Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత: నల్ల దుస్తులతో BRS ఎమ్మెల్యేలు…టీషర్ట్ విప్పి హరీష్ రావు నిరసన, కంటతడి పెట్టిన సునీత లక్ష్మారెడ్డి

Krishna Rao 07 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత: నల్ల దుస్తులతో BRS ఎమ్మెల్యేలు…టీషర్ట్ విప్పి హరీష్ రావు నిరసన, కంటతడి పెట్టిన సునీత లక్ష్మారెడ్డి

Telangana Assembly Session

Telangana Assembly Session: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే (సెప్టెంబర్ 7) అసెంబ్లీ ప్రాంగణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా BRS, BJP పార్టీలు పిలుపునివ్వడంతో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి నల్ల టీషర్టులు, నల్ల దుస్తులు ధరించి ర్యాలీగా వెళ్తున్న BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద అడ్డుకున్నారు.

పోలీసులు, BRS నేతల మధ్య వాగ్వాదం…తోపులాట:
నల్ల టీషర్టులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో BRS నేతలు గేటు ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. లోపలికి వెళ్లేందుకు యత్నించిన క్రమంలో పోలీసులు, ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి కింద పడిపోయారు. తోపులాటలో జగదీష్ రెడ్డి కాలికి గాయమైందని, అలాగే హరీష్ రావు కిందపడగా పోలీసులు ఆయన చేతిని తొక్కారని BRS నేతలు ఆరోపించారు.

టీషర్ట్ విప్పి హరీష్ రావు నిరసన:
నల్ల టీషర్ట్ ధరించి రావద్దని పోలీసులు నిబంధన విధించడంతో, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌లు తమ టీషర్ట్ విప్పి బనియన్‌తో నిరసన తెలిపారు. బనియన్‌తోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా, పోలీసులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

పోలీసుల తీరుపై మహిళా ఎమ్మెల్యేల ఆవేదన:
అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనలో BRS మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన పట్ల పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారని, చేతులు పట్టుకుని లాగడంతో కింద పడిపోయానని తెలిపారు. పోలీసులు తనపై దుర్మార్గంగా ప్రవర్తించి కింద పడేసి తొక్కినట్లు ఆరోపించిన ఆమె, అసెంబ్లీ ముందు కంటతడి పెట్టుకున్నారు. బాధ్యులైన పోలీసులపై ఖచ్చితంగా ఫిర్యాదు చేసి చర్యలు డిమాండ్ చేస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రావాలని పిలిచే కాంగ్రెస్ ప్రభుత్వం, వస్తే భయపడుతోందని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు తన జుట్టు పట్టుకుని లాగారని ఆమె ఆరోపించారు.

శాసనసభను కౌరవ సభలా మార్చారని విమర్శలు:
ప్రజాప్రతినిధుల పట్ల, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని BRS నేతలు మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు “కౌరవ సభలా” మారాయని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోలీసులు కర్కశంగా ప్రవర్తించారని ఆరోపించారు.

అన్ని అంశాలపై చర్చ జరగాలి: కేటీఆర్
అరెస్ట్‌కు ముందు BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ పలు డిమాండ్లు చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఏదో తూతూమంత్రంగా కాకుండా నెల రోజుల పాటు నిర్వహించాలి. స్పీకర్ చొరవ తీసుకుని అన్ని ప్రజా సమస్యలపై చర్చ జరపాలి. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 7 డీఏల కోసం పోరాడుతున్న ఉద్యోగుల తరఫున, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్న విశ్రాంత ఉద్యోగుల కోసం గొంతు విప్పుతామని స్పష్టం చేశారు. 22A పేరుతో జరుగుతున్న కుంభకోణం, రైతు రుణాలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

పోలీసుల వివరణ:
మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలోకి నిరసన రూపంలో రావడం, నల్ల దుస్తులు ధరించి రావడానికి భద్రతా నిబంధనలు అంగీకరించవని పోలీసులు తెలిపినట్లు సమాచారం. అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూసేందుకే ముందుజాగ్రత్తగా ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నామని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి, నల్ల దుస్తుల నిరసనలు, పోలీసులు-ప్రతిపక్షాల మధ్య తోపులాటలు అరెస్టులతో తెలంగాణ అసెంబ్లీ తొలి రోజు సమావేశాలు తీవ్ర రసాభాసగా ప్రారంభమయ్యాయి.