లైట్లు బంద్ చేసి మాపై హత్యాయత్నం…బావర్చీ హోటల్ ఘటనపై మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు…
బావర్చి హోటల్లో తమపై జరిగిన దాడి హత్యాయత్నం చేసేందుకేనని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. హోటల్లోకి సుమారు 200 మంది వచ్చి లైట్లు బంద్ చేసి తమపై దాడికి ప్రయత్నించారని, కారును ధ్వంసం చేసేందుకు యత్నించారని ఆరోపించారు. తెలంగాణ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ, జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నించడానికి మాత్రమే తాము హోటల్‌కు వెళ్లామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏమిటని నిలదీశారు.
హామీలను గుర్తు చేయడమే మా ఉద్దేశం..
2023లో ఇదే బావర్చి హోటల్లో రాహుల్ గాంధీ కూర్చున్న వేదికపై, ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేయడమే తమ ఉద్దేశమని మన్నె క్రిశాంక్ తెలిపారు. తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
తాము ఎలాంటి దాడులు చేయడానికి వెళ్లలేదని, హోటల్ యాజమాన్యాన్ని కానీ, అక్కడ ఉన్న కస్టమర్లను కానీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదని చెప్పారు. బిర్యానీ తింటూ, మీడియా సమక్షంలో ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను గుర్తు చేయాలనుకున్నామని వివరించారు. తాము వెళ్లే విషయాన్ని మీడియాకు ముందుగానే చెప్పామని, దొంగతనంగా వెళ్లాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు కాకపోయినా దాడులు చేస్తారా?
తమపై దాడి చేయడానికి రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఆయన సోదరుడు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చినట్లు మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఆ వేదికపై ఉన్నవారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ లేరని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన విద్యార్థి నాయకులు, ఉన్నత విద్యావంతులు, వివిధ రంగాల్లో స్థిరపడినవారు ఉన్నారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన తాము నిరుద్యోగ యువత తరఫున ప్రశ్నించడానికి వెళ్లామని, అలాంటి వారిపై దాడులు చేయడం సరికాదని అన్నారు. రాజ్యసభ ఎంపీ వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి దాడికి నాయకత్వం వహించారని ఆరోపించడం తీవ్ర చర్చకు దారితీసింది.
లైట్లు ఆర్పి దాడి చేశారని ఆరోపణ..
హోటల్లోకి వచ్చినవారు లైట్లు బంద్ చేసి తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తమ బట్టలు చింపి, రక్తం వచ్చేలా కొట్టి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని అన్నారు. తమపై దాడి చేసిన వీడియోలను కొందరు ‘బిఫోర్, ఆఫ్టర్’ అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ప్లేట్లు విసరడం, కస్టమర్లు ఉన్నారనే విషయాన్ని పట్టించుకోకపోవడం, తమ సహచరులపై దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనలో తమకు గాయాలయ్యాయని, దాడి చేసినవారు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి సంతృప్తి పొందడం సాడిజం కాదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌కు ఈ దాడుల సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది?
తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఎప్పుడూ ప్రత్యర్థులపై ఇలాంటి దాడులు చేయలేదని మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. హోటళ్లపై దాడులు చేయడం, కస్టమర్లను భయపెట్టడం, వ్యక్తులపై భౌతిక దాడులకు దిగడం తమ రాజకీయ సంస్కృతి కాదన్నారు.
గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలో దాడికి ప్రయత్నించారని, గ్లోబల్ కంపెనీ ఫేస్బుక్ కార్యాలయం, నటుడు అల్లు అర్జున్ నివాసం, యాదాద్రి బోర్డు అంశాల్లోనూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాడులు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఇప్పుడు తమపై జరిగిన ఘటన కూడా అదే తరహాలో ఉందని విమర్శించారు.
రక్తం చూపించి ఆనందపడతారా?
తమపై దాడి జరిగిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ కొందరు ఆనందపడుతున్నారని మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రక్తం చూసి, బట్టలు చింపిన వీడియోలు చూసి ఎలాంటి సంతృప్తి పొందుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలో ఉందని రోడ్లపై రౌడీల్లా వ్యవహరించడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఈ ఘటనపై స్పందించాలని కోరారు. తమను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, జైళ్లకు పంపించడం, కుటుంబ సభ్యులను బెదిరించడం వంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పుడు భౌతిక దాడులకు దిగడం ద్వారా ప్రజాస్వామ్య స్వేచ్ఛను అణచివేయలేరని వ్యాఖ్యానించారు.
దాడులు కాదు.. ఉద్యోగాలు భర్తీ చేయండి!
చివరగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మన్నె క్రిశాంక్ విజ్ఞప్తి చేశారు. తమపై దాడులు చేసినా, సోషల్ మీడియాలో వీడియోలు ప్రచారం చేసినా తమకు అభ్యంతరం లేదని, కానీ తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చాలని అన్నారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. యువతకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడం తప్ప తమకు మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.