Skip to content
జాతీయం › వార్తలు

అక్షరాన్ని అమ్మకానికి పెట్టి భవిష్యత్తును తాకట్టు పెడుతున్నామా ?

Prajapaksham 14 Nov 2026 0 నిమిషాల పఠనం జాతీయం
అక్షరాన్ని అమ్మకానికి పెట్టి భవిష్యత్తును తాకట్టు పెడుతున్నామా ?

When Will the Reins Be Tightened on Private Schools? (Photo Credit: AI Generated Image)

ఒక దేశాన్ని నాశనం చేయడానికి బాంబులు వేయాల్సిన అవసరం లేదు. ఆదేశ విద్యావ్యవస్థను బలహీనపరిస్తే చాలు. తరతరాల భవిష్యత్తు తనంతట తానే చీకటిలోకి జారిపోతుంది! విద్య మనిషికి మూడో కన్ను. అజ్ఞానపు చీకట్లను తొలగించి, ఆలోచనకు వెలుగునిచ్చి, సమాజాన్ని అభివృద్ధి వైపు నడిపించే మహత్తర శక్తి. అక్షరం మనిషిని బానిసత్వం నుంచి విముక్తి చేస్తుంది. జ్ఞానం ప్రశ్నించడం నేర్పుతుంది. విద్య వివేకాన్ని పెంపొందిస్తుంది. అందుకే విద్యను ఒక హక్కుగా, సామాజిక మార్పుకు సాధనంగా, దేశ భవిష్యత్తుకు పునాదిగా మనం గుర్తించాం. కానీ నేడు అదే విద్య ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకప్పు డు జ్ఞానాన్ని పంచిన విద్యాసంస్థలు ఇప్పుడు ఎంతమేరకు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి? విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన వ్యవస్థ, వారి తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని పరీక్షించే యంత్రంగా మారుతోందా? ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన చోట డబ్బు, మార్కెట్‌ శక్తులకు ప్రాధాన్యం పెరుగుతోందా? ఇవి సాధారణ ప్రశ్నలు కావు.

అక్షరానికి వెలకట్టిన వ్యవస్థ!
ఒకప్పుడు పాఠశాల అంటే పిల్లల భవిష్యత్తుకు పునాది. గురువు అంటే జ్ఞానాన్ని పంచే మార్గదర్శి. విద్య అంటే జీవితాన్ని అర్థం చేసుకునే సాధనం. కానీ నేడు కొన్ని చోట్ల విద్యాసంస్థల ప్రకటనలు, ప్రవేశాల పోటీ, అధిక ఫీజులు, ర్యాంకుల ప్రచారం చూస్తుంటే విద్య తన అసలు లక్ష్యానికి దూరమవుతోందనే ఆందోళన కలుగుతోంది. ప్రవేశం కోసం ఫీజు, పుస్తకాల కోసం డబ్బు, యూనిఫాం కోసం ఖర్చు, ప్రత్యేక తరగతుల కోసం అదనపు భారం, పరీక్షల కోసం మరో వ్యయం! ఇలా విద్య పేరుతో కుటుంబాలపై పడుతున్న ఆర్థిక ఒత్తిడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని పిల్లల చదువుకోసమే ఖర్చు చేస్తున్నాయి. పేద కుటుంబాలు మాత్రం తమ పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే ఆశకు, ఆర్థిక పరిమితులకు మధ్య నలిగిపోతున్నాయి. విద్యను అందించాల్సి న వ్యవస్థే ఆర్థిక స్థోమతను ప్రవేశ అర్హతగా మార్చే పరిస్థితి ఏర్పడితే, సమాన అవకాశాల గురించి మాట్లాడటం లో అర్థమేమిటి? డబ్బున్నవాడి ప్రతిభకు వేదికలు విస్తరి స్తూ, డబ్బులేనివాడి ప్రతిభకు తలుపులు మూసుకుపోతే, అది విద్యా అభివృద్ధి కాదు సామాజిక అసమానతకు కొత్త రూపం! ప్రభుత్వ విద్య బలహీనమైతే పేదవాడి భవిష్యత్తు బలహీనమైనట్టే! ప్రభుత్వ పాఠశాలలు ప్రజాస్వా మ్య సమాజానికి వెన్నెముకలు. పేద, ధనిక, గ్రామీణ, పట్టణ భేదాలకు అతీతంగా ప్రతి చిన్నారికి విద్య అందించాలనే లక్ష్యంతో అవి ఏర్పడ్డాయి. ఎన్నో తరాలకు అక్షరజ్ఞానాన్ని అందించి, సామాజిక చలనశీలతకు దారులు తెరిచాయి. అయితే నేడు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లోపం, తగిన బోధనా వనరులు లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఒకేలా లేకపోయినా, ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయలేం. ప్రభుత్వ పాఠశాలల నాణ్యతపై ప్రజల్లో విశ్వా సం పెంచడం పాలకుల బాధ్యత. పాఠశాలల భవనాలను నిర్మించడం ఎంత ముఖ్యమో, తరగతి గదుల్లో నాణ్యమైన బోధన అందించడం అంతకంటే ముఖ్యం. కంప్యూటర్లు కొనుగోలు చేయడం ఎంత అవసరమో, వాటిని ఉపయోగించి విద్యార్థులకు బోధించగల ఉపాధ్యాయులను సిద్ధం చేయడం అంతే అవసరం. ప్రభుత్వ విద్య బలహీనపడితే ప్రత్యామ్నాయాలను కొనుగోలు చేయగలవారు ముందు కు సాగుతారు. కొనుగోలు చేయలేనివారు వెనుకబడిపోతారు. ఈ అంతరమే భవిష్యత్తులో ఆదాయ అసమానతల ను, అవకాశాల అసమానతలను మరింత పెంచుతుంది. ప్రభుత్వ విద్యాసంస్థల పతనం అంటే కేవలం పాఠశాలల పతనం కాదు; పేదవాడి కలల పతనం, సమానత్వపు ఆశయాల పతనం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎదురుదెబ్బ!

కార్పొరేట్‌ విద్య
ర్యాంకుల వెనుక రహస్యమేమిటి? విద్యారంగంలో ప్రైవేటు సంస్థల పాత్రను పూర్తిగా నిరాకరించలేం. అనేక సంస్థలు నాణ్యమైన విద్య, ఆధునిక సదుపాయాలు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. సమస్య ప్రైవేటు రంగం ఉనికిలో లేదు; విద్యార్థి ప్రయోజనాల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇచ్చే ధోరణిలో ఉంది. ర్యాంకుల ప్రకటనలతో తల్లిదండ్రులను ఆకర్షించడం, విజయవంతమైన విద్యార్థుల ఫలితాలను ప్రచార సాధనాలుగా ఉపయోగించడం, ప్రవేశాల కోసం పోటీ వాతావరణాన్ని సృష్టించడం కొన్ని సంస్థల్లో కనిపించే ధోరణులు. కానీ ఆ ర్యాంకుల వెనుక విద్యార్థులపై ఎంత ఒత్తిడి ఉంది? వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉంది? ప్రతి విద్యార్థికి వ్యక్తిగత శ్రద్ధ లభిస్తోందా? చదువులో వెనుకబడినవారికి ప్రోత్సాహం అందుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా కేవలం ఫలితాల ఆధారంగా విద్యా నాణ్యతను నిర్ణయించలేం. విద్యార్థి ఒక ర్యాంకు కాదు. అతడు ఒక జీవితం. ఒక కుటుంబం పెట్టుకున్న ఆశ. ఒక సమాజం నమ్ముకున్న భవిష్యత్తు. ఆ జీవితాన్ని మార్కుల పట్టికలోని అంకెలకు పరిమితం చేయడం విద్య పట్ల అన్యాయం చేయడమే.

మార్కుల వేటలో బలవుతున్న బాల్యం!
నేటి విద్యార్థి జీవితం పోటీతో ప్రారంభమై, పోటీతోనే ముగుస్తున్నదనే భావన అనేక కుటుంబాల్లో కనిపిస్తోంది. చిన్న వయసులోనే ప్రవేశ పరీక్షలు, ప్రత్యేక తరగతులు, నిరంతర పరీక్షలు, ర్యాంకుల పోటీ విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలు తమ సహజమైన ఆసక్తులను కోల్పోయే ప్రమాదం ఉంది. నేర్చుకోవడంలోని ఆనందం తగ్గి, పరీక్షల్లో విజయం సాధించాలనే భయం పెరుగుతుంది. తల్లిదండ్రులు ఒక విషయం గుర్తించాలి. పిల్లల భవిష్యత్తు పట్ల ఆందోళన సహజమే. కానీ ఆ ఆందోళన వారి బాల్యాన్ని హరించకూడదు. పిల్లల ప్రతిభను గుర్తించాలి; ఇతరులతో పోల్చి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు. నేటి విద్యావ్యవస్థలో నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇవన్నీ అవసరమే. అయి తే మానవీయ విలువలు, సామాజిక బాధ్యత, శాస్త్రీయ దృక్పథం, రాజ్యాంగ స్ఫూర్తి, పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామిక ఆలోచనలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థి ఆలోచించే సామర్థ్యాన్ని, ప్రశ్నించే ధైర్యా న్ని, తప్పును గుర్తించే శక్తిని పెంపొందించినప్పుడే విద్య సమాజానికి నిజమైన సంపదగా మారుతుంది.


డిజిటల్‌ విప్లవం అందరిదా? కొందరిదేనా?

