ప్రజా ఉద్యమాల దిశానిర్దేశకుడు సుధాకర రెడ్డి
Sudhakar Reddy
మారుపాక అనిల్ కుమార్
భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో అనేకమంది నాయకులు కేవలం రాజకీయ పదవులను అలంకరించిన వ్యక్తులుగా కాకుండా, ఒక భావజాలానికి, ఒక విలువల రాజకీయాని కి, ప్రజల పట్ల అచంచలమైన నిబద్ధతకు ప్రతీకలుగా నిలిచారు. అలాంటి నాయకుల్లో కామ్రేడ్ సురవరం సుధాకర రెడ్డి ఒకరు. ఆయన జీవితం వ్యక్తిగత విజయాల గాథ కాదు; అది భారత శ్రామికవర్గం, రైతాంగం, పేదలు, అణగారిన వర్గాల విముక్తి కోసం సాగిన నిరంతర రాజకీయ ప్రయాణం. 2025 ఆగస్టు 22న ఆయన మరణంతో భారత కమ్యూనిస్టు ఉద్యమం ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయింది. అయితే ఆయన రాజకీయ వారసత్వం, సిద్ధాంత స్పష్టత, ప్రజల పట్ల అంకితభావం వామపక్ష ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తున్నాయి. ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితాన్ని స్మరించుకోవడం అంటే ఒక నాయకుడిని మాత్రమే కాదు, ప్రజా రాజకీయాల అసలైన అర్థాన్ని గుర్తు చేసుకోవడం కూడా. సురవరం సుధాకర రెడ్డి యువకుడిగా ఉన్న రోజులే భారతదేశంలో తీవ్రమైన సామాజిక, రాజకీయ మార్పుల కాలం. స్వాతంత్య్రం వచ్చినప్పటికీ పేదరికం, భూమిలేని రైతులు, నిరుద్యోగం, కుల వివక్ష, సామాజిక అసమానతలు దేశాన్ని వెంటాడుతున్నాయి. రాజకీయ స్వాతంత్య్రం మాత్రమే సరిపోదు; సామాజిక, ఆర్థిక సమానత్వం కూడా రావాలని భావించిన వేలాదిమంది యువకులలో ఆయన ఒకరు. విద్యార్థి దశలోనే ప్రజా సమస్యల పై ఆసక్తి పెంచుకున్న ఆయన, సామాజిక మార్పుకోసం సంఘటిత రాజకీయాల అవసరాన్ని గుర్తించారు. మార్క్సిస్టు సాహిత్యం, భారత స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వంటి చారిత్రక సంఘటనలు ఆయన రాజకీయ అవగాహనకు మరింత పదును పెట్టాయి.
సురవరం సుధాకర రెడ్డి రాజకీయ జీవితంలో అత్యంత విశిష్టమైన అంశం ఆయన సిద్ధాంత నిబద్ధత. ఆయన వ్యక్తిగత జీవితం అత్యంత నిరాడంబరంగా ఉండేది. ఉన్నత రాజకీయ పదవుల్లో ఉన్నప్పటికీ ఆడంబరానికి దూరంగా ఉండేవారు. కార్యకర్తలతో సమానంగా కూర్చొని భోజనం చేయడం, వారి అభిప్రాయాలను శ్రద్ధగా వినడం, ప్రతి చిన్న కార్యకర్తను గౌరవించడం ఆయన నాయకత్వ శైలిలో ముఖ్య లక్షణాలు. నాయకుడు అంటే ఆదేశాలు ఇచ్చే వ్యక్తి కాదని, ప్రజలతో కలిసి నడిచే వ్యక్తి అని ఆయన తన ఆచరణతో నిరూపించారు.
