Skip to content
జాతీయం వార్తలు

Editorial: పార్లమెంట్లో ‘ఇండియా’ సఫలం

Prajapaksham 14 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Editorial: పార్లమెంట్లో ‘ఇండియా’ సఫలం

Editorial: పార్లమెంట్లో ‘ఇండియా’ సఫలం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. పరీక్షా పత్రాల లీకేజీ సవరణ బిల్లుపై చర్చ జరిగిన రోజు మినహా దాదాపు అన్ని రోజులూ ఉభయ సభలు వాయిదా పర్వం కొనసాగుతూ వచ్చింది. సాధారణ పరిస్థితుల్లో ఈ 21 రోజుల సమావేశాలు వృథా అయినట్లుగానే జనసామాన్యం భావిస్తుంటుంది. కానీ, ఈసారి సమావేశాలలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, అప్రజాస్వామిక ధోరణులను ఎదురొడ్డి నిలువరించటంలో ప్రతిపక్షాలు చారిత్రక విజయాన్నే సాధించాయి.

నీట్‌ పేపర్‌ లీకేజీపై జంతర్‌మంతర్‌లో విద్యార్థి ఉద్యమం, సభలో ప్రతిపక్షాల ఒత్తిడి ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం గొప్ప విజయమే. పన్నెండేళ్లుగా వివిధ అంశాలలో తమ వైఫల్యాలను కించిత్ కూడా అంగీకరించేందుకు ఇష్టపడని కేంద్ర ప్రభుత్వ దురహంకారపు కొమ్ములు విరిచిన ఘట్టమిది. ‘చలో సంసద్‌’లో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర రిజర్వు బలగాల పాశవిక దాడికి బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టగలిగాయి.

మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి సర్వాంతర్యామి అయిన ప్రధాని మోదీ, ఆయువుపట్టులాంటి కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఆత్మరక్షణలోకి నెట్టేయడంలో విపక్ష ఎంపీలు సఫలమయ్యారు. వారి విమర్శల ధాటికి తట్టుకోలేక ఉభయ సభలలోకి అడుగుపెట్టేందుకు సైతం సంకోచించే స్థితికి నెట్టివేయబడ్డారు. పార్లమెంటుకు వచ్చినా తమ ఛాంబర్‌లోనే మిన్నకుండిపోయారు. అమిత్ షా సభకు వచ్చి ప్రకటన చేయాలన్న ప్రతిపక్షాల ఏకోన్ముఖ డిమాండ్‌కు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సైతం స్పందించాల్సి వచ్చింది. ప్రతిపక్షాల భావాలను హోం మంత్రికి తెలియజేయాలని ఆయన పార్లమెంటు వ్యవహారాల మంత్రికి సూచించారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఆయన సభకు రాలేదు.

ప్రధాని, హోం మంత్రులిరువురూ పార్లమెంటులో కనపడడం లేదనే ప్రతిపక్షాల నిరసన ధ్వనులు వారికేమో కానీ, దేశ ప్రజల వీనుల్లోకి గట్టిగానే చేరాయి. నష్టనివారణలో భాగంగా చివరాఖరి రోజున లోక్‌సభ నిరవధిక వాయిదా పడేందుకు కొద్ది నిమిషాల ముందు వారిద్దరూ సభకు హాజరు కాకతప్పలేదు.

ప్రస్తుత సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపజేసుకోవాలనుకున్న లోక్‌సభ నియోజకవర్గాల పెంపుపై రాజ్యాంగ సవరణ బిల్లు, ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ బిల్లు, విద్యపై కేంద్ర పెత్తనాన్ని తావిచ్చే ‘వికసిత్ భారత్ శిక్షా అభియాన్’ బిల్లులను కేంద్ర ప్రభుత్వం కనీసం పార్లమెంటులో ప్రవేశపెట్టలేకపోయింది. మైనారిటీల స్వచ్ఛంద సంస్థల వెన్నువిరిచే ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును ప్రతిపక్షాల పంతం కారణంగా నెగ్గించుకోలేక జేపీసీకి పంపించారు. ఇదంతా ప్రతిపక్షాల విజయమే.

వాస్తవానికి కొద్ది రోజుల ముందు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీల నుంచి 34 మంది ఎంపీలను ఎన్‌డీఏ పంచన చేరేలా బీజేపీ తెగబడింది. ఇండియా కూటమిలో శరద్ పవార్ ఎన్‌సీపీని, తమిళనాడు ఎన్నికల తరువాత దూరమైన డీఎంకేను సైతం దొడ్డిదారి మంతనాల ద్వారా మచ్చిక చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు మంత్రాంగం సాగించారు. ప్రతిపక్ష శిబిరాన్ని ధ్వంసం చేసేందుకు కుటిల పన్నాగాలన్నీ ప్రయోగించారు.

