Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

AP Local Body Polls: స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలి.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ..

jagan 13 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
AP Local Body Polls: స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలి.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ..

YSRCP

AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించడానికి వీలుగా కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని కోరుతూ ప్రధాన ప్రతిపక్షం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. స్థానిక పోలీసుల పనితీరుపై తమకు విశ్వాసం లేదని, వారు అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తమ పిటిషన్‌లో పోలీసు వ్యవస్థ తీరుపై లేళ్ల అప్పిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసులు అధికారంలో ఉన్న పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతను కేంద్ర బలగాలకు అప్పగించాలని, ఎన్నికల సంఘం నియమించే స్వతంత్ర పరిశీలకుల సూచనలు, పర్యవేక్షణకు అనుగుణంగానే ఈ కేంద్ర బలగాలు పనిచేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికలలో పారదర్శకతను పెంచేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల రక్షణతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, లైవ్ వెబ్‌కాస్టింగ్ నిర్వహించేలా చూడాలని కూడా విజ్ఞప్తి చేశారు.

గతంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర బలగాలను కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి (SEC) అధికారికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి సానుకూల స్పందన గానీ, తగిన చర్యలు గానీ రాకపోవడంతోనే న్యాయపోరాటానికి దిగాల్సి వచ్చిందని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి , రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)లను ప్రతివాదులుగా చేర్చారు.

అదే సమయంలో, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి కూడా స్థానిక ఎన్నికల భద్రతపై హైకోర్టులో వేరొక పిటిషన్ దాఖలు చేశారు. గురజాల పరిధిలో ప్రతిపక్ష అభ్యర్థులు భయపడకుండా, నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని, ఇందుకోసం ముందస్తుగా అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడే తరుణంలో ప్రతిపక్ష నేతలు వరుసగా భద్రత, కేంద్ర బలగాల మోహరింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.