KCR Erravalli Farmhouse: ఎర్రవల్లిలో మూడు రోజుల భూ సర్వే పూర్తి.. 325 సర్వే నంబర్లో 388 ఎకరాలపై అధికారుల ఆరా
KCR Erravalli Farmhouse : జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి పరిధిలో 325 సర్వే నంబర్‌కు సంబంధించిన భూముల రీ-సర్వే పూర్తయింది. మూడు రోజులుగా కొనసాగిన ఈ సర్వేలో రెవెన్యూ, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో భూముల హద్దులు, చెరువులు, గుట్టలు, కాలువల విస్తీర్ణాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ సర్వే ప్రక్రియలో మొత్తం 388 ఎకరాల భూమిని అధికారులు పరిశీలించారు.
మూడు బృందాలతో సర్వే
సర్వే ప్రక్రియలో భాగంగా అధికారులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరదరాజ్‌పూర్ గ్రామాల సరిహద్దులను గుర్తించడంతో పాటు 325 సర్వే నంబర్ భూముల హద్దులను నిర్ధారించారు. ఆయా హద్దులకు సంబంధించిన మ్యాపింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు.
గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, ఏడీ సుదర్శన్ తదితర అధికారుల పర్యవేక్షణలో సర్వే కొనసాగింది. గత రెండు రోజుల పాటు పలు బృందాలు విస్తృతంగా పరిశీలన నిర్వహించగా.. మూడో రోజు మూడు బృందాలు మిగిలిన ప్రాంతాలను పరిశీలించి సర్వేను పూర్తి చేశాయి.
పాండవుల చెరువు, గుట్టలు, కాలువలపై ప్రత్యేక పరిశీలన
325 సర్వే నంబర్లోని భూముల్లో పాండవుల చెరువు విస్తీర్ణం ఎంత ఉంది? దాని హద్దులు ఎక్కడివరకు ఉన్నాయి? గుట్ట ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి విస్తీర్ణం ఎంత? కాలువలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? అనే అంశాలను అధికారులు గుర్తించారు.
చెరువులు, గుట్టలు, కాలువల పరిధిని మినహాయించిన తర్వాత 325 సర్వే నంబర్లో ఎంత భూమి ఖాళీగా ఉంది? ఎంత భూమి కాస్తులో ఉంది? అనే వివరాలను కూడా అధికారులు నమోదు చేసినట్లు సమాచారం.
భూముల హద్దులను గుర్తించేందుకు క్షేత్రస్థాయి కొలతలతో పాటు మ్యాపింగ్ ప్రక్రియను కూడా అధికారులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. సర్వే పూర్తయిన అనంతరం మొత్తం వివరాలను క్రోడీకరించి నివేదిక రూపొందించనున్నారు.
కాస్తుదారులకు త్వరలో నోటీసులు
325 సర్వే నంబర్లో భూములను అనుభవిస్తున్న కాస్తుదారులు, రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఆయా భూముల్లో కాస్తులో ఉన్న వారికి నోటీసులు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
నోటీసులు అందుకున్న రైతులు తమ వద్ద ఉన్న పట్టా పాస్‌బుక్కులు, ఇతర భూ సంబంధిత పత్రాలతో నిర్ణయించిన తేదీన తమ భూముల వద్దకు హాజరు కావాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు పత్రాలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో భూముల హద్దులు, కాస్తు, అనుభవ వివరాలను పరిశీలించే అవకాశం ఉంది.
విడతల వారీగా రైతులకు నోటీసులు జారీ చేసి తదుపరి ప్రక్రియను కొనసాగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
శివారు వెంకటాపూర్ గ్రామస్తుల డిమాండ్
మరోవైపు 325 సర్వే నంబర్ వ్యవహారంలో శివారు వెంకటాపూర్ గ్రామానికి సంబంధించిన భూముల అంశం కూడా తెరపైకి వచ్చింది. గ్రామానికి చెందిన 41, 42, 45, 100 సర్వే నంబర్లకు సంబంధించిన సుమారు 113 ఎకరాల భూమి గతంలో మరో గ్రామ పంచాయతీలో విలీనం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
పాత రికార్డుల ప్రకారం ఈ 113 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి తమ గ్రామ పంచాయతీ పరిధిలోకి తిరిగి చేర్చాలని శివారు వెంకటాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 1954 నాటి పహాణీ, చౌఫస్లా రికార్డుల ఆధారంగా భూముల వివరాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
సర్వే నివేదికపై ఆసక్తి
ఎర్రవల్లిలో 325 సర్వే నంబర్‌కు సంబంధించిన భూములపై జరుగుతున్న సర్వే రాజకీయ వర్గాలతో పాటు స్థానికంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 388 ఎకరాల భూమిలో హద్దులు, చెరువులు, గుట్టలు, కాలువలు, ఖాళీ భూములు, కాస్తులో ఉన్న భూముల వివరాలను అధికారులు నమోదు చేయడంతో తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
మూడు రోజుల సర్వే పూర్తయిన నేపథ్యంలో అధికారులు సేకరించిన వివరాలను క్రోడీకరించి పూర్తి నివేదికను జిల్లా అధికార యంత్రాంగానికి సమర్పించనున్నారు. ఆ నివేదిక ఆధారంగా కాస్తుదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు తదుపరి భూ పరిశీలన, పత్రాల ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.
మొత్తంగా 325 సర్వే నంబర్లోని 388 ఎకరాల భూములపై మూడు రోజులుగా సాగిన రీ-సర్వే పూర్తవడంతో ఇప్పుడు అధికారులు ఇచ్చే నివేదిక, రైతులకు జారీ చేసే నోటీసులు, తదుపరి చేపట్టే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.