Skip to content
తెలంగాణ › వార్తలు

Save Democracy Rally: హైదరాబాద్‌లో INDIA కూటమి ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీ.. పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

jagan 08 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Save Democracy Rally: హైదరాబాద్‌లో INDIA కూటమి ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీ.. పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Save Democracy Rally

Save Democracy Rally: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ‘ఇండియా’ కూటమి పిలుపునిచ్చిన దేశవ్యాప్త ‘సేవ్‌ డెమోక్రసీ’ నిరసనల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చలో లోక్‌భవన్‌’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి లోక్‌భవన్‌ వరకు కూటమి శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకారులు పెద్దెత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అజారుద్దీన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీలతో పాటు ఇండీ కూటమికి చెందిన పలువురు కీలక నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ర్యాలీ లోక్‌భవన్‌ సమీపానికి చేరుకోగానే పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి నేతలను ముందడుగు వేయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కూటమి నాయకులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం , తోపులాట జరిగి అక్కడ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పోలీసులు ఎంతటికీ ముందుకు వెళ్లనివ్వకపోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, వేం నరేందర్‌రెడ్డి తదితర నేతలు రహదారిపైనే బైఠాయించి తమ నిరసనను కొనసాగించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని డిసిఎమ్‌ (DCM) వాహనాల్లో సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలన్న కూటమి నిర్ణయంలో భాగంగా హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఇక తదుపరి కార్యాచరణను ఖరారు చేయడంపై కూటమి నేతలు దృష్టి సారించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో ఇండీ కూటమి నేతలకు ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ భేటీ అనంతరం సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌ను మరింత ఉధృతం చేస్తూ ఢిల్లీ కేంద్రంగా తదుపరి ఆందోళన కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.