Skip to content
జాతీయం › వార్తలు

భారతదేశ ‘సెక్యులర్‌’ భావనను తిరగరాసే ప్రయత్నం

Prajapaksham 01 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
భారతదేశ ‘సెక్యులర్‌’ భావనను తిరగరాసే ప్రయత్నం

CPI Raja

డి.రాజా, సిపిఐ ప్రధాన కార్యదర్శి

లౌకికవాదం (సెక్యులరిజం)పై ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు స్ఫష్టమైన జవాబు అవసరం. సెక్యులరిజం “ఆధునిక భావన” అని, రాజకీయ మత అధికారం మధ్య పశ్చిమదేశాల్లో ఘర్షణలో దాని మూలాలు ఉన్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ అన్నారు. దాన్ని భారతీయ సర్వ పోల్చి, ఈ భావనను భిన్న విశ్వాసాలకు సమాన గౌరవం ఇచ్చే సాంప్రదాయక సూత్రంగా అభివర్ణించారు. ధర్మ అనేది భారతీయ సామాజిక నడవడికలో, నాగరికతలో పాదుకుని ఉందంటూ దాన్నే హిందూ అని ఆయన వాదించారు.
ఈ వాదనం కేవలం పదజాలంలో వ్యత్యాసం కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ నిలకడ గా హిందూ రాష్ట్ర (దేశం) భావనను ముందుకు తెస్తున్నందున దానికి రాజకీయ పర్యవసానాలున్నాయి. “భారతీయులందరూ హిందువులు, హిందువులంటే భారతీయులని” భాగవత్‌ స్వయంగా చెప్పారు. దీన్ని అనుసరించి ఒక ప్రశ్న అనివార్యంగా వస్తుంది. ప్రతి ఒక్కరూ హిందువు అని నిర్వచించబడితే, భారత పౌరుని మత లేదా నాగరికత గుర్తింపును నిర్వచించే అధికారం ఎవరికి ఉంది? అటువంటి గుర్తింపు ఏదైనా ఆమోదించటంపై పౌరసత్వం ఆధారపడిఉండదన్న రాజ్యాంగ సూత్రం ఏమి కావాలి?
స్వాతంత్య్ర ఉద్యమం ఇచ్చిన జవాబు ప్రాథమికంగా భిన్నమైంది. గాంధీజీ సెక్యులరిజాన్ని దిగుమతి చేసుకున్న పశ్చిమ ఫార్ములాగా పరిగణించలేదు. తాను నిర్మించదలచుకున్న భారతదేశం గూర్చి రాస్తూ ఆయన స్ఫష్టంగా చెప్పారు : “రాజ్యం పూర్తిగా సెక్యులర్‌గా ఉంటుంది”. దీన్ని ఆయన చట్టం ముందు సమానత్వం, వ్యక్తిగత మతస్వేచ్ఛతో సంధానించారు. ఆవిధంగా “పౌరులందరూ చట్టం అనే నేత్రం ముందు సమానంగా ఉంటారు” అని ఆయన రాశారు. రాజ్యం జోక్యం లేకుండా ప్రతి వ్యక్తీ ఉమ్మడి చట్టానికి లోబడి అతని లేక ఆమె మతాన్ని అనుసరించే స్వేచ్ఛ కలిగి ఉంటాడు.
గాంధీజిః హిందూ రాష్ట్ర అంశంపై గాంధీకి ఎంతో స్ఫష్టత ఉంది. “యూనియన్‌ మత రాజ్యంగా ఉండాలా, హిందూమత ఆదేశిక సూత్రాలను హిందూ యేతరులపై విధించాలా? అని ఆయన అడిగారు. “నేను అలా కాదని ఆశిస్తున్నాను”. కాని భాగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నది కచ్ఛితంగా అదే. గాంధీ జీ తాను ఊహిస్తున్న భారతదేశాన్ని “లౌకిక, ప్రజాతంత్ర రాజ్యం”గా తలపెట్టారు. అమూర్తమైన తాత్విక చర్యగా ఆ విషయం చెప్పలేదు. దేశ విభజన, మతహింస నేపథ్యంలో ఆయన మాట్లాడారు. మత గుర్తింపును రాజకీయ సమీకరణకు ప్రాతిపదికగా మార్చితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయన చూశారు. ఆ సంక్షోభానికి ఆయన సమాధానం హిందూ రాజ్యాన్ని నెలకొల్పి, అప్పుడు మిమ్మల్ని సహిస్తామంటూ మైనారిటీలకు హామీ ఇవ్వటం కాదు. విశ్వాసం ఏమైనప్పటికీ, సమానత్వం ఆయన ధ్యేయం.
