Skip to content
ఎడిట్ పేజి వార్తలు

కొండంత నిర్లక్ష్యం

Prajapaksham 25 Jul 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
కొండంత నిర్లక్ష్యం

CJP Responds PM Modi Message

ఉన్నత విద్యను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకై, సమాఖ్య స్ఫూర్తిని భగ్నం చేస్తూ అఖిల భారత ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణకు ‘జాతీయ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టిఎ)ని 2017లో నెలకొల్పిన నరేంద్రమోదీ ప్రభుత్వం అసమర్థ నిర్వహణ దుష్ఫలితాలు అనుభవిస్తున్న విద్యార్థులు, వ్యంగ్యాత్మకమైన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుతో ఆకస్మికంగా ఆన్‌లైన్‌లో ఉద్భవించి విద్యావ్యవస్థపై నవతరం (జన్‌ కుతకుతమంటున్న అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తీకరిస్తూ ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయిస్తున్నారు. నెలన్నరరోజులుగా జంతర్‌మంతర్‌ వేదికగా గాంధేయమార్గంలో నిరసన వ్యక్తం చేస్తుండగా చీమకుట్టినట్లు లేని ప్రభుత్వం సోమవారంనాడు విద్యార్థుల ‘పార్లమెంట్‌ మార్చ్‌’పై మహాకరశంగా వ్యవహరించింది. పోలీసు క్రౌర్యం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, నిరసన వ్యక్తం కావటం, రెండోవైపున, విద్యార్థి ఉద్యమానికి ప్రతిపక్షాల క్రియాశీల మద్దతుతో సోమవారంనుంచి పార్లమెంటు ఉభయ సభలు ప్రతిష్టంభనలో పడటంతో పరువు నిలుపుకునే ప్రయత్నంగా ఈ బిజెపి/ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వం నిద్రలేని రాత్రులు గడుపుతూ హడావుడి ప్రయత్నాలు మొదలుపెట్టింది. నీట్‌ తదితర ప్రశ్నాపత్రాల లీకేజి విద్యార్థిలోకంలో కలుగజేసిన క్షోభకు జవాబుదారీగా విద్యామంత్రి ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న ఉద్యమకారుల, ప్రతిపక్షాల డిమాండ్‌కు తలొగ్గకుండా ఇతరత్రా కోర్కెల ఆమోదానికి ముందుకు వచ్చింది. హక్కుల ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల నిరాహారదీక్షను విరమించారు. ఉద్యమకారుల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం అర్థరాత్రి (తెల్లవారితే శుక్రవారం) 12 గంటలకు విద్యార్థి నాయకులకు వీడియో సందేశం పంపటమే ప్రభుత్వంలో బయలుదేరిన బెదురుకు నిదర్శనం. ‘పరీక్షా పత్రాల లీకేజి లక్షలాది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో బాధాకరమని అంటూ, లీకేజి మాఫియాలపై కఠిన చట్టం, చర్యలు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు’ వాగ్దానం చేశారు. పార్లమెంటు సమావేశం జరుగుతుండగా విధాన ప్రకటనలు సభలో చేయకుండా సభవెలుపల చేయటం పార్లమెంటరీ సంప్రదాయాలపట్ల మోదీకున్న అగౌరవాన్ని తెలియజేస్తుంది. లేదా తన అర్థరాత్రి సందేశానికి విద్యార్థులు చలించిపోయి వెంటనే ఉద్యమం విరమిస్తారని భావించి ఉండాలి. ఉద్యమంలో సంఘ వ్యతిరేక, విద్రోహశక్తులు, దేశద్రోహులు ప్రవేశించారని, విదేశీ ప్రమేయం ఉందని బిజెపి నాయకులు దేశం నాల్గుదిశలా తమకు అలవాటైన దుష్ప్రచారం చేయటం వారి నిస్సహాయతకు నిదర్శనం. మోదీ 12 ఏళ్ల పాలనలో ఇటువంటి ఉద్యమాన్ని వారు కలలోకూడా ఊహించలేదు. ఒక పక్క రామాలయంలో భక్తుల కాన్కల దొంగతనం, ఇటేమో తమకు కోటలాంటి హిందీ బెల్టునుంచి జన్‌ తరం తిరుగుబాటు బిజెపి/ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
