Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

పారని ‘పాతికేళ్ళ’ పాచిక

Prajapaksham 09 Oct 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
పారని ‘పాతికేళ్ళ’ పాచిక

Failures of the Modi administration that are damaging the economy

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అధికార పదవులు చేపట్టి బుధవారానికి పాతికేళ్ళు పూర్తయ్యాయి. తొలుత 2001 అక్టోబర్‌ 7న ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత మొత్తం నాలుగుసార్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, 2014 నుంచి ప్రధాని పదవిలో వరుసగా మూడవసారి కొనసాగుతున్నారు. పాతికేళ్ళ పాటు నిరంతరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నేతృత్వం వహించటం ఒక విశేషమే. ఈ సందర్భంగా విజయాలు, వైఫల్యాలను నెమరువేసుకోవడం సహజం. అందుకే ప్రభుత్వాధినేతగా పదవి నధిరోహించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో భారతీయ జనతా పార్టీ ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ సభ’ పేరుతో సమావేశం నిర్వహించింది. అయితే, ‘సర్‌’ పేరుతో కోట్లాది ఓట్లు గండికొడుతుండడంపై దేశవ్యాప్తంగా మోదీ సర్కార్‌పై నిరసనలు వెల్లువెత్తిన తరుణంలో ఈ వేడుకలు జరిగాయి. అడ్డగోలుగా ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ కుమార్‌ను తొలగించాల్సిందేనని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సహితంగా విపక్ష ఇండియా కూటమి ఎంపిలు గత రెండు మూడు రోజులుగా రాజధాని వీధులను నిరసనలతో హోరెత్తిస్తున్నారు. సంవత్సరానికి పైగా పార్లమెంటు లోపల, బైట ఈ అంశం నలుగుతున్నప్పటికీ, ఒక్కసారిగా కూడా దీనిపై పెదవి విప్పని ప్రధాని మోదీ.. నేరుగా ఆయనపైనే వేలెత్తి చూపుతున్న నిరసన సెగలు ఢిల్లీకి తాకడంతో వికసిత్‌ భారత్‌ సంకల్ప సభలోనైనా స్పందిస్తారేమోనని పలువురు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, ఆయన షరామాములుగానే స్పందించలేదు.
ఆ సభలో మోదీ చేసిన ప్రసంగం ఏ మాత్రం స్ఫూర్తిదాయకంగా, చివరకు ఆయన అభిమానులను ఉత్సాహపరిచే విధంగా కూడా లేదు. ఎందుకంటే, ఆయన పెద్దపెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలని, అందుకే 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధించాలనే రొటీన్‌ డైలాగులనే వల్లె వేశారు. అప్పటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుదామని, ఆత్మ నిర్భరత సాధిద్ధామని, అంతర్జాతీయ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దుమని, ఒలింపిక్స్‌కు అతిథ్యమిద్దామని, అంతరిక్షంలోకి స్వంతంగా అడుగుపెడతామని సుదూర స్వప్నాలను చూపించారు. వీటిని నినాదాలుగా మలిచి ‘వీ విల్‌ డూ ఇట్‌ (మనం సాధిస్తాం)’ అని సభికులతో అనిపించారు. ఎవరైనా తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టినప్పుడు ఈ మాటలే అంటే గొప్పగానే అనిపిస్తాయి. కానీ, మోదీకిది వరుసగా మూడవ అవకాశం. గతంలో చేసిన అనేక బాసలను అమలు చేసేందుకు, పై మూడు లక్ష్యాలను చేరేందుకు ఆయన పదవిలో ఉన్న పుష్కర కాలం పెద్ద సమయమే. కానీ, అవేవి ఇప్పటికీ నెరవేరుతున్న దిశగా లేవు. తప్పుడు గణాంకాలతో ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారామని గతంలో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసింది. ప్రధానికి జయజయనాదాలు పలికింది. ఆ తరువాత ఆరవ స్థానానికి జారిపోయాం. జిడిపి సుమారు రూ.323 లక్షల కోట్లకు పెరిగిన మాట వాస్తవమే. అంతకంటే వేగంగా అప్పు కూడా రూ.214 లక్షల కోట్లకు చేరవవుతోంది. పెరిగిన ఆర్థిక వ్యవస్థకు మించి అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రపంచ శతకోటీశ్వరుల జాబితాలో అదానీ, అంబానీల స్థానం వేగంగా పైకి ఎగబాకుతోంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల ఇస్తామన్న మాట అటుంచి, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడమే కాకుండా, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్ళు, రైతుల ఆదాయం రెట్టింపు వంటి వాగ్దానాలు నీటి మూటలయ్యాయి. ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికెగిరినట్లు’, తమ వైఫల్యాలను దాపున ఉంచి, పెద్ద పెద్ద లక్ష్యాలు ఉండాలంటూ, మనందరికీ 2047 నాటికి లక్ష్యాలను చూపిస్తున్నారు. పన్నెండేళ్ళలో ఇచ్చిన మాటలు
నిలబెట్టుకోని వారు, మరో రెండు పుష్కరాల తరువాత చేతికి చందమామను ఇస్తామంటే నమ్మేదెవరు? అందుకే ప్రధాని ప్రసంగానికి వారి పార్టీ కార్యకర్తల నుంచి కూడా కరతాళ ధ్వనులు పెద్దగా వినపడలేదు.
నీట్‌ లీకేజ్‌ వ్యవహారంలో జంతర్‌ మంతర్‌లో జరిగిన కాక్రోచ్‌ల ఉద్యమం ద్వారా పాతికేళ్లుగా దుర్భేద్యంగా తీర్చిదిద్దుకున్న మోదీ ఇమేజిని జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫా తరం పది రోజుల్లోనే బుగ్గిచేసింది. నాటి నుంచి ప్రధాని మోదీ ప్రతిష్టను పునర్నిర్మించేందుకు కాషాయదళం ప్రయాసపడుతోంది. అందులో భాగంగా గత నెల 17న మోదీ జన్మదినం రోజున ‘ఆశీర్వాద్‌ దియా’ పేరుతో దేశమంతటా ప్రమిదలు వెలిగించే కార్యక్రమాన్ని బిజెపి నాయకులు, కార్యకర్తలు పోటీలు పడి నిర్వహించారు. ఆ పార్టీ మిత్రపక్షం టిడిపి కూడా బిజెపితో ధీటుగా ఆ కార్యక్రమాన్ని చేసుకుంది. స్వయంగా టిడిపి జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ దీపాలు వెలిగించి ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజు నుంచి అక్టోబర్‌ 17 వరకు నెలరోజుల పాటు ‘సేవా సంకల్స్‌ అభియాన్‌’ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టి, మోదీ ఇమేజీ మరమ్మతు పనిని చేపట్టింది బిజెపి. ఈ లోగానే ఒక జాతీయ దినపత్రికలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఏకపక్ష తీరు, ఓట్ల తొలగింపుపై వచ్చిన సంచలన కథనంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంతో పాటు, మోదీ ప్రతిభను దెబ్బతీసింది.
అందులో భాగంగానే మోదీ పాతికేళ్ళగా పదవీ రూఢుడైన ఘట్టాన్ని మరో ఘనతగా చెప్పుకునేందుకు విజయ్‌ సంకల్ప్‌ సభను నిర్వహించారు. అయితే, మోదీ పేరిట ఘనతల సభను నిర్వహించటం కొత్తేమీ కాదు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికైన ప్రధానమంత్రులలో నెహ్రూ కంటే మోదీ అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న పేరుతో గతంలో కూడా బిజెపి ఒకసారి ఉత్సవాలు చేసింది. అలాగే ఇందిరాగాంధీ కంటే వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా ఉన్నారంటూ మరోసారి ఉత్సవం జరుపుకున్నారు. నిజానికి వారిరువురు మోదీ కంటే అత్యధిక కాలమే ప్రధానమంత్రులుగా ఉన్నారు. నెహ్రూ స్వాతంత్య్రం వచ్చినప్పటి (1947 ఆగస్టు 15) నుంచి లెక్కవేస్తే మరణించే వరకూ ఏకధాటిగా 16
సంవత్సరాలకు పైగా (6,130 రోజులు), ఇందిరాగాంధీ మధ్యలో ఒకసారి ఓడిపోయినప్పుడు మినహా దాదాపు 17 ఏళ్ళు (5,829 రోజులు), ప్రస్తుతం మోదీ 12 ఏళ్ళుకు పైగా (సుమారు 4,519 రోజులు) ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు. చెప్పుకునేందుకు ఏమీ లేక, గతంలో చెప్పుకున్న విషయాలనే అటు తిప్పి ఇటు తిప్పి మరోసారి కొత్తగా చెప్పుకునేందుకు చేసిన ప్రయత్నానికి ఈసారి స్పందన కరువైంది. ‘అతి సర్వత్రా వర్జయేత్‌’ !