యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన ఎస్పీ.. కేవలం 26 సీట్లు మాత్రమే కేటాయిస్తామని ప్రకటన..
SP deals a blow to Congress in UP elections; announces it will allocate only 26 seats.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పొత్తుల వేడి మొదలైంది. అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు ఆసక్తికరంగా మారాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు 26 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని ఎస్పీ భావిస్తున్నట్లు సమాచారం.
ఎస్పీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌కు ఇచ్చే స్థానాలపై ఒక ప్రాథమిక జాబితాను సిద్ధం చేశారు. ఇందులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రాంపూర్ ఖాస్, ఫరెండా స్థానాలతో పాటు 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచిన మథుర, ఖేరాగఢ్, జగదీష్పూర్, కిద్వాయ్ నగర్ నియోజకవర్గాలను కూడా ఈ జాబితాలో చేర్చారు.
ఇక మిగిలిన 20 స్థానాలుగా బాగ్పట్, మోదీనగర్, హాపూర్, జేవర్, సియానా, ఖుర్జా, ఖైర్, ఇగ్లాస్, మంత్, ఆగ్రా నార్త్, ఫతేపూర్ సిక్రీ, బిల్గ్రామ్-మల్లావన్, గోవింద్ నగర్, నాన్‌పారా, గోరఖ్‌పూర్ అర్బన్, ఖజనీ, పడ్రౌనా, ఫాజిల్‌నగర్, పింద్రా, వారణాసి కంటోన్మెంట్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఖ్యకు ఇంకా తుది రూపు రాలేదని, చర్చలు సానుకూలంగా సాగితే కాంగ్రెస్‌కు కేటాయించే స్థానాలు పెరిగే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
120 స్థానాల జాబితా ఇచ్చిన కాంగ్రెస్
మరోవైపు సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ కూడా తన వైఖరిని స్పష్టం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 120 నియోజకవర్గాలతో కూడిన జాబితాను ఎస్పీ నాయకత్వానికి అందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్థానాలను మూడు విభాగాలుగా విభజించినట్లు సమాచారం. అత్యంత ప్రాధాన్యం ఉన్న 55 స్థానాలను ఏ కేటగిరీలో చేర్చగా, గతంలో పార్టీకి మంచి ఫలితాలు వచ్చిన నియోజకవర్గాలను బీ కేటగిరీగా గుర్తించారు. గెలుపునకు అవకాశాలు ఉన్న స్థానాలను సీ కేటగిరీలో ఉంచారు.
అయితే అంతకుముందు కాంగ్రెస్ 181 స్థానాలతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా 120 స్థానాలతో ప్రతిపాదన ముందుకు రావడం సీట్ల సర్దుబాటు చర్చల్లో పార్టీ తన ప్రాధాన్యాలను క్రమబద్ధీకరిస్తోందనే సంకేతాలను ఇస్తోంది.
60 నుంచి 70 సీట్లకు కాంగ్రెస్ ఓకే చెబుతుందా?
ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ కాంగ్రెస్‌కు 26 స్థానాలు ఇచ్చినట్లు వెల్లడించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 23న ఇరు పార్టీల ముఖ్య నేతలు తొలిసారిగా సమావేశమై సుమారు 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అయితే ఈ భేటీలో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం లేదు. త్వరలో మరోసారి సమావేశమై చర్చలను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎక్కువ సంఖ్యలో స్థానాలను కోరుకుంటున్నప్పటికీ, ఎస్పీ నాయకత్వం మాత్రం పరిమిత స్థానాలకే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు 60 నుంచి 70 స్థానాలు కేటాయిస్తే సరిపోతుందని కొందరు ఎస్పీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దీంతో ఇరు పార్టీల మధ్య ఎన్ని స్థానాల వద్ద ఒప్పందం కుదురుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు?
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందుగానే కూటమి బలాన్ని పెంచుకోవాలని ఎస్పీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. అయితే సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల ఆశలు, అంచనాలు ఎంతవరకు కలుస్తాయన్నది కీలకం కానుంది.
ముఖ్యంగా కాంగ్రెస్ కోరుకుంటున్న స్థానాల సంఖ్యకు, ఎస్పీ కేటాయించాలనుకుంటున్న సీట్లకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ విభేదాలను అధిగమించి రెండు పార్టీలు ఒకే నిర్ణయానికి వస్తాయా? లేక సీట్ల విషయంలో మరింత చర్చ అవసరమవుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.