ఆమె ప్రకృతిలో సగం …ఆమె భద్రత మన కర్తవ్యం
Woman
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
ప్రకృతిలో సగం ఆమె. మానవ జనన కారణమూర్తి ఆమె. ఇంటికి దీపం ఆమె మనస్సు. ఆమె చేతి వంటే అమృతం. మహిమాన్విత శక్తి రూపం ఆమె. చదువుల తల్లి సరస్వతి, సంపదలు చేకూర్చే తల్లి లక్ష్మి, ధైర్యానికి చిరునామా దుర్గ మాత. ఈ మహాశక్తి స్వరూపాలు అతివలే. అబలలు కాదు, అష్టలక్ష్ములు మహిళామణులే. ఆమె లేనిదే పూట గడవదు, ముద్ద దిగదు. అయినా ఆమె అంటే పురుషాధిక్య సమాజానికి చిన్న చూపు. నేడు ఆమె ఓ ఆట వస్తువు. ఆమెను చూస్తే మృగాళ్లలో రాక్షసుడు నిద్ర లేస్తాడు. ఆమె ద్వితీయ శ్రేణి పౌరురాలు. ఆవిడంటేనే పురుష పుంగవులకు చులకన. ఆమెపై లైంగిక దాడులు, అత్యాచారాలు, మానభంగాలు, అక్రమ రవాణాలు, భ్రూణహత్యలు, గృహ హింసలు, వేధింపులు నిత్యకృత్య దుశ్శాసన పర్వాలు గుర్తుకు వస్తాయి. కార్యసిద్ధిలో లేని మగతనం మగువను చూడగానే మృగతనమై రెచ్చిపోతుంది. బాల్య వివాహ బంధనాలు, బాలకార్మిక చేష్టల చట్రాలు వాస్తవంలోకి వస్తాయి.
ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం!
మనతో చెల్లి, తల్లి, కూతురు ఉందని మరిచి ఆవిడపై అత్యాచారాలకు ఒడిగడుతున్న డిజిటల్ మృగ సమాజంలో లెక్కలేనన్ని దురాగతాలు జరుగుతున్నాయి. ఏరులై పారుతున్న మహిళల
కన్నీళ్లను చూసి పౌర సమాజంలో ఇసుమంతైనా మానవత్వం కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 35 శాతం మహిళలు తమ జీవితకాలంలో ఏదో ఒక రకమైన లైంగిక వేధింపులకు గురికావడం, వీరిలో 40 శాతం అబలలు వేధింపుల నుంచి సహాయం కోరడం, 10 శాతం వరకు మాత్రమే న్యాయంకోసం కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతున్నది. మహిళపై అత్యాచారం జరిగినపుడు పౌర సమాజం ఉద్యమించడం, రెండు రోజులకే చల్లబడడం, పాత వెతలే తిరిగి జరగడం అనాదిగా జరుగుతోంది. ప్రతి రోజు ఏదో ఒక మూలన మానభంగ మహిళ మౌన రోదన గొంతు దాటడం లేదు. విని స్పందించడానికి బదులు ఎగతాళి, అవమానం చేయడమనే దురలవాట్లు మొలుస్తున్నాయి.
ఐరాస అంచనాల ప్రకారం, మానవ అక్రమ రవాణా చట్రంలో 71శాతం మంది మహిళలే ఉంటున్నారు. కేవలం 52 శాతం గృహిణులు మాత్రమే కొంత స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ప్రపంచంలో అధిక రేప్ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో దక్షిణ ఆఫ్రికా, బోత్స్వానా, స్వీడెన్, గ్రనెడా, యుఎస్‌లు ముందు వరసలో ఉన్నాయి. అమెరికాలో 9 శాతం రేపిస్టుల పై విచారణలు జరుగగా, అందులో 3 శాతం వర కు మాత్రమే శిక్షలు పడడం, 97 శాతం రేపిస్టులు స్వేచ్ఛగా బయట పడడం గమనిస్తున్నాం. మహిళ లు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులు జరిగినా వాటిని బయట పెట్టడానికి స్త్రీ సమాజం వెనుకంజ వేయడంతో మగ మహా రాక్షసుల ఆగడాలకు అంతం కనుపించడం లేదు.