సురవరం సుధాకర రెడ్డి దృష్టిలో ఎన్నికలు రాజకీయ జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ ప్రజల దైనందిన సమస్యలపై జరిగే ఉద్యమాలే అసలైన ప్రజాస్వామ్యానికి ప్రాణం అని ఆయన నమ్మారు. రైతుల భూమి సమస్యలు, కార్మికుల వేతనాలు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం ఈ అంశాలన్నింటిపైనా ఆయన ఉద్యమాలకు నాయకత్వం వహించారు. యువజన ఉద్యమంలో కీలక నాయకుడిగా పనిచేశారు. ఆయన అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించాలని దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ఉద్యమంలో కేరళ కు చెందిన సి.కె. చంద్రప్పన్ వంటి నాయకులతో కలిసి విస్తృత ప్రచారం, ఆందోళనలు నిర్వహించారు. ఆ ఉద్యమం ఫలితంగా తర్వాత భారత రాజ్యాంగంలోని 61వ రాజ్యాంగ సవరణ (1988) ద్వారా ఓటు హక్కు వయస్సు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించబడింది. ఈ విజయానికి సురవరం సుధాకర రెడ్డి గారి దీర్ఘకాల పోరాటం కూడా ఒక ముఖ్యమైన కారణంగా గుర్తించబడుతుంది. విదేశాల్లో దాచిన నల్లధనం వల్ల దేశానికి భారీ ఆదాయ నష్టం జరుగుతుందని, అదే సమయంలో పేదల పై పన్నుల భారం పెరుగుతుందని ఆయన వాదించేవారు. ఈ సమస్యపై అన్ని రాజకీయ పార్టీలూ కలిసి పోరాడాలని కూడా పిలుపునిచ్చారు. విదేశీ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం అంశాన్ని పార్లమెంట్లో అనేక సందర్భాల్లో లేవనెత్తారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవినీతిపై పార్లమెంట్లో తీవ్రంగా స్పందించారు. ప్రజా సంపద ప్రజలకే దక్కాలని, సంపద కేటాయింపులో పారదర్శకత తప్పనిసరి అని, అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వంపైన పోరాటాలు నిర్వహించారు సురవరం సుధాకర రెడ్డి. పార్లమెంట్లో మహిళల రిజర్వేషన్ హక్కులకు సంబంధించిన అంశాలపై నిరంతరం మాట్లాడారు. మహిళల సమాన హక్కులు, భద్రత, ఆర్థిక సాధికారత, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆయన మద్దతు తెలిపారు. మహిళల సమస్యలను ఆయన కేవలం సంక్షేమ అంశాలుగా కాకుండా సామాజిక న్యాయం, లింగ సమానత్వం, రాజ్యాంగ హక్కుల కోణంలో ప్రస్తావించేవారు. ముఖ్యంగా పేద, దళిత, గిరిజన, శ్రామిక మహిళల సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు.
నేటి తరానికి ఆయన స్ఫూర్తి
ప్రస్తుతం దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మత విద్వేష రాజకీయాలు, రాజ్యాంగ విలువలపై సవాళ్లు వంటి పరిస్థితుల్లో సురవరం సుధాకర రెడ్డి చూపిన రాజకీయ దారి మరింత ప్రాసంగికంగా కనిపిస్తోంది. ఆయన జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. ప్రజల పక్షాన నిలబడే రాజకీయాలే శాశ్వతమైనవి; విలువల కోసం పోరాడే నాయకత్వమే చరిత్రలో నిలిచిపోతుంది.
భారత కమ్యూనిస్టు ఉద్యమం కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజల నిత్యజీవిత సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం. ఆ ఉద్యమానికి సైద్ధాంతిక బలం, రాజకీయ దిశ, ప్రజలతో నిరంతర అనుబంధం అవసరం. ఈ మూడు లక్షణాలు సమపాళ్లలో కలిగిన నాయకుడు కామ్రేడ్ సురవరం సుధాకర రెడ్డి. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం క్రమంగా జాతీయ స్థాయికి చేరుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీని క్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో ముందుకు నడిపించారు.
సురవరం సుధాకర రెడ్డి పార్టీకి నాయకత్వం వహించిన కాలంలో భారత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ప్రపంచీకర ణ, ప్రైవేటీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాలు వేగంగా అమలవుతుంగా, మరోవైపు మతతత్వ రాజకీయాలు బలపడుతున్నాయి. ఈ రెండు ధోరణులు దేశ సామాజిక నిర్మాణానికీ, ప్రజల జీవన ప్రమాణాలకూ ప్రమాదకరమని ఆయన విశ్లేషించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర కమిటీలను బలోపేతం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, కార్మిక సంఘాలతో సమన్వయం సాధించడం వంటి అంశాలను ఆయన పార్టీ నిర్మాణంలో ప్రధాన ప్రాధాన్యంగా తీసుకున్నారు. పార్టీ బలం కార్యాలయాల్లో కాదు, ప్రజల మధ్య ఉంటుంది. ప్రజల పోరాటాల్లో భాగస్వామ్యం కాని పార్టీ బలపడదు.
