Skip to content
జాతీయం వార్తలు

గ్రామీణ రైల్వే మిషన్‌ ‘సాకారమైతేనే గ్రామాల సమగ్రాభివృద్ధి’

Prajapaksham 20 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
గ్రామీణ రైల్వే మిషన్‌ ‘సాకారమైతేనే గ్రామాల సమగ్రాభివృద్ధి’

trains

అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మనం తర చు మెట్రో నగరాలు, హై స్పీడ్‌ రైళ్ళు, పెద్ద పెద్ద విమానాశ్రయాలు, ఆధునిక రవాణా, మౌళిక సదుపాయాల గురిం చి మాట్లాడుతుంటాం. కానీ అసలు భారతదేశపు బలమంతా గ్రామాల్లో ఉంద ని, ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలతో ఆధునికంగా, సమర్థవంతంగా రవాణా వ్యవస్థ కలిగి ఉన్నప్పుడే, నూతనం గా ఏర్పడ్డ, రూపుదిద్దుకున్న నగరాలలో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. వేగవంతంగా నడిచే ‘వందే భారత్‌’ లాంటి ఎక్సప్రెస్‌ రైళ్లు కేవలం దేశంలోని ప్రధాన నగరాల మధ్యనే నడుస్తున్నాయి. ఇవి కేంద్రం చేపట్టిన నూతన సంస్కరణల ద్వారా రైల్వే శాఖ బలోపేతానికి, నూతన పథకాలైన ‘అమృత్‌ భారత్‌ 2.0’ కార్యక్రమం ద్వారా సాధ్యమైంది.
కానీ గ్రామీణ – పట్టణ ప్రాంతాల సత్వర రవాణా కోసం రైల్వే లైన్ల అనుసంధానం, సమగ్ర అభివృద్ధికి, నూతన కార్యాచరణకోసం ప్రణాళికలు రూపొందించ వలసిన అవసరం ఉన్నది. ఉదాహరణకు నూతన కాలనీలతో నగరాలు ఏర్పడినప్పుడు లేదా ఉన్న నగరాల నివాస పరిధి పెరిగినప్పుడు ఆ సమయంలో ఉన్న జనసంఖ్య, వారికి కావాల్సిన ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం వ్యాపార రంగాలు ముఖ్యంగా ఆ పట్టణాలలో జరిగే ఆర్థిక వాణిజ్య, వ్యాపారాలు అక్కడ స్థిరపడ్డ ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి కారణం అవుతాయి.
ఉద్యోగాన్వేషణలో యువకులు పట్టణాల బాటపడితే వయోభారంతో ఉన్నవారు, తల్లిదండ్రులు గ్రామాల కు పరిమితం కావాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో గ్రామాల్లో స్థిరపడ్డ వీళ్లు వ్యవసాయ అనుబంధ మైన పనులు చేయడానికి వారి వయసు సహకరించక, గ్రామాలలో కూలీలు దొరకక అవి కుంటుపడే అవకాశం కూడా ఉన్నది. దీనివల్ల నగరాలకు చేరవలసిన పాలు, పెరుగు, పాల ఉత్పత్తు లు, కూరగాయలు, పండ్లు, పువ్వులతో పాటు వ్యవసాయ ఉత్పత్తు లైన కంది, జొన్న, గోధుమ, శనగ, పల్లి, కుసుమ మొదలైన పప్పు ధాన్యాలు, బియ్యం కూడా మార్కెట్‌ డిమాండ్‌ కు తగ్గట్టుగా దిగుబడి అయ్యే అవకాశం ఉండదు. ఈ పరిస్థితి నగరాలలో స్థిరపడ్డ ప్రజలపై పెను భారం మోపుతుంది. ఇతర గ్రామీణ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు ప్రశ్నార్థక మవుతాయి. గ్రామీణ ప్రాంతాలలో ఐటీ పార్కులు, భారీ పరిశ్రమలు, కార్పొరేట్‌ కార్యాలయాలు, పెద్ద పెద్ద వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల పట్టణాల్లో స్థిరపడ్డవారు గ్రామాలకు చేరి వారి పని స్థలానికి దగ్గరలోనే నివాసం ఉండడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందడమే కాకుండా, పట్టణాలలో మౌలిక వసతులు కల్పనకు ఇబ్బందులు ఉండవు. రైతులు తమ తమ ఉత్పత్తులను పట్టణ మార్కెట్లకు త్వరగా తక్కువ ఖర్చుతో రవాణా చేయడం వల్ల దుబారా ఖర్చులు తగ్గి, వారి ఆదాయం పెరగడంతో పాటు వినోదం, జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల పట్టణాలలో భారం తగ్గుతుంది.
ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ చెందడం వల్ల అర్బన్‌ కమ్యూనిటీ రూరల్‌ ప్రాంతాల వైపు రావడానికి ఆస్కారం ఏర్పడింది. ఉదాహరణకు హైదరాబాద్‌ చుట్టూ 158 కిలోమీటర్ల పొడవుతో ఎనిమిది లేన్‌లతో ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు కు అనుసందానంగా గచ్చిబౌలి, పటాన్‌ చెరు, బొల్లారం, మేడ్చల్‌, ఉప్పల్‌, చర్లపల్లి, శంషాబాద్‌, ఘట్కేసర్‌, శంకర్‌ పల్లి, మొదలైన ప్రాంతాలకు రోడ్డు రవాణా సౌకర్యంతో పాటు, ఔటర్‌ లోపల ఉన్న గ్రామాలకు, నగరానికి అవసరమైన నూతన రైల్వే లైన్ల ద్వారా మరింత సత్వర రైల్వే ప్రయాణ రవాణా సౌకర్యం కల్పించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా 346 కిలోమీటర్ల పొడవుతో నూతనంగా రూపుదిద్దుకుంటున్న (రీజనల్‌ రింగ్‌ రోడ్‌ కు అనుసంధానంగా సంగారెడ్డి, గజ్వేల్‌, యాదాద్రి, చౌటుప్పల్‌, ఆమనగల్‌, చేవెళ్ల మొదలైన ప్రాంతాలను, జిల్లా కేంద్రాలతో అనుసంధానం చేసే విధంగా చుట్టుపక్కల జిల్లాలతో రైల్వే రవాణా సౌకర్యాన్ని కల్పించాలి. అదేవిధంగా ట్రాఫిక్‌ సమస్యను అధిగమించవచ్చు. కాలుష్యం నుండి ప్రజలకు స్వాంతన కల్పించవచ్చు. 350 నుండి 400 కిలోమీటర్ల పరిధిలో రీజినల్‌ రింగ్‌ రైల్‌ రూపుదిద్దుకుంటే నగరానికి 100 కిలోమీటర్ల బయట కూడా దీని ప్రభావంతో అద్భుతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ట్రిపుల్‌ ఆర్‌ కు అనుసంధానంగా రీజినల్‌ రింగ్‌ రైల్‌ (ఆర్‌ ఆర్‌ ఆర్‌) ప్రాజెక్ట్‌ ను చేపట్టే ప్రతిపాదన ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు మధ్య అద్భుతమైన రవాణా వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.
2018 సంవత్సరంలో హైదరాబాద్‌ – ఢిల్లీ హైదరాబాద్‌ విమానాలు ప్రతిరోజు 20 నుండి 25 తిరిగేవి. దాదాపు సంవత్సరానికి 14 వేల నుండి 18 వేల ట్రిప్పులు, 6 నుండి 8 రైళ్లు తిరిగేవి. అంటే సంవత్సరానికి నాలుగున్నర వేల నుండి ఐదున్నర వేల ట్రిప్పులు తిరిగేవి. అదే 2026 సంవత్సరానికి వచ్చేనాటికి హైదరాబాద్‌ – ఢిల్లీ – హైదరాబాద్‌ విమానాలు 25 నుండి 26 వరకు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ సంవత్సరానికి 19 వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి రైళ్లు 7 నుండి 9 వరకు రాకపోకలు పెరిగి ప్రతి సంవత్సరం దాడాపు ఐదు వేల నుండి ఆరున్నర వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రధానంగా రైల్వేలు గ్రామీణ- పట్టణ కనెక్టివిటీ కి కీలక పాత్ర పోషించాలి. దీనిలో భాగంగా ‘రూరల్‌ రైలు కారిడార్లు‘ అంటే ప్రతి 30 నుండి 50 కిలో మీటర్ల పరిధిలో ఒక రైల్వే స్టేషన్‌ ఉండేలా ప్రణాళికలు రూపొందించి చిన్న చిన్న పట్టణాలు, మండల కేంద్రాలను ఆ రైల్వే లైన్ల తో అనుసంధానం చేయాలి. ప్రతి వంద కిలోమీటర్ల లోపల ఒక పెద్ద పట్టణానికి నేరుగా రైల్వే కనెక్షన్‌ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. సబర్బన్‌, ఎం ఎంటిఎస్‌ మేము (ఎం ఈ ఎం యు) డెము (డిఈ ఎం యు) రైళ్లు ఉదయం, సాయంత్రం రైల్వే ప్రయాణికుల ట్రాఫిక్‌ కు తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లతో రవాణా సౌకర్యం కల్పించాలి. నూతన రైల్వే ట్రాక్‌ ల విస్తరణ, ఎలక్ట్రిఫికేషన్‌, రైల్వే స్టేషన్ల అభివృద్ధి హై స్పీడ్‌ ప్రాజెక్టులతో పాటు గ్రామీణ కనెక్టివిటీకి కూడా అత్యధిక నిధులు కేటాయించ వలసిన అవసరం ఉన్నది. దేశంలో 60 శాతం జనాభా గ్రామాల్లోని నివాసం ఉంటున్నది అందువల్ల ఇంక్లూజివ్‌ రైల్వే డెవలప్మెంట్‌ ద్వార స్టేషన్‌ ఆధారిత ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు అవసరమైతే ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ సేవలను మరింత విస్తృతపరచవచ్చు.అంతరాలు లేని సమాన అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ‘గ్రామీణ రైల్వే మిషన్‌” ద్వారా గ్రామాల అనుసంధానంతో గ్రామీణ భారతం నూతన రూపురేఖలు సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.