యువ భారత ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి… రాజీవ్ గాంధీ
Rajiv Gandhi
రాచమళ్ల సిద్ధేశ్వర్
(రాజీవ్ గాంధీ జయంతి నేడు)
భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన దూరదృష్టి కలిగిన నాయకుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలనే స్పష్టమైన సంకల్పంతో ఆయన తన పాలనాకాలంలో సాంకేతికత, ఆధునికీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఆధునిక విద్యను ప్రోత్సహించడం ద్వారా జ్ఞాన ఆధారిత సమాజానికి పునాదులు వేశారు. అదే సమయంలో ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేసేందుకు ప్రయత్నించడం వంటి చారిత్రక నిర్ణయాలతో భారత ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయటానికి కృషి చేశారు.
తన తల్లి, మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ దారుణ హత్య అనంతరం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కేవలం 40 ఏళ్ల వయస్సులో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగారు.
కంప్యూటర్ సాంకేతికతను భారతదేశ భవిష్యత్తుతో అనుసంధానం చేసిన ఆయన దూరదృష్టి నేడు దేశంలో విస్తరిస్తున్న డిజిటల్ సేవలు, టెలికమ్యూనికేషన్స్, ఆన్‌లైన్ పాలన, డిజిటల్ చెల్లింపులు, ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆగస్టు 20న ఆయన జయంతిని పురస్కరించుకుని రాజీవ్ గాంధీ ఆలోచనలు, సంస్కరణలు, ఆధునిక భారత నిర్మాణానికి ఆయన చేసిన కృషిని స్మరించుకోవడం అవసరం. 1984లో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (CDOT) ఏర్పాటుకు ఆయన అందించిన ప్రోత్సాహం దేశీయ టెలికమ్యూనికేషన్ సాంకేతికత అభివృద్ధికి బలమైన పునాది వేసింది.
విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఆధునిక దృక్పథం రాజీవ్ గాంధీది. ఓపెన్ మరియు దూరవిద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ఉద్యోగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను చేరువ చేశారు.
1985లో ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ఏర్పాటుతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి కొత్త విద్యా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో నూతన జాతీయ విద్యా విధానం రూపకల్పనకు శ్రీకారం చుట్టి విద్యా వ్యవస్థ ఆధునికీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు.
అధికార వికేంద్రీకరణ విషయంలో కూడా రాజీవ్ గాంధీ ఆలోచనలు ఎంతో ముందుచూపుతో కూడుకున్నవి. గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం బలపడాలంటే స్థానిక సంస్థలకు తగిన అధికారాలు, ఆర్థిక వనరులు, పరిపాలనా స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆయన విశ్వసించారు. ఈ లక్ష్యంతో 1989లో ఆయన ప్రభుత్వం లోక్‌సభలో 64వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకపోయినప్పటికీ, రాజీవ్ గాంధీ ప్రారంభించిన వికేంద్రీకరణ ప్రక్రియ, అనంతరం పి.వి. నరసింహారావు ప్రభుత్వ హయాంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో నెరవేరింది.
రాజీవ్ గాంధీ దృష్టి కేవలం సాంకేతికతకే పరిమితం కాలేదు. పారదర్శక పరిపాల న, ప్రజలకు వేగంగా సేవల అందజేత, ఆధునిక సమాచార వ్యవస్థల వినియోగం, విద్యా విస్తరణ, గ్రామీణాభివృద్ధి, మహిళలు మరియు బలహీన వర్గాల భాగస్వామ్యం వంటి అంశాలను సమగ్ర జాతీయ అభివృద్ధిలో అంతర్భాగాలుగా ఆయన చూశారు. రాజీవ్ గాంధీ జీవితం కూడా ఆయన తల్లి ఇందిరాగాంధీ జీవితంలాగే విషాదాంతమైంది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ఉగ్రవాద దాడిలో ఆయన హత్యకు గురయ్యారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 46 సంవత్సరాలు. రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువతను శక్తివంతం చేయడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సాంకేతికతను ప్రజల సంక్షేమానికి వినియోగించడం ఆయనకు మనం అందించే నివాళి.