CJP Protest in Delhi: ఢిల్లీకి కాక్రోచ్ పార్టీ నిరసన సెగ.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
After Bengal and Maharashtra, Punjab is the BJP's next target.
CJP Protest in Delhi: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ తీవ్ర అప్రమత్తమైంది. దేశ రాజధానికి ఆందోళనకారులు చేరుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (UTs) పోలీసు ఉన్నతాధికారులకు కేంద్ర హోం శాఖ ప్రత్యేకంగా లేఖ రాసింది. ఢిల్లీ పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అనుమతి లేకుండా ఢిల్లీలోకి ప్రవేశించే ప్రయత్నాలను కఠినంగా అడ్డుకోవాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సీజేపీ ఈ శనివారం జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసన కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ, వివిధ రాష్ట్రాల నుంచి సీజేపీ మద్దతుదారులు, ఆందోళనకారులు పెద్దఎత్తున ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు లేఖలో పేర్కొంది.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రాల నిఘా విభాగాలు, సరిహద్దు అధికారులు, రవాణా శాఖలు , ఢిల్లీ పోలీసులు పరస్పరం సమాచారాన్ని మార్ుపుకొంటూ చట్ట పరిధిలో తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని హోం శాఖ ఆదేశించింది. నిరసనల పేరుతో గతంలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో సీజేపీ మద్దతుదారులు అధికారుల ఆదేశాలను ఉల్లంఘించారని, దీనివల్ల సాధారణ ప్రజా జీవనానికి అంతరాయం కలగడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లిందని గుర్తుచేసింది. ఈసారి అలాంటి అవాంఛనీయ పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తుగా కట్టడి చేయాలని స్పష్టం చేసింది.
అలాగే 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించింది. నిరసనలు, సభలు, సమావేశాల నిర్వహణ కోసం నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే నిబంధనలకు లోబడి ఆందోళనలు చేపట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణ , చట్టాల అమలును కట్టుదిట్టంగా నిర్వర్తించడం అధికారుల బాధ్యత అని పునరుద్ఘాటించింది. మరోవైపు, ఈ భద్రతా ఏర్పాట్లు , నిరసనల ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు, చివరి నిమిషంలో తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది.