Skip to content
ప్రపంచం వార్తలు

USA – Iran War Update: ఇరాన్‌కు సాయం చేసే దేశాలపై ఆంక్షలు: బెస్సెంట్

Prajapaksham 25 Aug 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
USA – Iran War Update: ఇరాన్‌కు సాయం చేసే దేశాలపై ఆంక్షలు: బెస్సెంట్

Strait of Hormuz Closed: Iran Responds to U.S. Military Attacks

తీవ్ర ప్రభావం చూపించనున్న ఎకనామిక్ డీ-డే దురాక్రమణ షరతులు ఒప్పుకోం: బఖాయీ
స్వీయ హక్కుల రక్షణకు తగిన చర్యలు: చైనా ప్రకటన

USA – Iran War Update: ఇరాన్‌పై దాదాపు ఆరునెలలుగా అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం తుది దశకు చేరుకుంటున్నదని అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెస్సెంట్ చెప్పారు. ఇరాన్‌కు సహాయం చేసే దేశాలపై కూడా ద్వితీయశ్రేణి ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తామని చెప్పారు. ఇరాన్ నుండి 80 శాతం చమురును అత్యధికంగా కొనుగోలు చేసే దేశం చైనా కావడంతో పరోక్షంగా ఆ హెచ్చరికలు చైనాను ఉద్దేశించినవిగానే ఉన్నాయి. ఇరాన్‌కు, ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలకు స్కాట్ బెస్సెంట్ చేసిన హెచ్చరికలపై చైనా ప్రభుత్వం స్పందించింది. బెస్సెంట్ చేసిన ప్రకటన గమనించామని, ఇరాన్‌పై అమెరికా అనుసరిస్తున్న సరికొత్త ‘ఎకనామిక్ డీ-డే’ పరిణామాలను పరిశీలిస్తున్నామని, ఈ విషయంలో తమకు ఉన్న చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలు కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ సోమవారం బీజింగ్‌లో జరిగిన పత్రికాగోష్ఠిలో చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఆంక్షలు-ఒత్తిడి వ్యూహాలు ఎంతమాత్రం పనిచేయవన్నారు. సంప్రదాయబద్ధంగా అనేక దశాబ్దాలుగా ఇరాన్‌కు చైనా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉంది.

కాగా, గతవారం ఇరాన్‌పై ట్రంప్ ప్రకటించిన “ఎకనామిక్ డీ-డే” చర్యలను స్కాట్ బెస్సెంట్ పునరుద్ఘాటించారు. చరిత్రలో ఇప్పటివరకూ ఏ దేశంపైనా అమలు చేయని, అతి తీవ్రమైన ఆర్థిక దాడిని ఇరాన్ చవిచూస్తుందని హెచ్చరించారు. ఎకనామిక్ డీ-డేలో భాగంగా అమెరికా ఆ దేశంతో అన్ని సంబంధాలను తెంచుకుంటుందని, ఆ దేశంతో సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా ఆర్థికంగా ఏకాకిగా మిగిలిపోవాల్సి వస్తుందని, వాటిపై ఆంక్షలు విధిస్తామని అన్నారు. ఇప్పటివరకూ ట్రంప్ అనేక సార్లు ఇరాన్‌కు బెదిరింపులు చేశారు. దాడులు చేసిన ప్రతిసారీ ఇరాన్ తమతో చర్చలు కోరుకుంటోందని సాకులు చెబుతూ వెనక్కి తగ్గుతూ వచ్చారు. ఇరాన్‌పై దాడులు పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇక అమెరికా వద్ద కీలకమైన ఆయుధాల నిల్వలు తగ్గిపోయాయన్న వార్తలు బహిరంగంగా బయటకు వచ్చాయి. యుద్ధం నుండి బయటపడే మార్గాలు వెతకాలని సెంట్‌కామ్ అధిపతి కూడా ట్రంప్‌కు రహస్య సమావేశంలో తెలియజేశారని వార్త వెలువడింది. ఆరు షరతులు అంగీకరించకపోతే హోర్ముజ్ జలసంధిని తెరిచేది లేదని అమెరికాకు ఇరాన్ హెచ్చరిక చేసింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ దాడులను నిలిపివేసి ఆర్థిక ఆంక్షలను తీవ్రతరం చేసే ఎకనామిక్ డీ-డే మార్గాన్ని చేపట్టారు. అయితే రాయిటర్స్ వార్తాసంస్థ సమాచారం ప్రకారం బెస్సెంట్ బెదిరింపులను ఇరాన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ సోమవారం ఒక ప్రకటన చేస్తూ, దురాక్రమణకు పాల్పడిన శత్రు దేశం విధించిన షరతులకు తలవొగ్గి వారికి అనుకూలంగా యుద్ధం ముగించేందుకు ఇరాన్ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. అందుకు అనుమతించబోమన్నారు. ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ దృఢనిశ్చయంతో ఉందని చెప్పారు. ఇరాన్ భూభాగాన్ని రక్షించుకోవడానికి ఇరాన్ అధికారులు వారాంతపు పత్రికాగోష్ఠిలో చాలా దృఢనిశ్చయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దురాక్రమణదారులపట్ల ఎలాంటి కనికరాన్ని ఇరాన్ చూపించబోదని, ఎందుకంటే యుద్ధాన్ని ఇరాన్ ప్రారంభించలేదని గుర్తుచేశారు. “మేం యుద్ధాన్ని ప్రారంభించలేదు, అందువల్ల దురాక్రమణకు పాల్పడుతున్న శత్రువు విధించే షరతులను ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు” అని స్పష్టం చేశారు. 40 రోజుల యుద్ధంలోనూ, అంతకుముందు 12 రోజుల యుద్ధంలోనూ దేశాన్ని రక్షించుకోవడానికి ఇరాన్ ప్రభుత్వంతోపాటు అన్ని శాఖలు, ప్రజలు ఐక్యంగా పనిచేశారన్నారు. ఇరాన్‌పై యుద్ధం చేయడానికి అమెరికాకు స్థావరాలుగా ఉపయోగపడే దేశాలను కూడా అంతర్జాతీయ చట్టాల ప్రకారం దురాక్రమణ దేశాలుగా ప్రకటించాలని బఖాయీ డిమాండ్ చేశారు. అమెరికా విమానాలకు ఇంధనాన్ని నింపేందుకు బల్గేరియా నుండి ఇంధన సరఫరా విమానాలు బయలుదేరాయని ఇరాన్‌కు సమాచారం అందిందని ఆయన ధృవీకరించారు. ఇస్లామిక్ దేశంపై దాడికి మూలకారణమైన ఏ దేశంపైన అయినా చర్య తీసుకునే హక్కు తమకు ఉందన్నారు.