Skip to content
జాతీయం › వార్తలు

Delhi Ramlila Grounds: రాంలీలా మైదానాల కేటాయింపులో పారదర్శకత ఉండాలి.. అధికారులకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

jagan 13 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Delhi Ramlila Grounds: రాంలీలా మైదానాల కేటాయింపులో పారదర్శకత ఉండాలి.. అధికారులకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Delhi High Court: విడాకులు మంజూరైనా భార్యకు అప్పటిదాకా భర్త భరణం చెల్లించాల్సిందే.. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..

Delhi Ramlila Grounds: రాంలీలా ఉత్సవాలు, ఇతర సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వ మైదానాలను కేటాయించే విధానంలో ఢిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ (డీడీఏ) అనుసరిస్తున్న తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం ముందుగా దరఖాస్తు చేసుకున్నారనే ఏకపక్ష ప్రాతిపదికన మైదానాలను కేటాయించే విధానం దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలను నిరాకరిస్తుందని అభిప్రాయపడింది. ప్రతి సంవత్సరం మైదానాల కేటాయింపు ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పెంచేందుకు వీలుగా స్పష్టమైన, సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఈ వ్యవహారంలో జస్టిస్ అమిత్ మహాజన్ అక్టోబర్ 8న కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ప్రక్రియపరమైన నియమం ఉన్నంత మాత్రాన ఆ విధానం రాజ్యాంగబద్ధంగా సరైనదని లేదా సమంజసమైనదని చెప్పలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీలు, కేటాయింపు నిబంధనలను ముందుగానే బహిరంగంగా ప్రకటించకపోతే.. అధికారిక యంత్రాంగంలో ముందస్తు సమాచారం పొందే వీలున్న వ్యక్తులు లేదా సంస్థలకే అనుచిత ప్రయోజనం కలుగుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ వివాదం వివరాల్లోకి వెళితే.. ‘రేస్ ఆఫ్ న్యూ బిగినింగ్ ఫౌండేషన్’ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీలోని రాజా గార్డెన్‌లో ఉన్న చంక్-సీ మైదానాన్ని వార్షిక రాంలీలా దసరా మహోత్సవాల నిర్వహణకు తమకు కేటాయించాలంటూ దాఖలు చేసిన దరఖాస్తును డీడీఏ అధికారులు తిరస్కరించారు. మరో సంస్థ ఏప్రిల్ 10నే ముందస్తుగా దరఖాస్తు చేసుకుందని, పిటిషనర్ సంస్థ మే 27న దరఖాస్తు చేసినందున ముందస్తు దరఖాస్తుదారుకే ప్రాధాన్యతనిచ్చామని అధికారులు సమర్థించుకున్నారు.

అయితే, సదరు ఫౌండేషన్ 2023, 2024 సంవత్సరాల్లో అదే మైదానంలో విజయవంతంగా ఉత్సవాలు నిర్వహించిందని.. డీడీఏ నిబంధనల ప్రకారం గత మూడేళ్లలో రెండేళ్లు నిర్వహించిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని వాదించింది. ముందస్తు ప్రకటన ఏదీ లేకుండా ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్’ విధానాన్ని అమలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

రాబోయే రోజుల్లో మైదానాల కేటాయింపులో అనుసరించాల్సిన కార్యాచరణను కోర్టు స్పష్టంగా నిర్దేశించింది. తొలి కార్యక్రమం ప్రారంభానికి కనీసం 90 రోజుల ముందే అందుబాటులో ఉన్న మైదానాలు, దరఖాస్తు తేదీలు, అర్హతలు, ఆంక్షలు, రుసుములు, ఎంపిక ప్రమాణాలతో బహిరంగ ప్రకటన విడుదల చేయాలని ఆదేశించింది. ఒకే మైదానం కోసం ఒకటి కంటే ఎక్కువ సంస్థలు పోటీ పడినప్పుడు ముందస్తు ప్రమాణాల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

భద్రత, అగ్నిమాపక ఏర్పాట్లు, విద్యుత్ సురక్షత, పారిశుద్ధ్యం, రవాణా, వాహనాల నిలిపివేత, వ్యర్థాల నిర్వహణతో కూడిన పక్కా ప్రణాళికలను దరఖాస్తుదారుల నుంచి స్వీకరించాలని స్పష్టం చేసింది. గతంలో నిబంధనలు పాటించిన సంస్థలకు కొంత ప్రాధాన్యం ఇవ్వవచ్చని, అయితే ఆ ప్రాధాన్యం వరుసగా రెండేళ్లకు మించకూడదని వివరించింది.

ప్రస్తుతం పండుగ సీజన్ ప్రారంభమై ఉత్సవాల ఏర్పాట్లు దాదాపు పూర్తయినందున, ఇప్పటికే జరిగిన కేటాయింపులను రద్దు చేయడం సాధ్యం కాదని పేర్కొంటూ పిటిషనర్ ఫౌండేషన్‌కు కోర్టు తక్షణ ఉపశమనం నిరాకరించింది. ఈ నూతన ఆదేశాలు రాబోయే కాలానికి వర్తిస్తాయని, 2026 సీజన్ కోసం ఇప్పటికే పూర్తయిన కేటాయింపుల ప్రక్రియను పునఃసమీక్షించబోమని స్పష్టం చేసింది. భవిష్యత్తులోనైనా మైదానాల కేటాయింపులో పారదర్శకత, సమాన అవకాశాలు లభిస్తాయా అనేది రాబోయే రోజుల్లో డీడీఏ రూపొందించే నూతన మార్గదర్శకాలపైనే ఆధారపడి ఉంది.