Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

Repo Rate Hike: వడ్డీ రేటు పెంపు సామాన్యుడిపై పెను భారం!

Prajapaksham 08 Oct 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Repo Rate Hike: వడ్డీ రేటు పెంపు సామాన్యుడిపై పెను భారం!

RBI

Repo Rate Hike: బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వర్తింప చేసే వడ్డీ, ‘రెపో’, రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) 25 బేసిస్‌ పాయింట్లు పెంచడం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక నిర్ణయంలా కనిపించినా, దాని ప్రభావం ఎక్కువగా సామాన్యుడిపైనే ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని నియంత్రించడం, ధరల స్థిరత్వాన్ని కాపాడటం వంటి లక్ష్యాలను, సుమారు నాలుగేళ్ల తర్వాత జరిగిన తొలి పెంపును ఆర్‌బిఐ ముడిపెట్టినప్పటికీ, ఈ చర్య రుణగ్రహీతలపై పడే భారం పెంచుతుంది. ముఖ్యంగా గృహ రుణం, వ్యాపార రుణం తీసుకున్న మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులు ఈ ప్రభావాన్ని నేరుగా ఎదుర్కోవాల్సి రావచ్చు. రెపొ రేటు పెరిగినప్పుడు బ్యాంకులకు నిధుల వ్యయం పెరుగుతుంది. ఆ పెరిగిన వ్యయాన్ని బ్యాంకులు కొంత మేరకు రుణగ్రహీతలపైకి బదిలీ చేయడం సహజం. ఫలితంగా, రుణగ్రస్థులు చెల్లించే నెలవారీ చెల్లింపులు లేదా ఇఎంఐ కొనసాగే కాలపరిమితి పెరగవచ్చు. ఇప్పటికే కుటుంబ ఆదాయంలో గణనీయమైన భాగం రుణ వాయిదాలకు వెళ్తున్నప్పుడు, వడ్డీ పెరుగుదల అదనపు ఆర్థిక భారంగా మారుతుంది. ఇది కేవలం ఇంటి రుణానికి పరిమితం కాదు. వ్యాపార రుణాలపై వడ్డీ పెరిగితే చిన్న, మధ్యతరహా వ్యాపారాల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. నిర్వహణ మూలధనం కోసం బ్యాంకు రుణాలపై ఆధారపడే వ్యాపారులకు ఈ భారం మరింత కష్టం. చిన్న వ్యాపారి తన వ్యాపారాన్ని కొనసాగించడానికి బ్యాంకు రుణంపై ఆధారపడుతుంటాడు. రుణ వ్యయం పెరిగితే అతని లాభాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ భారాన్ని వినియోగదారుడిపైకి బదిలీ చేస్తే వస్తువులు, సేవల ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలా చేయలేని పరిస్థితిలో వ్యాపారి తన లాభాన్ని తగ్గించుకోక తప్పదు. కొత్త పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాన్ని విస్తరించడం, కొత్త ఉద్యోగాలు కల్పించడం వంటి నిర్ణయాలు సైతం వాయిదా పడతాయి. దేశంలోని అత్యంత నిరుపేదలకు పెద్దగా బ్యాంకు రుణాలు లేకపోవచ్చు. అయినా వడ్డీ రేట్ల పెంపు వారిని కూడా ప్రభావితం చేస్తుంది. వ్యాపారాల ఖర్చులు పెరిగితే వస్తువులు, సేవల ధరలపై ఒత్తిడి తప్పదు. ఉపాధి అవకాశాలు, చిన్న వ్యాపారాల కార్యకలాపాలు కూడా ప్రభావితమవుతాయి. పేద కుటుంబాలకు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు పరిమితంగా ఉంటాయి. కాబట్టి జీవన వ్యయం పెరిగినా, రుణభారం పెరిగినా, దాని ప్రభావాన్ని తట్టుకోవడం వారికి మరింత కష్టం. ధనిక కుటుంబం అదనపు ఖర్చును కొంతకాలం భరించగలిగినా, పేద కుటుంబానికి అదే పరిస్థితి తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఇక బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్‌బిఐ వద్ద ఉంచినప్పుడు పొందే వడ్డీ, ‘రివర్స్‌ రెపో’ ఆకర్షణీయంగా మారితే, ఆ నిధుల్లో కొంత భాగం మార్కెట్‌కు వెళ్లకపోవచ్చు. ఫలితంగా రుణాల లభ్యతపై ఒత్తిడి వస్తుంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు, గృహ రుణం కోసం ఎదురుచూసేవారు దీనిని ఎదుర్కోకతప్పదు. అందుకే, ‘రెపో’, ‘రివర్స్‌ రెపో’ను ఆర్థిక నిపుణులకు సంబంధించిన పదాలుగానూ, ఆర్‌బిఐ అనుసరించే వివిధ పాలనాపరమైన అంశాలుగానూ పరిగణించడానికి వీల్లేదు. అవి బ్యాంకు రుణాల ధర, రుణాల లభ్యత, పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలు, చివరకు కుటుంబ రాబడి ఖర్చులపై ప్రభావం చూపే అంశాలు.
