కలవరపెడుతున్న హింస
Principal Rupa Reddy Murder Case
ఇటీవల రాష్ట్రంలో అత్యంత కలవరపెట్టే రీతిలో నేర సంబంధిత ఘటనలు కలవరపెడుతున్నాయి. పతనమవుతున్న సామాజిక విలువలకు ఇవి దర్పణం పడుతున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్స్‌పాల్ రూపారెడ్డిని సొంత పాఠశాల విద్యార్థులే దారుణంగా హత్య చేయడం తెలుగు ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా ఆమెను 27 సార్లు కత్తితో పొడిచి చంపిన తీరు ఒళ్ళు గగుర్పొడిచేలా చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారిద్దరూ పదవ తరగతి విద్యార్థులేనని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం వెల్లడిం రు. ఈ కేసులో చిన్న వయసులోనే హింసా ప్రవృత్తి పెరుగుతున్న వైనం ఆందోళన కలిగించేది. జల్సాలు, తాగుడు, ఖరీదైన అలవాట్లు, వ్యసనాల బారిన పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. వారిని తల్లిదండ్రుల సమక్షంలో వారించినందుకు కక్షగట్టి చంపడమే కాకుండా, పెద్ద ఎత్తున నగదును కొట్టేశారు. నిందిత విద్యార్థులను పట్టుకునేందుకు హత్య అనంతరం సుమారు పది రోజులు పట్టింది.
వారం రోజుల క్రితం తన మైనర్ కుమారుడితో కలిసి వరుస హత్యలు, దోపిడీలు చేసిన ఒక మహిళను సిద్ధిపేట పోలీసులు అరెస్టు చేశారు. నేరాలు పాల్పడేందుకు దృఢకాయుడిగా కొడుకును తీర్చిదిద్దేందుకు ఇంట్లోనే కసరత్తు చేసుకునేందుకు జిమ్ సామాగ్రిని కొనిచ్చింది ఆ తల్లి. వారిరువురు ఇద్దరు మహిళలను చంపి, దోచుకోవడమే కాకుండా, తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్న మహిళను కొట్టి నగలను లాక్కొని పారిపోయారు. మరో నలుగురిని చంపి దోచుకునేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు.
ఈ రెండు ఘటనలు సమాజంలో పతనమైన నైతిక విలువలకు అద్దం పడుతున్నాయి. నేరస్థులు హత్యలు చేయడమెలాగో యూట్యూబ్ వీడియోలను చూసి తెలుసుకున్నారట! త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశ, చెడు వ్యసనాలు, మద్యం, విస్తరిస్తున్న గంజాయి అలవాటు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. కొంత ఉన్నత వర్గాలలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈగిల్ పేరిట డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నా మారుమూల గ్రామాలకు కూడా అది విస్తరించటం ఆందోళన కలిగించేదే. వీటివల్ల మైనర్‌లలో సైతం హింసా ప్రవృత్తి, నేర సంస్కృతి పెరిగి
పోతోంది. కొందరు సామాజిక విశ్లేషకులు తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పుబడుతున్నారు. గతంలో మాదిరిగా పిల్లలను కనిపెట్టుకోవడం లేదనేది వారి వాదన. కానీ, సిద్ధిపేట ఘటనలో ధనాపేక్ష స్వయంగా తల్లే కొడుకుని నేరాల రొంపిలోకి దింపింది.