సాంకేతిక పరిజ్ఞానం విద్యారంగంలో అనేక మార్పులకు దారితీస్తోంది. ఆన్‌లైన్‌ తరగతులు, డిజిటల్‌ పుస్తకాలు, కృత్రిమ మేధస్సు, ప్రపంచవ్యాప్త విజ్ఞాన వనరులు విద్యార్థులకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. అయితే సాంకేతిక సదుపాయాలు అందరికీ సమానంగా అందుబాటులో లేకపోతే ఈ విప్లవం కొత్త అసమానతలను సృష్టించవచ్చు. డిజిటల్‌ విద్యను ప్రవేశపెట్టడమే కాకుండా, దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. సాంకేతికత ఉపాధ్యాయుడికి సహాయకారిగా ఉండాలి. విద్యార్థి స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించాలి.

ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఇదే ఈ చర్చలో అత్యంత కీలకమైన ప్రశ్న. విద్య వ్యాపారీకరణతో కొందరికి ఆర్థిక లాభాలు రావచ్చు. అధిక ఫీజులు వసూలు చేయగల సంస్థలు అభివృద్ధి చెందవచ్చు. విద్యను మార్కెట్‌ అవకాశంగా చూసే వర్గాలు తమ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. కానీ ఆ ప్రక్రియలో నాణ్యమైన విద్య పేద విద్యార్థికి అందకపోతే, తల్లిదండ్రులు అప్పులపాలైతే, ప్రతిభావంతులైన యువత ఆర్థిక పరిమితుల వల్ల అవకాశాలను కోల్పోతే, సమాజం మొత్తానికి నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టం వెంటనే కనిపించకపోవచ్చు. కానీ కాలక్రమేణా అది నిరుద్యోగం, అసమానత లు, అవకాశాల కొరత, సామాజిక అసంతృప్తి రూపంలో బయటపడవచ్చు. అందువల్ల ప్రశ్న కేవలం ఎవరు డబ్బు సంపాదిస్తున్నారు అనేది కాదు. విద్య ద్వారా ఎవరు అభివృద్ధి చెందుతున్నారు? ఎవరు వెనుకబడిపోతున్నారు? ఎవరి కలలకు రెక్కలు వస్తున్నాయి? ఎవరి ఆశలు ఆర్థిక భారాల కింద నలిగిపోతున్నాయి? అనేదే అసలు ప్రశ్న.

మార్పు కావాలి వ్యవస్థలోనూ, దృక్పథంలోనూ!
విద్యారంగాన్ని విమర్శించడం మాత్రమే పరిష్కారం కాదు. ఆ విమర్శ మార్పుకు దారితీయాలి. ప్రభుత్వ పాఠశాలలకు తగిన నిధులు కేటాయించాలి. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి. నాణ్యమైన బోధన, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, డిజిటల్‌ సదుపాయా లు కల్పించాలి. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల విషయం లో పారదర్శకత ఉండాలి. విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, బోధనా నాణ్యతపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలి. ముఖ్యంగా, విద్యను కొందరి వ్యాపార ప్రయోజనాలకు పరిమితమైన వస్తువుగా కాకుం డా, సమాజ భవిష్యత్తుకు సంబంధించిన ప్రజా బాధ్యతగా చూడాలి.

ముగింపు:
పాఠశాలలు బతికితేనే సమాజం బతుకుతుంది! ఒక దేశ భవిష్యత్తు పార్లమెంటు భవనాల్లో మాత్రమే నిర్ణయించబడదు. అది తరగతి గదుల్లోనూ రూపుదిద్దుకుంటుంది. ఒక ఉపాధ్యాయుడు చెప్పే మాట లో, ఒక విద్యార్థి అడిగే ప్రశ్నలో, ఒక పేద చిన్నారి కళ్లలో మెరిసే ఆశలో దేశ రేపటి రూపం దాగి ఉంటుంది. విద్యారంగంలో మార్పులు రావాలి. ఆధునికత రావాలి. సాంకేతికత రావాలి. ప్రైవేటు భాగస్వామ్యం ఉండవచ్చు.కానీ వీటన్నింటి కంటే ముందుగా మానవత్వం ఉండాలి. సమానత్వం ఉండాలి. సామాజిక బాధ్యత ఉండాలి. విద్య హక్కుగా నిలిస్తే కోట్లాది జీవితాల్లో వెలుగులు పెరుగుతాయి. పాఠశాల గడప దాటలేని పేదవాడి బిడ్డకు విద్య అందిన రోజే ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో గెలుస్తుంది. అక్షరానికి ధర నిర్ణయించడం ఆగి, ప్రతి బిడ్డకు జ్ఞానం హక్కుగా అందిన రోజే విద్యావ్యవస్థ తన ధర్మాన్ని నెరవేర్చినట్లవుతుంది!
శ్రీనివాస్‌ జీడిపల్లి.

ట్యాగ్‌లు: national news