Skip to content
తెలంగాణ › వార్తలు

Erravalli Lands: ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సర్వే నంబర్ 325లో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణానికి ఆదేశం..

Krishna Rao 06 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Erravalli Lands: ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సర్వే నంబర్ 325లో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణానికి ఆదేశం..

పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కీలక సమావేశం

Erravalli Lands: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష..

Erravalli Lands: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో అధికారులు చేపట్టిన భూ సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.

ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ, రెవెన్యూ అధికారులు నిర్వహించిన తాజా సర్వేలో 343 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో రికార్డుల్లో ఉన్న భూమికి, క్షేత్రస్థాయిలో గుర్తించిన భూమికి మధ్య 45 ఎకరాల తేడా ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఈ నేపథ్యంలో సర్వే నంబర్ 325లో మిస్ అయిన 45 ఎకరాల భూమి ఎక్కడ ఉందో పూర్తిస్థాయిలో గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల గుర్తింపు కోసం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు.

భూమి సరిహద్దులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన భూముల వివరాలను కూడా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం సంబంధిత రెవెన్యూ రికార్డులను సమర్పించాలని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.

సర్వే నంబర్ 325లోని భూమిని గుర్తించి, స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం సర్వే నంబర్ 325లో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు, అన్ని సకల సౌకర్యాలతో కాలనీని అభివృద్ధి చేయాలని సూచించారు.

అమరవీరుల కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ శాఖకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. జూన్ 2లోగా కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.