Telangana Govt Scheme: విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే యువత కోసం కొత్త పథకం.. రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ..
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2027 విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి ఫస్ట్ ఇయర్ పరీక్షలు, పూర్తి టైమ్‌టేబుల్ ఇదే..
Telangana Govt Scheme: విదేశాల్లో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న తెలంగాణ యువతకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వీసా, విమాన టికెట్లు, విదేశీ భాషా శిక్షణ వంటి ఖర్చులు భరించలేక వెనుకడుగు వేస్తున్న ఆర్థికంగా వెనుకబడిన యువతకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా విదేశాల్లో సురక్షితంగా, చట్టబద్ధంగా ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన ఖర్చుల్లో 50 శాతం వరకు సబ్సిడీ అందించనుంది. అవసరాన్ని బట్టి గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ద్వారా ఈ పథకం అమలు కానుంది.
ఈ ఏడాది 7 వేల మందికి ఆర్థిక సాయం
ఆర్థికంగా వెనుకబడిన యువత విదేశాల్లో ఉపాధి పొందేలా చేయడమే సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ప్రధాన లక్ష్యం. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7 వేల మందికి ఈ పథకం ద్వారా సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే అభ్యర్థులను రెండు కేటగిరీలుగా విభజించి సబ్సిడీ అందించనున్నారు.
మొదటి కేటగిరీ.. రూ.50 వేల వరకు సబ్సిడీ
విదేశీ భాషా శిక్షణ అవసరం లేకుండా నేరుగా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే అభ్యర్థులను మొదటి కేటగిరీలో చేర్చారు. ఈ విభాగంలో 5,880 మందికి సాయం అందించనున్నారు.
వీసా, విమాన టికెట్లు తదితర ఖర్చుల కోసం ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.లక్ష వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులో 50 శాతం అంటే గరిష్ఠంగా రూ.50 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. మిగిలిన ఖర్చును అభ్యర్థి భరించాల్సి ఉంటుంది.
రెండో కేటగిరీ.. రూ.1.75 లక్షల వరకు సాయం
విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ముందు భాషా శిక్షణ తీసుకోవాల్సిన అభ్యర్థులను రెండో కేటగిరీలో చేర్చారు. వీరికి వీసా, విమాన టికెట్లు, భాషా శిక్షణ తదితర ఖర్చుల కోసం సుమారు రూ.3.50 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
ఈ మొత్తంలో 50 శాతం సబ్సిడీగా గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు ప్రభుత్వం అందించనుంది. మిగిలిన ఖర్చును అభ్యర్థులు భరించాలి.
డబ్బులు లేని వారికి బ్యాంకు రుణ సదుపాయం
విదేశీ ఉద్యోగాలకు వెళ్లాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఖర్చులు భరించలేని యువతకు టామ్‌కామ్ మరో అవకాశం కల్పిస్తోంది. జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు అవసరమైన సహకారం అందించనుంది. దీంతో సొంతంగా డబ్బులు లేకపోయినా అర్హులైన అభ్యర్థులు విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
10 రంగాల్లో విదేశీ ఉద్యోగాలకు అవకాశం
ఈ పథకం ద్వారా పలు రంగాల్లో విదేశీ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు సాయం అందించనున్నారు. ప్రధానంగా కింది రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
- నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాలు
- తయారీ రంగం
- ఆటోమొబైల్, మెకానికల్
- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్
- రవాణా, లాజిస్టిక్స్
- ఫెసిలిటీ మేనేజ్మెంట్
- మెడికల్ సపోర్ట్
- హోటల్, టూరిజం
- మెయింటెనెన్స్
- పర్సనల్ సర్వీసెస్
అర్హతలు ఏమిటి?
ఈ పథకం ద్వారా సబ్సిడీ పొందాలనుకునే అభ్యర్థులు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి.
- అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
- 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలో చదివి ఉండాలి.
- ఐటీఐ అర్హతతో ఉద్యోగాలకు వెళ్లేవారు తెలంగాణలోని గుర్తింపు పొందిన సంస్థలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత ఉద్యోగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
- అవసరమైన వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.
- రేషన్ కార్డు ఆధారంగా ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
పథకానికి దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలి.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- పాస్‌పోర్ట్
- విద్యార్హతల సర్టిఫికెట్లు
- ఉద్యోగ అనుభవ ధ్రువీకరణ పత్రం
- అవసరమైతే విదేశీ భాషా శిక్షణ సర్టిఫికెట్
టామ్‌కామ్ ఆన్లైన్ పోర్టల్‌లోనే దరఖాస్తు
ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను టామ్‌కామ్ ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు చేసిన ఖర్చులకు సబ్సిడీ వర్తించదు. కాబట్టి ముందుగా పథకానికి దరఖాస్తు చేసుకుని, అనుమతి పొందిన తర్వాతే సంబంధిత ఖర్చులు చేయడం మంచిది. TOMCOM అధికారిక వెబ్సైట్: tomcom.telangana.gov.in
సబ్సిడీకి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు
విదేశీ భాషా పరీక్షలు, వీసా వంటి వాటికి సబ్సిడీ ఒక్కసారి మాత్రమే అందిస్తారు. మొదటి ప్రయత్నంలో అర్హత సాధించకపోతే.. తదుపరి ప్రయత్నాలకు అయ్యే ఖర్చులను అభ్యర్థులే భరించాలి.
అలాగే పథకం ప్రక్రియ మధ్యలో అభ్యర్థి తప్పుకుంటే తదుపరి దశల్లో సబ్సిడీ నిలిపివేస్తారు. తప్పుడు సమాచారం ఇవ్వడం, నకిలీ పత్రాలు సమర్పించడం లేదా సబ్సిడీ నిధులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడితే లబ్ధిదారుల ఎంపికను రద్దు చేస్తారు. ఇప్పటికే అందించిన సబ్సిడీ మొత్తాన్ని తిరిగి వసూలు చేసే అవకాశం కూడా ఉంది.
విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో వెనుకడుగు వేస్తున్న తెలంగాణ యువతకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మంచి అవకాశంగా మారనుంది. సరైన అర్హతలు, అవసరమైన పత్రాలు కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పథకాన్ని వినియోగించుకుని విదేశీ ఉపాధి కలను సాకారం చేసుకోవచ్చు.