నెహ్రూ : నెహ్రూ వైఖరి కూడా అంతే సూటిగా ఉంది. హిందూత్వ ఉన్మాది చేతిలో గాంధీజీ హత్యచేయబడిన కొద్ది రోజుల తర్వాత1948 ఫిబ్రవరి 2న, హిందూ రాష్ట్రం కోసం డిమాండ్‌ను, దాని చుట్టూ ఆవహించివున్న మతతత్వ వాతావరణాన్ని ఆయన ఎదుర్కొన్నారు. మత రాజకీయాల భయంకర పర్యవసానాలను దేశం అప్పుడే అనుభవించి ఉన్నందున, ఆ క్షణంలో ఆయన చెప్పిన మాటలు గుర్తుచేసుకోవటం ఎంతో విలువైనదిః “మేము సెక్యులర్‌ రాజ్య నిర్మాణాన్ని తలపెడుతున్నాం. అందులో ఒక సముదాయం (కమ్యూనిటీ) లేదా గ్రూపు లేదా పార్టీ ఇతరుల హక్కులను హరించటం అనుమతించబడదు”. నెహ్రూ దానిని కేవలం మత సహిష్ణుతగా కాకుండా రాజకీయ అధికారం సమస్యగా అవగాహన చేసుకున్నారు. భారతదేశం భిన్న విశ్వాసాలకు చెందిన పౌరులను కలిగి ఉన్నందున సెక్యులర్‌ రాజ్యం అవసరమని ఆయన వక్కాణించారు. వారి హక్కులు వారివారి సముదాయాల సంఖ్యాబలంపై ఆధారపడి ఉండవన్నారు. మరో ప్రకటనలో ఆయన స్పష్టంగా ఇలా చెప్పారు : భారతదేశం ఒక “సెక్యులర్‌, మతరహిత, ప్రజాతంత్ర రాజ్యం”గానే రూపకల్పన చేయబడుతుంది. “అందులో ప్రతిఒక్కరికీ, అతను ఏ మతానికి చెందినప్పటికీ, సమాన హక్కులు, అవకాశాలు ఉంటాయి”.
ఆ చారిత్రక సందర్భం ఆర్‌ఎస్‌ఎస్‌ వాదన నిలబడటాన్ని కష్టతరం చేసింది. మతోన్మాద జాతీయవాదం వినాశక పర్యవసానాలను దేశవిభజన అప్పుడే చాటిచెప్పింది. అయినా నవభారత నిర్మాతల ప్రతిస్పందన మెజారిటీ మతం నిర్వచించిన రాజ్యాన్ని నిర్మించటం కాదు. వారు చాలా కఠినమైన రాజ్యాంగ సూత్రాన్ని ఎంచుకున్నారు : రాజ్యం భిన్న విశ్వాసాలకు చెందిన పౌరులకు సమానంగా చెందుతుంది.
అంబేద్కర్‌: రాజ్యాంగ రూపకల్పనకు బాధ్యతవహించిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ వైఖరి కూడా నిర్ణయాత్మకం. రాజ్యాంగం ద్వారానే ఈ సూత్రానికి వ్యవస్థాగత రూపం ఇవ్వబడింది. రాజ్యాంగ అసెంబ్లీ చర్చల సమయంలో మతం, రాజ్యం సమస్య పదేపదే లేవనెత్తబడింది. మత రాజ్యం భావనను అంబేద్కర్‌ దృఢంగా తిరస్కరించారు. అంబేద్కర్‌ ఉత్తరోత్తరా హిందూ కోడ్‌ బిల్లుపై చర్చ సందర్భంలో చాలా కచ్చితమైన నిర్వచనం ఇచ్చారు. సెక్యులరిజానికి అర్థం మతాన్ని రద్దు చేయటం అనే వాదనను ముందుగా ఆయన తిరస్కరించారు. “మేము మతాన్ని రద్దు చేయగలం అని దాని అర్థం కాదు”, లేదా మత మనోభావాలను అలక్ష్యం చేస్తామని కూడా దాని అర్థం కాదు. అప్పుడు రాజ్యాంగ పరిమితిని ఆయన చెప్పారు. “సెక్యులర్‌ రాజ్యం అంటే పూర్తి అర్థం ఒక నిర్థిష్టమైన మతాన్ని మిగతా ప్రజలపై విధించటానికి ఈ పార్లమెంటుకు అధికారం లేదు”.