భారత్‌లో మహిళలపై అత్యాచారాలు:
ప్రపంచవ్యాప్త మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హింసాత్మక ధోరుణులను గమనించిన ఐరాస 2000 నుంచి ప్రతి ఏట 25 నవంబర్ రోజున అంతర్జాతీయ మహిళా
అత్యాచార వ్యతిరేక దినం పాటించడం ఆనవాయితీగా మారింది. అంతర్జాతీయ మహిళా అత్యాచార వ్యతిరేక దినం- 2026 ఇతివృత్తంగా మహిళలు, బాలికలపై హింస అంతానికి అందరం ఏకమవుదా: న్యాయ కల్పన, బాధితుల సంరక్షణ, అత్యాచార దోషులను శిక్షించడం అనబడే అంశాన్ని తీసుకోవడం జరిగింది. మహిళా హింసకు నో చెప్పాలం టూ యునెస్కో 25 నవంబర్ నుంచి 10 డిసెంబర్ వరకు 16 రోజుల పాటు లింగ-ఆధార హింసలకు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహిస్తున్నది. ప్రపంచ మానభంగాల రేటు ఆధార 120 దేశాల జాబితా లో భారత్‌కు 95వ స్థానం దక్కడం విచారకరం.
భారత్‌లో తరుచుగా నిర్భయ, హత్రాస్ ఘటనలు ఎన్ని జరిగిన తాత్కాలిక చర్యలకు మాత్రమే ప్రభుత్వాలు పూనుకోవడం దురదృష్టకరం, ఆక్షేపణీయం. ఇండియాలో ప్రతి లక్ష మందిలో 4.2శాతం రేప్‌లు జరుగుతున్నాయని, రేప్ కేసులు అధికంగా (20 నుంచి 10 శాతం) చంఢీఘడ్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, హర్యానా, అస్సాం, హిమాచల్ ప్రాంతాల్లో నమోదు అవుతున్నాయి. రేప్ కేసు లు అత్యల్పంగా (1 నుంచి 1.6 శాతం వర కు) గుజరాత్, కర్నాటక, తమిళనాడు, నాగాలాండ్ రాష్ట్రాల్లో నమోదు కావడం గమనించారు. తెలంగాణలో 4.7శాతం, ఎపిలో 4.2శాతం రేప్ కేసులు బయట పడుతున్నాయి. గత దశాబ్ద కాలం గా రేప్ కేసులు రెట్టింపు కావడాన్ని ప్రమాద హెచ్చరికగా భావించాలి.
బాలికల అక్రమ రవాణా దుర్మార్గాలు:
మానవ హక్కుల సంస్థ గణాంకాల ప్రకారం, భారత్‌లో ప్రతి ఏట 7,200 మైనర్ బాలికలు
(లక్షకు 1.6శాతం) మానభంగాలకు గురి కావడం భరతజాతికే సిగ్గు చేటు. బాలికల అక్రమ రవాణా, ఆ చిన్నారులను వ్యభిచార నరక కూపాల్లో బంధించడం యద్ధేచ్ఛగా కొనసాగుతోంది. దేశ జనాగ్రహావేశాలను చవి చూసిన ఢిల్లీ నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడడానికి 6 ఏండ్ల కాలం పట్టింది. అధిక శాతం మానభంగాలు 15- ఏండ్ల యువతుల్లోనే కనిపించడం, 70 శాతం మానభంగ నిందితులు తెలిసిన వారే కావడం సోచనీయం. మానభంగాల తర్వాత అతివలను హత్య చేయడం కూడా సాధారణంగా జరుగుతున్న వేళ, ఈ దుశ్చర్యలకు చరమగీతం పాడడానికి ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగాలు, పౌర సమాజం సమన్యయంతో కృషిచేసి మానవ మృగాలకు చుక్కలు చూపించడం, ఉరితీసి నరకానికి పంపడం వెంట వెంటనే జరగాలి.
విద్యాలయాల్లో రేపటి యువతకు విలువలతో కూడిన విద్యను బోధించాలి. యూనివర్సిటీ డిగ్రీల కన్న మానవీయ విలువలే మిన్నయని తెలియజేయాలి. భరత మాత ముద్దు బిడ్డలుగా అమ్మాయిల ను రక్షించాలి. మహిళకు విద్య అనే ఆయుధమిచ్చి సబలగా శక్తివంతం చేయాలి. మానభంగాలు లేని ప్రపంచాన్ని చూడడానికి అందరం విలువలతో కూడి క్రమశిక్షణతో జీవించాలి. ఈ మహాయజ్ఞంలో మనందరం భాగస్వాములమై ప్రతి మహిళలో భరతమాతను దర్శిస్తూ ముందు కుసాగుదాం. ఇకనైనా భారతీయ వనిత కన్నీ టి వరదల కట్టడికి ఆనకట్టలు కడదాం.