KTR vs Danam Nagender: దమ్ముంటే ఖైరతాబాద్‌లో పోటీ చేయ్..ఎవరి బలమేంటో తేల్చుకుందాం.. కేటీఆర్‌కు దానం నాగేందర్ సవాల్
Danam Nagender
KTR vs Danam Nagender: ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఖాయమవ్వడంతో తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావుకు (కేటీఆర్) కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగ సవాల్ విసిరారు. ధైర్యముంటే ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో తనపై కేటీఆర్ నేరుగా పోటీ చేసి గెలవాలని, ఈ ఎన్నికల్లోనే ఎవరి బలం ఎంతో తాడోపేడో తేల్చుకుందామని తీవ్ర స్థాయిలో సవాల్ విసిరారు.
హైదరాబాద్‌లో ఇండీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవ్ డెమోక్రసీ’ నిరసన ర్యాలీలో పాల్గొన్న సందర్భంలో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న ఉపఎన్నికకు తాను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ‘దానం నాగేందర్’ అనేది ఒక శక్తివంతమైన బ్రాండ్ అని వ్యాఖ్యానించిన ఆయన, రాబోయే ఉపఎన్నిక తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాకర్షక పాలనకు , సంక్షేమ పథకాలకు ఒక నిఖార్సయిన రెఫరెండంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర సీఈసీ చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై కూడా దానం తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో పౌరుల పవిత్రమైన ఓటు హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని, అటువంటి అధికారాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఎవరు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండీ కూటమి భాగస్వామ్య పక్షాలు , యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని తెలిపారు.
2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తెలంగాణ హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంతో త్వరలో రాబోయే ఉపఎన్నికలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి మరోసారి తన సత్తా చాటుతానని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.