ఆ నిర్వచనం సెక్యులరిజాన్ని భారతదేశానికి విదేశీయమైనదిగా తిరస్కరించే ప్రయత్నంలోని బలహీనతను బహిర్గతం చేస్తోంది. అంబేద్కర్‌ భారతదేశ సమస్యకు ఐరోపా పరిష్కారాన్ని దిగుమతి చేయటంలేదు. భారతదేశ పరిస్థితికి ఆయన సమాధానం చెబుతున్నారు : వేర్వేరు మతాలు కలిగి ఉన్న, ఏ మతంలేని ప్రజలు కలిగి ఉన్న సమాజంపై రాజ్యం అధికారాన్ని ఎలా వినియోగించాలి? ఆయన సమాధానం సూటిగా ఉందిః రాజ్యం ఒక మతాన్ని విధించజాలదు.
భగత్‌సింగ్‌ ః భగత్‌సింగ్‌ మరో దిశ నుంచి ఈ ప్రశ్నను పరిశీలించారు. నాస్తికుడు, విప్లవకారునిగా ఆయన రాజ్యం తటస్థతను మించి ముందుకెళ్లారు. మత అథారిటీ హేతువాద పరీక్షకు లోబడి ఉండాలన్నారు. ‘నేను ఎందుకు నాస్తికుణ్ణి అయ్యాను’ అన్న రచనలో ప్రత్యేక సదుపాయాలకు, ఉన్నత స్థానాలకు చట్టబద్ధత కల్పించేందుకు మత సిద్ధాంతాలను చారిత్రకంగా ఉపయోగించిన తీరును విమర్శించారు. “ప్రత్యేక సదుపాయాలు పొందుతున్నవారు” తాము “గుంజుకున్న అధికారం, సంపదలు, ఆధిపత్యం” సమర్థించుకునేందు కు మతసిద్ధాంతాలు సృష్టించారని ఆయన రాశారు. విమర్శనారహితంగా మత అథారిటీని ఆమోదించకూడదని హెచ్చరిక చేశాడు, “నిర్ధాక్షిణ్యమైన విమర్శ, స్వతంత్ర ఆలోచనను” వక్కాణించాడు.
ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ వారి హిందూ రాష్ట్ర ప్రాజెక్టుతో ప్రాసంగికమైనది. హిందూ మతాన్ని గౌరవించటమనేదే సమస్య కాదు. ఇతర ప్రతిఒక్క మతంలోవలె హిందూ మతంలో కూడా అనేక సంప్రదాయాలు, భాష్యాలున్నాయి. రాజకీయమైన ప్రశ్న ఏమంటే, నాగరికత, చరిత్ర గూర్చి అత్యంత సంకుచితమైన భాష్యం భారతరాజ్య నిర్మాణ సూత్రం కావలెనా? అదీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్దేశం. హిందూ రాష్ట్ర అంశాన్ని హిందూత్వ పర్యావరణం చారిత్రకంగా సమర్థిస్తున్న నిమ్మోన్నత సామాజిక వ్యవస్థ సరసనపెట్టి పరీక్షించినపుడు ప్రశ్న మరింత పదునుదేరుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాపంచిక దృక్పథం, భావజాలం పూర్తిగా తిరోగమన భావాలతో నిండి వుంది. అసమానతను శాశ్వతం చేయ టం, మహిళాద్వేషం, మతోన్మాదం ఆ భావాల్లో ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూ ఐక్యత గూర్చి మాట్లాడుతుంది. కాని న్యూనతపరిచే కులవివక్షను, అంటరానితనాన్ని ఎదుర్కోదు. మహిళల సమానత్వం సమస్య కూడా అంతే ప్రాముఖ్యతగలది, కాని వారిని గృహానికే పరిమితం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంటోంది. రాజ్యాంగబద్ధ రిపబ్లిక్‌ సమానత్వంపై ఆధారపడి ఉంటుంది. కులం, లింగం ప్రాతిపదికపై భిన్నమైన హక్కులు, విధులు లేదా హోదా అప్పగించే సామాజిక, మత సంప్రదాయాలు అక్కడ పౌరసత్వం నిర్ణయించేందుకు అనుమతించబడవు.
