త్రివిక్రమ్ తో పోల్చడం గౌరవంగా భావిస్తున్నాను.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ దర్శకుడు వెంకీ అట్లూరి
Venky Atluri
తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్అండ్ సన్స్’. లక్కీ భాస్కర్ సక్సెస్ తరువాత దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. సూర్యకి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. నేను సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి మణిరత్నం , త్రివిక్రమ్ . అలాంటిది త్రివిక్రమ్ తో నన్ను పోల్చడం అనేది గౌరవంగా భావిస్తున్నాను. దానిని నిలబెట్టుకోవడం కోసం మరింత బాధ్యతగా పని చేస్తాను. త్రివిక్రమ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సంభాషణలు సరదాగా ఉంటూనే, జీవిత సత్యాలు చెబుతాయి. ఆ సినిమా నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. ఆ తరహా రచన రాయడానికి ఇష్టపడతాను.వయసు వ్యత్యాసం ఉన్న బంధంపై కథ రాయాలని మొదట అనుకున్నాను. 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉండాలి. దాని చుట్టు అల్లుకున్న కథ ఇది. నా దృష్టిలో మనుషులు చెడ్డవారు కాదు. పరిస్థితుల వల్ల ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే విషయాన్ని సినిమాలో చెప్పడం జరిగింది. ఈ కథ నేను 2022 లోనే అనుకున్నాను. అప్పుడు సూర్యని దృష్టిలో ఉంచుకొని రాయలేదు. సూర్యకి నచ్చిన తర్వాత, ఆయన బాడీ ల్యాంగ్వేజ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేయడం జరిగింది.త్రివిక్రమ్ కు ఈ సినిమా చాలా నచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందే సినిమాల నిర్మాణంలో ఆయన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, దాదాపు అన్ని సినిమాలు చూస్తుంటారు. అయితే త్రివిక్రమ్ సినిమా చూసిన తర్వాత చిన్న చిన్న మార్పులు చేర్పులు సూచిస్తూ ఉంటారు. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం.. ఎలాంటి మార్పులు చెప్పకుండా, చాలా బాగుంది అన్నారు.సూర్య మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని తమిళంలో చిత్రీకరించాము. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో థియేటర్ల సంఖ్య తక్కువ. టికెట్ ధరలలో కూడా వ్యత్యాసం ఉంది. అందుకే అక్కడ వసూళ్లు తక్కువ వచ్చాయని అనిపిస్తుంది. కానీ, మన దగ్గరతో పోలిస్తే అక్కడ లాంగ్ రన్ ఉంటుంది. కరుప్పు విషయంలో అదే జరిగింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా లాంగ్ రన్ లో తమిళంలో భారీ వసూళ్లు సాధిస్తుంది.