Former IPS Officer’s Wife Murder Case: మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నేపాల్ బోర్డర్‌లో కల్పన గ్యాంగ్ అరెస్ట్..
Hyderaabd CP Sajjanar Reviews Safety Measures with Educational Institutions
Former IPS Officer’s Wife Murder Case: నగరంలోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో కలకలం రేపిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య తనూజ రంజన్ దారుణ హత్య కేసును హైదరాబాద్ నగర పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ దారుణ ఘాతకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితురాలు కల్పనతో పాటు మరో ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 7న తనూజ రంజన్ ఇంట్లో పనిమనిషిగా చేరురిన కల్పన, తన అనుచరులతో కలిసి ఆమెను దారుణంగా హత్య చేసింది. అనంతరం ఇంట్లోని కోట్లాది రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకుని బీహార్ మీదుగా నేపాల్ దేశానికి పరారయ్యారు.
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసు యంత్రాంగం, నిందితుల కోసం గత ఐదు నెలలుగా తీవ్రంగా గాలించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ , టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ నుంచి మూడు దఫాలుగా నేపాల్ వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందాలు సాధారణ పౌరుల్లా వేషధారణ మార్చుకుని, స్థానికులతో మమేకమై రహస్యంగా నిందితుల కదలికలపై నిఘా పెట్టాయి.
దాదాపు 25 రోజుల పాటు నేపాల్‌లోనే మకాం వేసిన పోలీసులు, కల్పన కుమారుడి కదలికల ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టారు. నేపాల్ చట్టాలు , అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి నేపాల్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ , నేపాల్ గ్యాంగ్ అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ అధికారికంగా మీడియాకు వెల్లడించారు.