అంబేద్కర్‌ సొంత రాజకీయ పోరాటం కూడా కచ్చితంగా అటువంటి వారసత్వ ఉన్నత దొంతర్లపైనే ఎక్కుపెట్టబడింది. ఆయన రాజ్యాంగ వ్యవస్థ సమానత్వం, స్వేచ్ఛ, నిమ్మోన్నత సామాజిక హోదాల తిరస్కరణ నుంచి వేరుచేయలేనిది. ఆయన ప్రతిపాదించిన హిందూ కోడ్‌ బిల్లు ఇతర విషయాలతోపాటు వివాహం, వారసత్వం, ఆస్తి విషయాల్లో హిందూ మహిళ లీగల్‌ స్థితిని సంస్కరించటానికి ఉద్దేశించింది. ఆ సంస్కరణలకు వచ్చిన ప్రతిఘటన మత, సామాజిక అథారిటీని ప్రజాస్వామిక శాసనానికి అతీతంగా ఎందుకు ఉంచరాదో నిరూపించింది.
ఆర్‌ఎస్‌ఎస్‌ మాటల గారడీః అందుకే, ‘సర్వ- పంత్‌ -సమభావ’ (అన్ని మతాల పట్ల సమాన భావన) అనే సూత్రానికి నైతిక విలువ ఉన్నప్పటికీ, అది మైనారిటీల పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉన్న తృణీకరణ భావాన్ని, ద్వేషాన్ని కప్పిపుచ్చలేదు. మతాల మధ్య సమాన గౌరవం ఉండటం వాంఛనీయమే అయినప్పటికీ, రాజ్యాంగం ఒక క్లిష్టమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. జాతీయ అస్థిత్వానికి సంబంధించిన మతపరమైన భావనను రాజ్యం విధించవచ్చునా లేదా దానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చునా? దీనికి అంబేద్కర్‌, గాంధీ, నెహ్రూల సమాధానం, ‘కాదు’ అనే ఉంటుంది.
విశాలమైన నాగరికతా కోణంలో ప్రతి ఒక్కరూ హిందువులే అని ప్రకటించడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ ప్రశ్న నుంచి తప్పించుకోలేదు. భారతదేశంలో సమాన స్థానాన్ని పొందేందుకు ఒక ముస్లిం పౌరుడు తన అస్థిత్వం గురించి మరొకరు చెప్పే నిర్వచనాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన లేదా నాస్తిక పౌరుల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. సమాన పౌరసత్వాన్ని కల్పించే ముందు పౌరులు ఒక ఉమ్మడి మతానికి చెంది ఉండాలని రాజ్యాంగం ఎక్కడా అడగదు. అలాగే ఎవరైనా ఏ వర్గానికి చెందినవారో నిర్ధారించే ధృవీకరణ పత్రాలను జారీచేసే అధికారాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇవ్వదు. కాబట్టి, రాజ్యాంగబద్ధమైన లౌకికవాదానికి, ‘హిందూ రాష్ట్ర’ భావనకు మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉంది. లౌకికవాదం పౌరుడితో మొదలై, మతంతో సంబంధం లేకుండా సమానత్వాన్ని హామీ ఇస్తుంది. కానీ ‘హిందూ రాష్ట్ర’ భావన దేశం యొక్క మతపరమైన నిర్వచనంతో మొదలై, ఆ నిర్వచనం పరిధిలో వివిధ మతపరమైన అస్థిత్వాలను ఉంచుతూ, ఒకదానిని మరొకదాని కంటే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది. ఇవి రెండూ ఒకే భావనకు సంబంధించిన పదాలు కావు. భారత్‌ ఇప్పటికే హిందూ రాష్ట్రమని భాగవత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ పదేపదే చేస్తున్న వాదనలను, రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్‌ అంబేద్కర్‌ చేసిన హెచ్చరిక కోణంలో చూడాలి.‘ఒకవేళ హిందూ రాజ్యం నిజంగా ఏర్పడితే, అది నిస్సందేహంగా ఈ దేశానికి అత్యంత పెద్ద విపత్తుగా మారుతుంది’అని ఆయన అన్నారు.