వీటిన్నిటి కారణాలను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. నైతిక విలువల పతనానికి ప్రధానంగా సామాజిక మాధ్యమాలు, దుర్వ్యసనాల ప్రభావం ఉందనేది విస్మరించలేని వాస్తవం. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉండడం, ఇంటర్నెట్ డాటా చౌకగా మారడంతో రకరకాల వీడియోలు అందుబాటులోకి వచ్చాయి. మంచి కన్నా చెడుకే ఎక్కువ చెల్లుబాటు అన్నట్లుగా, క్షీణ సంస్కృతిని విస్తరించేలా అశ్లీల వీడియోలు, నేర దృశ్యాలు, ఒటిటిలో నియంత్రణ లేని కంటెంట్ అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. వీటి ప్రభావంలో పిల్లలే కాకుండా పెద్దలు కూడా కొట్టుకుపోతున్నారు. అనైతిక సంబంధాల నేపథ్యంలో పెరిగిపోతున్న హత్యలను కూడా చూస్తున్నాం. కష్టపడకుండానే ధనవంతులైపోవాలనే యావను పెంచే గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్‌లతో చితికిపోయిన కుటుంబాలు అసంఖ్యాకం. ఇక మద్యాన్ని ప్రధాన ఆదాయవనరుల్లో ఒకటిగామార్చేసుకున్న ప్రభుత్వాలు కుగ్రామాలకు సైతం ఏరులై పారేలా చేశాయి. ఆబ్కారీ అధికారులకు అమ్మకాలపై టార్గెట్‌లు పెడుతున్నాయి. దీన్ని గత ప్రభుత్వాలు పెంచి పోషించగా, ఇప్పటి ప్రభుత్వ హయంలో పరాకాష్ఠకు చేరుకుంది. సంక్షేమ పథకాలకు దాదాపు రూ.50వేల కోట్లు వెచ్చిస్తుండగా, అంతే మొత్తంలో రూ.47 వేల కోట్ల వరకు మద్యం ద్వారా ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. ఒకచేతితో ఇచ్చి, మరో చేతితో లాగేసుకోవడమే అవుతుంది. ఇదొక ఎత్తుతై విచ్చలవిడి అమ్మకాలతో పెద్దా చిన్నా, ఆడా మగ తేడా లేకుండా మద్యానికి బానిసలవుతున్నారు. వీటికి తోడు గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది. ఫలితంగా క్రమంగా విచక్షణ కోల్పోయే పరిస్థితులకు దారి తీస్తోంది.
నియంత్రణ లేని అశ్లీల కంటెంట్‌ను అందిస్తున్న ఒటిటి, ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికల విస్తరణ నిత్యం ధర్మం, విలువల పాఠాలు వల్లించే బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ జరిగింది. ప్రపంచంలోనే అతి చౌకగా ఇంటర్నెట్ డాటా అందుబాటులోకి రావడంతో తప్పుడు చారిత్రక వాస్తవాలతో ప్రజల ను బ్రెయిన్ వాష్ చేసేందుకు కాషాయదళం దానిని దుర్వినియోగం చేసింది. మరోవైపు, ఇదే ఇంటర్నెట్ విలువల పతనానికి కూడా అది మరో రూపంలో దారి తీసింది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్ తదితర దేశాలు 16 ఏళ్ళ లోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాయి. సామాజిక వేదికల్లో అన్నీ దుర్లక్షణాలే ఉంటాయని కాదు. ఇటీవల నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో జరిగిన జంతర్ మంతర్ ఉద్యమంలో వాటి సద్వినియోగ పాత్ర వెల్లడైంది. మన దేశంలో అశ్లీల, క్రైమ్ కంటెంట్‌పై ఉక్కుపాదం మోపాల్సిన సమయం ఆసన్నమైంది. అధికారంలో ఉన్న పార్టీలు మద్య పానాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో కంటితుడుపుగా వాగ్దానం చేస్తున్నాయే తప్ప ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక దాని ద్వారా వచ్చే ఆదాయంపైనే మక్కువ చూపుతున్నాయి. మద్యపాన వ్యసనం ఆరోగ్యాలను, కుటుంబాలను కుదేలు చేస్తోంది.ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు.
సోషల్ మీడియా ఉధృతితో పిల్లలు, పెద్దల్లో పుస్తక పఠనాసక్తి తగ్గిపోయింది. గతంలో బాలల సాహిత్యం విస్తృతంగా అందుబాటులోఉండేది. వాటిలో కథలు పిల్లల్లో చిన్నప్పటి నుంచే నైతిక విలువలు పాదుకొల్పేవి. ఇప్పుడు తెలుగులో అలాంటి పుస్తకాలే అరుదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావును సలహాదారుడిగా నియమించింది. ఆయన అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్, వివేకానంద, స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలలోని స్ఫూర్తివంతమైన ఘటనలను విద్యార్థులకు బోధించి నైతిక విలువల పెంపునకు ఒక ప్రయోగం సాగుతోంది. ఇప్పటికైనా అన్ని స్థాయిల్లో ప్రభుత్వాలు మేల్కొని సామాజిక సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలకు తక్షణమే పూనుకోవాలి. పతనమవుతున్న విలువలను నిలబెట్టే ప్రయత్నం జరగాలి. లేదంటే పరిస్థితి మన కళ్ళముందే మరింత వేగంగా దిగజారుతుంది.