Skip to content
బిజినెస్ వార్తలు

పాడి పరిశ్రమకు కొరవడిన ప్రోత్సాహం

Prajapaksham 14 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
పాడి పరిశ్రమకు కొరవడిన ప్రోత్సాహం

పాడి పరిశ్రమకు కొరవడిన ప్రోత్సాహం

డా. ముచ్చుకోట సురేష్ బాబు

వ్యవసాయానికి అనుబంధ రంగాల్లో అత్యంత కీలకమైనది పాడి పరిశ్రమ. దేశంలో కోట్లాది చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, మహిళా స్వయం సహాయక సంఘాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒకప్పుడు పంటలు విఫలమైనా కుటుంబ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేది పాడి పరిశ్రమే. కానీ నేడు పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడటం వల్ల ఈ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్, యానిమల్ హస్బెండరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి పథకాలు ప్రకటించినప్పటికీ, వాటి ప్రయోజనాలు చిన్న పాడి రైతులకు ఆశించిన స్థాయిలో అందలేదు. రూ.15 వేల కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని ప్రకటించినా, గ్రామీణ స్థాయిలో పాడి రైతుల పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపించడం లేదు. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ప్రధానంగా గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికే పరిమితమై, పాడి రైతుల అవసరాలను పెద్దగా పట్టించుకోలేదు.

కరోనా లాక్‌డౌన్ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు మూతపడటంతో పాలకు దాదాపు 28 శాతం వరకు డిమాండ్ తగ్గింది. రోజుకు సుమారు 560 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, కేవలం 360 లక్షల లీటర్లకే మార్కెట్ లభించింది. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. సహకార డెయిరీల ద్వారా పాల కొనుగోలు జరిగినా, అది రైతుల నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేకపోయింది.

ప్రస్తుతం పాడి రైతులను అత్యధికంగా ఇబ్బంది పెడుతున్న అంశం దాణా, పశుగ్రాసం ధరల పెరుగుదల. గత కొన్నేళ్లలో పశువుల దాణా ధరలు గణనీయంగా పెరిగాయి. పచ్చగడ్డి కొరత, ఎండుగడ్డి అధిక ధరలు పాడి రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. ఒకప్పుడు రూ.600 ఉన్న తౌడు బస్తా ఇప్పుడు రూ.700కు చేరగా, ట్రాక్టర్ ఎండుగడ్డి ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతోంది. దీంతో పాల ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగింది.

రోజుకు నాలుగు లీటర్ల పాలు ఇచ్చే గేదెకు అవసరమైన దాణాపైనే దాదాపు రూ.100 వరకు ఖర్చవుతోంది. డెయిరీలు లీటరు పాలకు చెల్లించే ధరతో రైతుకు మిగిలేది చాలా స్వల్పం. పశువుల సంరక్షణ, వైద్య ఖర్చులు, శ్రమ, విద్యుత్తు, నీటి వ్యయం కలిపి చూస్తే చాలామంది రైతులు రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు డెయిరీలు పాల ఉత్పత్తుల ధరలను తరచూ పెంచుతున్నప్పటికీ, రైతుల నుంచి సేకరించే పాల ధరలను పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి. విజయ డెయిరీతో పాటు హెరిటేజ్, హాట్సన్, తిరుమల, శ్రీచక్ర, గాయత్రి తదితర ప్రైవేట్ డెయిరీలు రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ప్రైవేట్ డెయిరీల మధ్య పోటీ ఉన్నప్పటికీ, రైతుల ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.

పశువైద్య సేవల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. అనేక పశువైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా రైతులకు సమయానికి సేవలు అందడం లేదు. పశువుల్లో నోటి-కాలి వ్యాధి, గాలిసోకు, ఇతర అంటువ్యాధుల నివారణకు జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలి. దేశవ్యాప్తంగా పశువులకు వంద శాతం టీకాలు అందించే చర్యలు చేపట్టాలి. అలాగే కృత్రిమ గర్భధారణ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలి.

రాష్ట్రంలో సహకార డెయిరీల ద్వారా రోజుకు సుమారు 21.7 లక్షల లీటర్ల పాలు, ప్రైవేట్ డెయిరీల ద్వారా 47.5 లక్షల లీటర్ల పాలు సేకరించబడుతున్నాయి. అదనంగా అసంఘటిత రంగం ద్వారా సుమారు 220 లక్షల లీటర్ల వరకు పాలు విక్రయమవుతున్నట్లు అంచనా. ఈ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ, తగిన ప్రోత్సాహం లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో పాడి రైతులకు ప్రత్యేక సహాయక చర్యలు అత్యవసరం. పాడిపశువుల కొనుగోలుకు కనీసం రూ.20 వేల సబ్సిడీ, పశు బీమాకు రూ.2 వేల ఆర్థిక సహాయం, సబ్సిడీపై నాణ్యమైన దాణా సరఫరా, పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమాలు, ఉచిత పశువైద్య సేవలు, నాణ్యమైన పాలకు ప్రీమియం ధర వంటి చర్యలు అమలు చేయాలి. లీటరు గేదె పాలకు కనీసం రూ.10, ఆవు పాలకు రూ.5 అదనపు ప్రోత్సాహక ధర చెల్లించే విధానాన్ని ప్రభుత్వం పరిశీలించాలి.

పాడి రైతుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు కూడా అవసరం. పాడి రైతు కుటుంబంలో వివాహం జరిగితే ఆర్థిక సహాయం, ప్రతిభ కనబరిచిన వారి పిల్లలకు విద్యా ప్రోత్సాహకాలు, ఉన్నత విద్యలో ప్రవేశం పొందిన విద్యార్థులకు నగదు బహుమతులు, ఉత్తమ పాల ఉత్పత్తిదారులకు నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందించాలి. పాడి రైతు మరణించినప్పుడు అంత్యక్రియల ఖర్చులకు ప్రత్యేక సహాయం అందించాలి.

అదేవిధంగా పెద్ద డెయిరీ ఫార్మ్‌లకు గడ్డి కోయు యంత్రాలు, పాల క్యాన్లు, విద్యుత్తు రాయితీలు, మినరల్ మిక్చర్, బీమా ప్రీమియంపై సబ్సిడీలు అందించాలి. సహకార డెయిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, ఉద్యోగులకు తగిన వేతన సవరణలు అమలు చేయాలి. పాడి రైతుల సంక్షేమం, ఆధునికీకరణ, మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా కనీసం రూ.20 కోట్ల నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

దేశంలో శ్వేత విప్లవం విజయవంతం కావడానికి పునాది వేసింది పాడి రైతులే. అలాంటి రైతులను నిర్లక్ష్యం చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. పాడి పరిశ్రమను వ్యవసాయానికి అనుబంధ రంగంగా కాకుండా, గ్రామీణ ఉపాధి, మహిళా సాధికారత, పోషకాహార భద్రతకు కీలకమైన ఆర్థిక రంగంగా గుర్తించి సమగ్ర విధానంతో ప్రోత్సహించినప్పుడే దేశంలో మరోసారి శ్వేత విప్లవానికి నాంది పలకగలుగుతాం.

ట్యాగ్‌లు: India agriculture