దేశంలో లౌకికవాదాన్ని ప్రశ్నిస్తూనే, విదేశాలలో భారతదేశ వైవిధ్యం గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మాట్లాడినప్పుడు ఈ వైరుధ్యం మరింత స్పష్టమవుతుంది. వైవిధ్యం అంటే వివిధ వర్గాలు ఒకే మతపరమైన- సాంస్కృతిక అస్థిత్వం లో విలీనమైన తర్వాతే స్వాగతించబడటం అని అర్థం కాదు. నిజమైన రాజ్యాంగబద్ధమైన బహుళత్వం అంటే, పౌరులు తమ ప్రత్యేక అస్థిత్వాలను పరిరక్షించుకుంటూనే సమాన హక్కులను అనుభవించేలా చూడటం. కాబట్టి, ఆర్‌ఎస్‌ఎస్‌ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా, భారతదేశం ముందున్న అవకాశం విదేశీ లౌకికవాదానికీ, స్వదేశీ సంప్రదాయానికీ మధ్య ఎంపిక చేసుకోవ డం కాదు. భారతదేశం తన సుదీర్ఘ సహజీవన సంప్రదాయాల నుండి స్ఫూర్తి పొందుతుంది, పొందాలి కూడా. కానీ గణతంత్రానికి సాంస్కృతిక సహనం కంటే మరింత నిర్ధిష్టమైన అవసరం ఉంది. దానికి సమాన పౌరసత్వం, అంతరాత్మ స్వేచ్ఛ, మతాన్ని విధించలేని రాజ్యం అవసరం.
భారతీయులు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలు ఈ వ్యత్యాసాన్ని మరింత కొట్టొచ్చినట్లుగా చేస్తాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సరిపోయే స్థాయిలో లేని ప్రభుత్వ విద్య, బలహీనమైన ఆరోగ్య సంరక్షణ, అభద్రత వంటివి అన్ని మత సముదాయాల పౌరులను ప్రభావితం చేస్తున్నాయి.
మతతత్వ రాజకీయాలు ఈ ఉమ్మడి సమస్యల నుండి దృష్టిని మళ్లించి, అస్థిత్వం, మతపరమైన అనుబంధం వంటి ప్రశ్నల వైపు మళ్లిస్తాయి. ఎవరు హిందువు, ముస్లిం లేదా క్రైస్తవుడు అనే దాని చుట్టూ రాజకీయాలు ఎంత ఎక్కువగా కేంద్రీకృతమైతే, కార్మికులుగా, రైతులుగా, విద్యార్థులుగా, మహిళలుగా, యువతగా, సాధారణ పౌరులుగా తాము పంచుకునే విషయాల చుట్టూ
సంఘటితం కావడానికి పౌరులకు అంత తక్కువ అవకాశం ఉంటుంది.
స్వాతంత్య్ర ఉద్యమం ఒక మతపరమైన రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రాణాలను బలిదానం చేయలేదు. గాంధీ హిందూ రాజ్యాన్ని స్పష్టంగా తిరస్కరించా రు. నెహ్రూ స్పష్టంగా లౌకిక రాజ్యాన్ని కోరుకున్నారు. భగత్‌ సింగ్‌ రాజకీయ, మేధోపరమైన లొంగుబాటుకు మతపరమైన అధికారాన్ని ప్రాతిపదికగా తిరస్కరించారు. పార్లమెంటు ప్రజలపై మతాన్ని రుద్దలేదని అంబేద్కర్‌ నొక్కి చెప్పారు. 1976లో రాజ్యాంగ పీఠికలో ‘లౌకికత’ అనే పదాన్ని చేర్చినప్పటికీ, ఈ రాజ్యాంగ సూత్రం చాలా పురాతనమైనది. ఇది అప్పటికే సమానత్వం, అంతరాత్మ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ప్రభుత్వ అధికారాలపై ఉన్న పరిమితులలో
అంతర్లీనంగా ఉంది.
లౌకికవాదం దేశానికి పరాయిదని సూచించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ భారతదేశ స్వాతంత్య్ర పోరాటం, రాజ్యాంగ నిర్మాణ చరిత్రను తిరగరాయలేదు. రికార్డు లు దీనికి విరుద్ధంగా చెబుతున్నాయి. ముఖ్యమైన ప్రశ్న చాలా సులభం. భారతదేశం ప్రతి పౌరుడికి సమానంగా చెందుతుందా, లేక పౌరులు ముందుగా దేశానికి సంబంధించిన మతపరమైన నిర్వచనాన్ని అంగీకరించాల్సి ఉంటుందా? గాంధీ, నెహ్రూ, భగత్‌ సింగ్‌, అంబేద్కర్‌ తమ సమాధానాన్ని ఇచ్చారు. అది లౌకిక ప్రజాస్వామ్యం, సమాన పౌరసత్వం, అంతరాత్మ స్వేచ్ఛ. స్వాతంత్య్ర పోరాట రోజుల నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ వీటిని తిరస్కరిస్తూనే ఉంది. మాటల గారడీని పక్కన పెడితే, ఒక లౌకిక, ప్రజాస్వామ్య దేశంలో భారతీయుడిగా ఉండటమంటే ఏమిటో పునర్నిర్వచించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ను అనుమతించకూడదు.