Skip to content
జాతీయం › వార్తలు

CEC జ్ఞానేశ్ రాజీనామా కోసం భారీ ఆందోళనకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి…నేడు ఆందోళనలు ఎక్కడంటే..?

Krishna Rao 09 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CEC జ్ఞానేశ్ రాజీనామా కోసం భారీ ఆందోళనకు సిద్ధమవుతున్న ఇండియా కూటమి…నేడు ఆందోళనలు ఎక్కడంటే..?

ఇండియా బ్లాక్ మార్చ్

ఓటు చోరీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి ఆందోళనలను ఉధృతం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వరుసగా నిరసనలు చేపడుతున్న విపక్ష ఎంపీలు.. శుక్రవారం మరో భారీ ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న ఇండియా కూటమి నేతలు.. అవకాశం కల్పించకపోతే తదుపరి నిరసన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించినట్లు కూటమి వర్గాలు వెల్లడించాయి.

గురువారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన అనంతరం ఇండియా కూటమి ఎంపీలు శాంతియుత నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు వివిధ విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. అంతకుముందు ఖర్గే నివాసంలో సమావేశమైన నేతలు.. భోజన సమావేశం అనంతరం నిరసన కార్యక్రమానికి బయలుదేరారు.

సుమారు 300 మంది ఎంపీలు రాజ్‌ఘాట్‌కు ర్యాలీగా వెళ్లగా, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు వారిని అనుసరించారు. ర్యాలీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ర్యాలీ నెమ్మదిగా సాగింది. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు రెండు గంటల సమయం పట్టింది. రాజ్‌ఘాట్‌కు చేరుకున్న అనంతరం నేతలు మహాత్మా గాంధీకి నివాళులర్పించి నిరసన తెలిపారు.

ఇదిలా ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో ఇండియా కూటమి ఎంపీలు మరోసారి సమావేశం కానున్నారు. ఈ భేటీలో తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చించి, ఓటు చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా చేపట్టనున్న భారీ నిరసనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను మరింత బలంగా వినిపించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ ఈ నెల రెండో తేదీన లేఖ రాసినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాష్ట్రపతి భవన్ కోరిన మేరకు సమావేశానికి హాజరయ్యే నేతల పేర్లను ఈ నెల ఐదో తేదీనే సమర్పించామని వెల్లడించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అపాయింట్‌మెంట్‌పై ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం ప్రకటిస్తామని తెలిపారు.

రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ లభించకపోతే నిరసనకు సంబంధించి అన్ని మార్గాలు పరిశీలనలో ఉన్నాయని ఇండియా కూటమి వర్గాలు తెలిపాయి. అవసరమైతే రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి భవన్‌తో పాటు ప్రధాని లేదా కేంద్ర హోంమంత్రి నివాసాల వద్ద కూడా ఆందోళన చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించాయి. దీంతో సీఈసీ రాజీనామా డిమాండ్‌తో ఇండియా కూటమి చేపట్టనున్న తదుపరి నిరసన కార్యక్రమాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ట్యాగ్‌లు: INDIA Bloc Protest