పార్లమెంట్లో ప్రజల సమస్యలకు స్వరం
సురవరం సుధాకర రెడ్డి పార్లమెంట్‌ను కేవలం చట్టాలు చేసే వేదికగా కాకుండా, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రజాస్వామ్య వేదికగా ఉపయోగించారు. ప్రభుత్వ విధానాలను విమర్శించినప్పుడు కూడా ఆయన వ్యక్తిగత విమర్శలకు పోకుండా, గణాంకాలు, వాస్తవాలు, రాజ్యాంగ సూత్రాల ఆధారంగా తన వాదనను వినిపించేవారు. అందుకే రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనను గౌరవించేవారు. భారత రాజ్యాంగంలోని లౌకికవాదాన్ని సుధాకర రెడ్డి భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా భావించారు. భారతదేశం అనేక మతాలు, భాషలు, సంస్కృతులు, జాతులు కలిసిన దేశం. ఈ వైవిధ్యాన్ని కాపాడే శక్తి లౌకికవాదమేనని ఆయన విశ్వసించారు. మతం పేరుతో విద్వేషాన్ని రెచ్చగొట్టడం, ఎన్నికల ప్రయోజనాల కోసం సమాజాన్ని విభజించడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన అనేక సభల్లో హెచ్చరించారు.
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం నిరంతర పోరాటం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని సురవరం సుధాకర రెడ్డి అత్యంత గౌరవంతో చూసేవారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, కానీ ఆ హక్కులు ఆచరణలో అమలుకావాలంటే ప్రజా ఉద్యమాలు అవసరమని ఆయన స్పష్టం చేసేవారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, సంఘటిత హక్కు, కార్మిక హక్కులు, రైతుల హక్కులు, రాష్ట్రాల హక్కులు వంటి అంశాలపై ఎలాంటి దాడి జరిగినా ఆయన గట్టిగా వ్యతిరేకించారు. ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వరంగ సంస్థలు కేవలం వ్యాపార సంస్థలు కావని, అవి దేశ అభివృద్ధికి, ఉపాధికి, సామాజిక సమానత్వానికి పునాది అని ఆయన వాదించారు. రైల్వేలు, బీమా, బ్యాంకింగ్, బొగ్గు, ఉక్కు, విద్యుత్ వంటి కీలక రంగాలను ప్రైవేటీకరించడం వల్ల సామాన్య ప్రజలపై భారాలు పెరుగుతాయని ఆయన హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని అడ్డుకోవడం కాదని, ప్రజా ప్రయోజనాలను కాపాడటం అని ఆయన భావించేవారు.ప్రజల కు మేలు చేసే విధానాలకు మద్దతు ఇవ్వడం, ప్రజావ్యతిరేక విధానాలను నిరసించడం ఇదే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష రాజకీయమని ఆయన ఆచరణలో చూపించారు. అందుకే ఆయన కేవలం సిపిఐ నాయకుడిగానే కాకుండా, భారత ప్రజాస్వామ్య ఉద్యమానికి చెందిన ఒక విలువైన రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. యువత రాజకీయాలకు దూరంగా ఉండకూడదని, సమాజ సమస్యలను అర్థం చేసుకోవాలని, చరిత్రను అధ్యయనం చేయాలని ఆయన పిలుపునిచ్చేవారు. రాజకీయ శిక్షణ, పుస్తక పఠనం, ప్రజల మధ్య పని, శాస్త్రీయ దృక్పథం ఈ నాలుగు అంశాలను ఆయన యువ కార్యకర్తలకు
నిరంతరం సూచించేవారు.
ఆయన మాటల్లో: ఉద్యమానికి నినాదాలు మాత్రమే సరిపోవు. అధ్యయనం, ఆలోచన, ఆచరణ కలిసినప్పుడే శాశ్వత మార్పు సాధ్యమవుతుంది. ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ సురవరం సుధాకర రెడ్డికి మనం అర్పించే నిజమైన నివాళి ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం, రాజ్యాంగ విలువలను కాపాడడం, కార్మిక ప్రజల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరంతరం పోరాడడం.