అయితే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని విస్మరించలేం. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కూడా సామాన్యుడి ప్రయోజనమే. ధరలు అదుపు తప్పితే ఆహారం, విద్య, వైద్యం, రవాణా, ఇతర నిత్యావసరాల ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాలపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బిఐ కఠినమైన ద్రవ్య విధానాన్ని అనుసరించడం వెనుక ఆర్థిక కారణం ఉంది. కానీ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే క్రమంలో రుణగ్రహీతలపై అధిక భారం పడకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత కూడా విధాన నిర్ణేతలపై ఉంది. తాజాగా రెపో రేటును పెంచడం ద్రవ్యోల్బణ నియంత్రణకు అవసరమైన చర్య కావచ్చు. కానీ ఒక ఆర్థిక నిర్ణయం విజయాన్ని కేవలం మార్కెట్ల ప్రతిస్పందనతోనే కొలవలేం. గృహ రుణం చెల్లించే కుటుంబం పరిస్థితి ఏమిటి? చిన్న వ్యాపారి రుణభారాన్ని భరించగలుగుతున్నాడా? కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి రుణం అందుబాటులో ఉందా? పేద కుటుంబాల జీవన వ్యయం ఎలా మారుతోంది? అనే ప్రశ్నలకు కూడా సమాధానం ఉండాలి. ఆర్థిక స్థిరత్వం అనేది ధరలను అదుపులో ఉంచడానికి మాత్రమే పరిమితం కాదు. ప్రజలకు అందుబాటులో ఉండే రుణం, చిన్న వ్యాపారాలకు అవసరమైన మూలధనం, కుటుంబాలకు భరించగలిగే ఇఎంఐలు కూడా ఆర్థిక స్థిరత్వంలో భాగమే. వడ్డీ రేటు పెంపు ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలన్న లక్ష్యం సమర్థనీయమే. కానీ ఆ భారాన్ని సామాన్యుడు ఎంతవరకు భరించగలడో కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పాలంటే బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లతోపాటు, ఇంటి రోజువారీ కేటాయింపుల పరిస్థితులు కూడా బలంగా ఉండాలి. రెపొ, రివర్స్‌ రెపొ రేట్లను ఆర్‌బిఐ సుదీర్ఘ కాలం తర్వాత పెంచడాన్ని తప్పుపట్టకూడదనే వాదన వినిపించవచ్చు. అది కొంత వరకూ సమర్థనీయం కూడా. అదే సమయంలో, 2026 ఆర్థిక సంవత్సరానికి, రీటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ ముందుగా ఊహించిన 5 శాతానికి మించి, 5.2గా ఉంటుందని ఆర్‌బిఐ చేసిన ప్రకటనను గమనించాలి. ద్రవ్యోల్బణం ‘సహించగల స్థాయి’ని దాటుతున్నప్పుడు, నివారణ చర్యలు అత్యవసరం. ఉత్పత్తి దారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం నుంచి ధరల నియంత్రణ వరకూ వివిధ రకాల చర్యలు చేపట్టాలి. కేవలం రెపో రేటును పెంచడం ద్వారా మార్కెట్‌లో ద్రవ్య సరఫరాలను, వినియోగాన్ని నియంత్రించవచ్చని, తద్వారా డిమాండ్‌ తగ్గితే ధరలు కూడా అదుపులోకి వస్తాయని వాదించడం సరైనది కాదు. ఆర్‌బిఐని స్వతంత్ర సంస్థగా పేర్కొంటున్నప్పటికీ, అది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కనుసన్నల్లో నడుస్తుందని, కేంద్ర కేబినెట్‌ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే తీర్మానాలు చేస్తుందన్నది బహిరంగ రహస్యం. పెరుగుతున్న ధరలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఆర్‌బిఐని కేంద్ర ప్రభుత్వం ఒక ‘నియంత్రణ మార్గం’గా ఎంచుకొని ఉండవచ్చు. రెపో రేటు పెంపుదలతో పెరుగుతున్న ధరల సూచీకి కళ్లెం వేయాలని ఆశిస్తుండవచ్చు. అదే సమయంలో, సామాన్యుడిపై పడే భారాన్ని, అతనికి ఊరట కల్పించే మార్గాలను కూడా అన్వేషించి, ప్రకటించి ఉంటే బాగుండేది. ఆర్‌బిఐ నిర్ణయంతో తలెత్తే పరిణామాలను సమీక్షించి, సామాన్యుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి లోనుకాకుండా
జాగ్రత్తలు తీసుకోవాలి. ద్రవ్యోల్బణ నియంత్రణకు ఆర్‌బిఐ ఇతరత్రా చర్యలు కూడా తీసుకోవాలి. లేకపోతే, రెపో రేటు పెంపు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయం.