మంది ఆధారపడుతున్నారు. పరీక్షల్లో అవినీతి జరిగితే, అది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన సమస్యగా మిగలదు. మొత్తం ఉపాధి వ్యవస్థ విశ్వసనీయతనే దెబ్బతీస్తుంది. దేశంలోని శ్రామిక మార్కెట్‌ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. తాజా గణాంకాల ప్రకారం, జనాభాలో పనిచేస్తున్న వారి సంఖ్య 2026 ఫిబ్రవరిలో 40.3 శాతం ఉండగా, జూన్‌కు 39.1శాతానికి పడిపోయింది. అంటే పనిచేస్తున్న వారి నిష్పత్తి తగ్గుతోంది. ఉద్యోగాలు వెతికేవారు పెరుగుతుండగా, పని దొరికే వారి సంఖ్య తగ్గుతోంది. ఇది ఏ ఆర్థిక వ్యవస్థకైనా ప్రమాద సంకేతం. ఉపాధి సృష్టిని కేంద్రంగా చేసుకున్న జాతీయ విధానం లేకపోవడం ఈ పరిస్థితికి మూల కారణం. భారత కార్మిక సదస్సు ఎన్నోసార్లు జాతీయ ఉపాధి విధానం అవసరమని సూచించినప్పటికీ, దానిని అమలు చేసే దిశగా ప్రభుత్వాలు ముందుకు రాలేదు. 2015 తర్వాత భారత కార్మిక సదస్సును కూడా సమావేశపరచలేదు. శ్రమ శక్తి విధానం ఇంకా ముసాయిదా దశలోనే ఉంది. ప్రభుత్వం ఉపాధి కల్పించే సంస్థగా కాకుండా, కేవలం ఉపాధికి సౌకర్యం కల్పించే సంస్థగా తన పాత్రను పరిమితం చేసుకుంది. మార్కెట్‌ ఉద్యోగాలు సృష్టిస్తుందని భావించడం ఒక ఆర్థిక సిద్ధాంతం కావచ్చు. కానీ భారతదేశం వంటి యువ జనాభా అధికంగా ఉన్న దేశంలో అది సరిపోదు. ప్రభుత్వ నియామకాలలో తీవ్ర జాప్యంతోపాటు, విద్యా వ్యవస్థ, ఉపాధి మార్కెట్‌ మధ్య పెరుగుతున్న అంతరం కూడా కారణమే. ఈ పరిస్థితుల్లో నీట్‌ ఉద్యమం పరీక్షా లీకేజీకి మాత్రమే స్పందన కాదు.
‘మా శ్రమకు విలువ ఉందా?’, ‘వ్యవస్థ నిజంగా న్యాయంగా పనిచేస్తుందా?’, ‘మాకు భవిష్యత్తు ఉందా?’ అనే ప్రశ్నలను యువత దేశం ముందు ఉంచుతోంది. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా, లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌, అరెస్టులతో స్పందిస్తే సమస్య మరింత తీవ్రం అవుతుంది. నిరసనకారులను చెదరగొట్టవచ్చు. కానీ నిరుద్యోగాన్ని చెదరగొట్టలేరు. నిరసనను అణచివేయడం కాదు.. అందుకు కారణాలను గుర్తించి సరిచేయడం అవసరం. దేశం ప్రస్తుతం జనాభాపరంగా యువశక్తి కలిగిన దశలో ఉంది. దీనిని ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’గా అభివర్ణిస్తారు. కానీ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతే అదే సానుకూలత చివరికి సామాజిక అసంతృప్తిగా మారుతుంది. అందుకే ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాన్ని కేవలం చట్టవ్యవస్థ సమస్య గా చూడడం సరైంది కాదు. నిరుద్యోగం, పరీక్షా అవకతవకలు, అవకాశాల కొరత వంటి సమస్యలు రగిల్చి అసంతృప్తి. ఈ గందరగోళానికి సమాధానం లాఠీ కాదు.. ఉద్యోగం. టియర్‌ గ్యాస్‌ కాదు… పారదర్శకత. అరెస్టులు కాదు… విశ్వసనీత. యువతను నమ్మించగలిగిన ప్రభుత్వం మాత్రమే దేశ భవిష్యత్తును నమ్మకంగా నిర్మించగలదు. కాబట్టి విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
రాజీనామా డిమాండ్‌ సహా వారి ఇతర కోర్కెలను తక్షణం ఆమోదించటం ప్రస్తుత ఆందోళనకు ఉపశమనం కాగలదు.