Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ముంచుకొస్తున్న వ్యవసాయ సంక్షోభం

Prajapaksham 20 Aug 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ముంచుకొస్తున్న వ్యవసాయ సంక్షోభం

Telangana Drought

భారత వ్యవసాయరంగంలో తీవ్ర సంక్షోభం తప్పని పరిస్థితులు కనిపిస్తున్నా యి. అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై రైతుల ఆందోళన, విద్యుత్‌ ప్రసార మార్గాల కోసం వ్యవసాయ భూముల వినియోగంపై గుజరాత్‌లో జరుగుతున్న నిరసనలు, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయాలన్న మధ్యప్రదేశ్‌ రైతుల డిమాండ్‌, ఉల్లికి గిట్టుబాటు ధర కోసం మహారాష్ట్రలో జరుగుతున్న పోరాటాలు, సాగునీటి కోసం తమిళనాడులో వినిపిస్తున్న ఉద్యమాలు.. ఇవి విడివిడిగా కనిపించినా, రైతు భూమి, రైతు ఆదాయం, రైతు ఉత్పత్తిపై నిర్ణయం తీసుకునే సమయంలో రైతు మాటకు ఎంత ప్రాధాన్యం ఉంది? అనే ప్రశ్నను ముక్తకంఠంతో వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇటీవల చేపట్టిన నిరసనలను కూడా ఈ ప్రశ్న నేపథ్యంలోనే చూడాలి.
అమెరికాతో వాణిజ్య చర్చల్లో వ్యవసాయ మార్కెట్‌ను ఎంతవరకు తెరవాలి? అన్నది కేవలం సుంకాల అంశం కాదు. అది కోట్లాది కుటుంబాల జీవనాధారాన్ని ప్రభావితం చేసే ఆర్థిక నిర్ణయం. అదే విధంగా ఒక విద్యుత్‌ ప్రసార లైన్‌ కోసం పొలం లో స్తంభం వేయడాన్ని కూడా మౌలిక వసతుల నిర్మాణం అంశంగాకాకుండా, భూమి వినియోగం, భూమి విలువ, భవిష్యత్‌ సాగు అవకాశాలు, రైతు ఆస్తి హక్కులకు సంబంధించిన విషయంగా చూడాలి. భారత్‌ వాణిజ్య చర్చల విషయంలో రైతుల ఆందోళనకు వాస్తవమైన ఆర్థిక నేపథ్యం ఉంది. 2026 ఫిబ్రవరిలో ప్రకటించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అమెరికా అధికారిక పత్రాల్లోనే భారతదేశం అమెరికా నుంచి పలు ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి లేదా తొలగించడానికి అంగీకరించినట్టు సమాచారం. ప్రాసెస్‌ చేసిన పండ్ల నుంచి సోయాబీన్‌ ఆయిల్‌ వరకు వివిధ ఉత్పత్తులు ఆ జాబితాలో ఉన్నాయి. అదే సమయంలో ఇరుదేశాలు మరింత విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగిస్తున్నాయి. అందువల్ల రైతుల భయం పూర్తిగా ఊహాజనితమని కొట్టిపారేయరాదు. అమెరికాలో వ్యవసాయ రంగం భారీ స్థాయిలో ప్రభుత్వ మద్దతుతోపాటు, సబ్సిడీలు, యాంత్రీకరణ, విస్తారమైన ఉత్పత్తి వ్యవస్థతో పనిచేస్తుంది. భారతదేశంలో మాత్రం చిన్న, సన్నకారు రైతుల సంఖ్య ఎక్కువ. ఉత్పత్తి వ్యయం, వాతావరణ ప్రమాదాలు, మార్కెట్‌ ధరల అస్థిరత, రుణభారం, నిల్వ సదుపాయాల కొరత వంటి సమస్యలు ఇప్పటికే రైతు ఆదాయాన్ని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో తక్కువ ధరకు దిగుమతులు మార్కెట్లోకి వస్తే దాని ప్రభావం పంట ధరలతో ఆగదు. గ్రామీణ కార్మికుడి ఉపాధి, స్థానిక వ్యాపారం, రవాణా, వ్యవసాయ ఆధారిత చిన్న పరిశ్రమలు, చివరకు వినియోగదారుడి కొనుగోలు శక్తి వరకు అది విస్తరించవచ్చు. ప్రభుత్వం మాత్రం వ్యవసాయం తనకు కీలకమైన అంశమని, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఒప్పందానికి అంగీకరించబోమని పదేపదే చెబుతోంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని కీలక ఉత్పత్తుల విషయంలో దిగుమతులపై రక్షణ కొనసాగుతుందని కూడా అధికారిక ప్రకటనలు వెలువడుతున్నాయి. అయితే, ఈ హామీలు ఎంతవరకు అమలవుతాయన్నదే ప్రశ్న. 2020 సెప్టెంబర్‌ నుంచి 2021 నవంబర్‌ వరకూ పెద్దఎత్తున కొనసాగిన రైతు ఉద్యమానికి తలవంచిన మోదీ సర్కారు, వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకుంది. అదే సమయంలో, వివిధ పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పి) చట్టబద్ధం చేయడంసహా పలు అంశాలపై హామీలిచ్చింది. కానీ, ఇప్పటి వరకూ అవి అమలుకు నోచుకోలేదు. అందుకే, ఇప్పుడు రైతులు మళ్లీ ఉద్యమిస్తున్నారు. ఇది మరోసారి మహోగ్రరూపం దాల్చకుండా అడ్డుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం రాజకీయ పాచికలు విసురుతున్నది. రైతులను అభివృద్ధి వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నది.
ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించకుండా తాత్సారం చేస్తూ, రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామనే ప్రకటనల వల్ల ఎవరికి ఉపయోగం? ఈ కోణంలో చూస్తూ, రైతు సమస్య కేవలం పంట ధర సమస్యగా పేర్కోవడం కూడా సరైనది కాదు. రైతుకు ఉత్పత్తి చేయడానికి భూమి కావాలి. ఉత్పత్తికి నీరు, విద్యుత్‌, ఎరువులు కావాలి. ఉత్పత్తి చేసిన తర్వాత గిట్టుబాటు ధర కావాలి. మార్కెట్‌లో దిగుమతి పోటీ ఎదురైతే రక్షణ కావాలి. ఏ పంట దిగుమతి అవుతుంది? ఎంత పరిమాణంలో వస్తుంది? దేశీయ ధరపై దాని ప్రభావం ఎంత? రైతుకు రక్షణగా ఏ అంశాలు ఉంటాయి? దిగుమతులు పెరిగితే అత్యవసరంగా సుంకాలు పెంచే అవకాశం ఉందా? దేశీయ ఉత్పత్తి పడిపోతే ప్రభుత్వం కొనుగోలు వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కావాలి. విద్యుత్‌ గ్రిడ్‌లు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పరిశ్రమలు, రహదారులు, రైల్వేలు దేశానికి అవసరం. ఎవరూ కాదనరు. కానీ అభివృద్ధి పేరుతో భూమిని ఉపయోగించేటప్పుడు భారం ఎవరు మోస్తున్నారు? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. దేశానికి విద్యుత్‌ అవసరం అయితే దాని కోసం భూమిని కోల్పోయే కుటుంబం కూడా ఆ అభివృద్ధిలో భాగస్వామి కావాలి. కేవలం పరిహారం తీసుకున్న వ్యక్తిగా రైతును చూడటం సరిపోదు.
భూమి హక్కు, ఆహార భద్రత, మార్కెట్‌ రక్షణ, పర్యావరణ ప్రభావం వంటి అంశాలను ఒకే చట్రంలో భాగాలుగా చూడాలి. అందుకు భిన్నంగా జరిగే ప్రతి ప్రయత్నాన్ని రైతులు అడ్డుకుంటారు. ప్రతి అడుగునూ వ్యతిరేకిస్తారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతి విధాన నిర్ణయాల్లోనూ తమ పాత్ర ఉండాలని, కనీసం తమ అభిప్రాయాలు తెలుసుకోవడానికి రైతు డిమాండ్‌ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే, దేశ ఆర్థిక వ్యవస్థలో రైతు చివరి లబ్ధిదారు కాదు. ఆర్థిక వ్యవస్థకు పునాది వేసే ఉత్పత్తిదారు. అతని భూమిని ఉపయోగించుకుని విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్నా, అతని మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయిలో తెరవాలన్నా, అతని పంటను దేశీయ మార్కెట్‌లో విక్రయించాలన్నా ముందుగా అతని భద్రతను నిర్ధారించాలి. అలాంటి వివరణలు ఏవీ ఇవ్వకుండా జరిగే ఏ వాణిజ్య ఒప్పందానికీ, ఏ మౌలిక వసతుల ప్రాజెక్టుకీ, ఏ వ్యవసాయ సంస్కరణకూ దీర్ఘకాలిక ప్రజామోదం లభించడం కష్టం. రైతు తన భూమి, తన పంట, తన ఆదాయం గురించి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో కేంద్ర స్థానంలో ఉండాలి. అదే ప్రజాస్వామ్య ఆర్థిక విధానానికి గీటురాయి.

ట్యాగ్‌లు: editorial farm sector farmer news