Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Politics: మగవాళ్లు అవసరం లేదు.. మా వర్గంలోని ఆడవాళ్లే చిత్తు చిత్తుగా చితకబాదుతారు.. ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కొండా సురేఖ..

jagan 29 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Politics: మగవాళ్లు అవసరం లేదు.. మా వర్గంలోని ఆడవాళ్లే చిత్తు చిత్తుగా చితకబాదుతారు.. ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కొండా సురేఖ..

Konda Surekha

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మరోసారి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆమె తాజాగా వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై, తన వర్గంపై ఎవరైనా అవాకులు చవాకులు పేల్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ వర్గంలోని మగవాళ్లు అవసరం లేదని.. మహిళలే ప్రత్యర్థులకు సమాధానం చెప్పడానికి సరిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాపై అవాకులు చవాకులు పేలితే ఊరుకోమని.. మగవాళ్ల వరకు కూడా అవసరం లేదు, మా వర్గంలోని ఆడవాళ్లే చాలు, మిమ్మల్ని దొరికిన చోటే చిత్తు చిత్తుగా చితకబాదుతాం’ అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కొండా సురేఖను ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ నుంచి తొలగించిన సంగతి విదితమే. ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌లో తలెత్తిన వివాదం అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. తనను కేబినెట్ నుంచి తొలగించడంపై సురేఖ అప్పట్లో సీఎం రేవంత్‌రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. అయితే తాము కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని, ప్రజల్లోనే ఉంటూ పనిచేస్తామని ఆమె, ఆమె భర్త కొండా మురళీధర్‌రావు ఇటీవల స్పష్టం చేశారు.

తాజాగా వరంగల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 112 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రత్యర్థుల తీరుపై మండిపడ్డారు. తమపై అనవసర వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. తమ వర్గంలోని మహిళలే అవసరమైతే ప్రత్యర్థులకు తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఇటీవల పైకప్పు పెచ్చులు ఊడిపడి పలువురికి గాయాలైన ఘటనపైనా కొండా సురేఖ స్పందించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అదృష్టంగా భావించాలని అన్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న నిరసనలను ఆమె విమర్శించారు. ఆసుపత్రి అభివృద్ధి పనులపై కూడా ఆమె మాట్లాడారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలోనే పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కొండా సురేఖ తెలిపారు. అలాగే నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. ఫర్నిచర్ ఏర్పాటు, రంగుల పనులు వంటి కొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు.

మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టే అవకాశం లభించిందని కొండా సురేఖ తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇదే సమయంలో తనపై, తన వర్గంపై వ్యాఖ్యలు చేస్తున్న ప్రత్యర్థి నాయకులను ఉద్దేశించి ఆమె ఘాటు హెచ్చరికలు చేశారు. కొందరు నాయకులు తమ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.