ఉన్నత ఆశయాల ప్రకటనతో నెలకొల్పిన ఎన్‌టిఎ సెంటర్‌ను ఎంత అధ్వాన్నంగా నిర్వహిస్తున్నారో విద్యాశాఖ సహాయమంత్రి సుఖాంత మజుందార్‌ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం వెల్లడించింది. ఎన్‌టిఎలో ఏర్పాటు చేసిన 39 పోస్టుల్లో 15ఖాళీగా ఉన్నాయి. కేంద్ర విద్యామంత్రిత్వశాఖకు చెందిన ఈ పరీక్షల నిర్వహణ సంస్థలో ప్రస్తుతం ఉన్న 24 మంది ఉద్యోగులూ వివిధ సంస్థల నుంచి డెప్యుటేషన్‌పై వచ్చినవారే. ఎన్‌టిఎ ఎక్కువగా బయటివారిపై ఆధారపడుతున్నది. కమ్యూనికేషన్‌ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ సలహాదారులు, కన్సల్టెంట్స్‌ సహా 73మంది అధికారులు కాంట్రాక్టుపై, 124మంది పొరుగుసేవల ఉద్యోగులు ఉన్నట్లు సిపిఐ(ఎం) సభ్యుడు వి.శివదాసన్‌ ప్రశ్నకు మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం తెలియజేస్తున్నది. కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయిలో 16 పోస్టులు ఏర్పాటు చేశారు. కాని పర్మినెంట్‌ స్టాఫ్‌ను రిక్రూట్‌ చేయకుండా డెప్యుటేషన్‌లతోనే సరిపెట్టారు. యూనివర్శిటీ ఎంట్రన్స్‌, మెడికల్‌, ఇంజినీరింగ్‌, ఫెలోషిప్‌ వంటి 24 ఉన్నతస్థాయి పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించబడిన ఎన్‌టిఎ నిర్మాణం, నిర్వహణ ఇంత దారుణంగా ఉంటే ఆ శాఖను నిర్వహించే మంత్రి సమర్థుడని ఎవరైనా అంటారా? అతను రాజీనామా చేయాలి లేదా ప్రధాని బర్తరఫ్‌ చేయాలన్న ‘బొద్దింకల’ డిమాండ్‌ న్యాయం, ధర్మం, సమంజసం కాదా?
నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ ఆరోపణల తదుపరి ఆ ఏజన్సీ అధికారులు
కొందరిని బదిలీ చేశారు. ఇప్పుడు ఇంతటి ఆందోళన తర్వాత విద్యామంత్రిత్వ శాఖలో ఉన్నత విద్య కార్యదర్శిసహా ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. నీట్‌లీక్‌ ఆరోపణలపై 47మందిని సాయంత్రం తొలగించారు. విద్యాశాఖమంత్రి ఇన్నాళ్లు నిద్రపోతున్నారనే అర్థం కాదా? ఈ ఉద్యమం గూర్చి నోరువిప్పటానికి ప్రధానమంత్రే నెలన్నరరోజులు తీసుకున్నారు. ఆయన మంత్రులనుంచి మెరుగైన పనితీరు ఊహించగలమా?
నీట్‌ పరిణామాలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వరుసక్రమంలో పెట్టిన తీరు సమస్యను సూక్ష్మంగా సుబోధక పరుస్తున్నది. “పరీక్షల నిర్వహణకై మోదీ ప్రభుత్వం ప్రత్యేకించి ఎన్‌టిఎ ఏర్పాటు చేసింది….అంతకుముందున్న వ్యవస్థ రద్దు చేసింది…ఎన్‌టిఎ నిర్వహణలో కనీసం 9పేపర్లు లీక్‌ అయినాయి… సంస్కరణలు సీరియస్‌గా అమలు జరిపే బదులు ప్రధాని అడ్డుపడుతూ వచ్చారు…నీట్‌ 2026 లీక్‌ అయింది… ఎన్‌టిఎ, ఉన్నతవిద్య డిపార్టుమెంట్‌ వారు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీముందు, సిగ్గుమాలినతనంతో, ప్రశ్నాపత్రం లీక్‌ కాలేదని బుకాయించారు… ప్రధానికి సత్యం కన్నా తన ప్రతిష్ట ప్రధానం…పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్ష సభ్యులు కూడా ఉన్నారన్న మిషతో సిఫారసులు అమలు చేయలేదు”. అందువల్ల నీట్‌ 2026 పేపర్‌ లీక్‌ రోగలక్షణం మాత్రమే; జబ్బు చాలా లోతుగా ఉంది అన్నారు రమేశ్‌. ఆ రోగాన్ని క్షుణ్ణంగా పరీక్షించి, భవిష్యత్‌ పరీక్షలకు భద్రత కల్పించాలంటే విద్యామంత్రి తొలగింపు అవసరం. ఆ పనిచేయకపోతే తమ డిమాండ్‌ ‘ప్రధాన్‌’ నుంచి ‘ప్రధాని’కి విస్తరిస్తుందని
‘బొద్దింకల’ పేరుతో ఉన్న జన్‌ తరం, ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.
ఎన్‌టిఎని సక్రమంగా నిర్వహించ చేతగాని మోదీ ప్రభుత్వం యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, అఖిల భారత సాంకేతిక విద్య కౌన్సిల్‌, ఉపాధ్యాయ విద్యా జాతీయ కౌన్సిల్‌ చట్టాలను రద్దు చేసి ఆ అధికారాలతో ఒకే సంస్థ ఏర్పాటు చేసేందుకై “వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్టాన్‌” బిల్లు తెచ్చింది. అది జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ముందు ఆగింది. ఎందుకీ విద్య కేంద్రీకరణ తపన !

ట్యాగ్‌లు: CJP CJP protest editorial