కేరళ ఎన్నికల్లో తమపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో సీపీఐ(ఎం) గుర్రుగా ఉండటం, జూన్ 8న జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశానికి ఆప్, డీఎంకే దూరంగా ఉండటం ప్రతిపక్షాల ఐక్యతపై అనుమానాలు ముసురుకున్నాయి. ఒకవైపు దూకుడు మీద ఉన్న అధికార పక్షం, మరోవైపు ఫిరాయింపులతో సంఖ్యాబలం తగ్గి, పూర్తి స్థాయి సఖ్యత లేని ప్రతిపక్ష శిబిరం. ఈ వాతావరణంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.

జంతర్‌మంతర్‌లో విద్యార్థుల నిరసనోద్యమం, వారిపై జరిగిన దాష్టీకం పరిస్థితిని మలుపు తిప్పింది. దీనిని సరైన రీతిలో ఎత్తిపట్టుకున్న ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. తమకు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ప్రధాని నివాసం వద్ద ధర్నాకు దిగడంపై ఇతర ప్రతిపక్ష పార్టీలు కొంత కినుక వహించాయి. వాస్తవానికి ప్రధాని ఇంటి ఎదుట ధర్నా అంశాన్ని అదే రోజు ఉదయం వామపక్ష ఎంపీలు ప్రతిపాదించాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ప్రజాకంఠక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఇలాంటి పొరపొచ్చాలను పక్కనబెట్టాయి.

మొత్తం 21 రోజుల పాటు సమావేశాలు జరిగితే, అందులో 18 రోజులు ప్రతి రోజు ఉదయం సభ ఆరంభానికి ముందు ఇండియా కూటమి ఎంపీలు సమావేశమై వ్యూహరచన చేయడం విశేషం. దీనికి టీఎంసీ ప్రతినిధితో పాటు, శరద్ పవార్ ఎన్‌సీపీ తరఫున సుప్రియా శూలే కూడా నిత్యం హాజరయ్యారు. ప్రతి రోజు సభలోనూ, వెలుపలా సమన్వయంతో వ్యవహరిస్తూ, ప్రతిపక్ష ఎంపీలు ఉమ్మడిగా నిరసనలు చేపట్టడం ద్వారా ఐక్యతను చాటిచెప్పారు.

ఇండియా కూటమికి దూరంగా ఉన్నప్పటికీ ఆప్, డీఎంకేలు విడిగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించాయి. ఈ పరిణామాలు ప్రతిపక్షాన్ని బలహీనపరిచామనుకున్న అధికార పక్షానికి గర్వభంగమైంది. ఈ సమావేశాలలో నీట్‌ పేపర్‌ లీకేజీ, అయోధ్య రామాలయంలో చందా చోరీ, ఈ-పెట్రోల్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సర్వసన్నద్ధమైన ప్రతిపక్షాలకు చివరి వరకు పేపర్‌ లీకేజీ, జంతర్‌మంతర్ నిరసనలపై ప్రశ్నించడంతోనే సరిపోయింది.

అయినప్పటికీ, వ్యూహాత్మకంగా ప్రతిరోజూ చందా చోరీపై పార్లమెంటు ప్రాంగణంలో నిరసన, చిన్నపాటి నాటిక (స్కిట్‌) వేయడం ద్వారా ఆ ఇతర అంశాలను మరుగునపడకుండా చూశాయి. రాజ్యసభలో సీపీఐ(ఎం) జాన్ బ్రిట్టాస్ చర్చలో పాల్గొంటున్న సమయంలో, ఆయనను ఉద్దేశించి బీజేపీ మహిళా ఎంపీ ఒకరు ‘లుంగీవాలా’ అని పదేపదే అవమానపరిచడాన్ని ఖండిస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఒక్కతాటిపై నిలిచారు.

బ్రిట్టాస్‌కు మద్దతుగా సీపీఐ ఎంపీలు సందోష్ కుమార్, పి.పి. సునీర్‌లతో పాటు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం లుంగీ కట్టుకొని సంఘీభావం వ్యక్తం చేశారు. చర్చ సందర్భంగా కమ్యూనిస్టులపై అక్కసుతో కేంద్ర ఆర్థిక మంత్రి వాచాలత్వాన్ని నిరసిస్తూ సందోష్ కుమార్ రాజ్యసభాధిపతికి లేఖ రాశారు.

ఈ సమావేశాలలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అమోఘమైన పాత్రను నిర్వర్తించారు. స్వయంగా ప్రధాని ఇంటి వద్ద ధర్నాలో నేలపై పడుకోవడం, సభలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం వంటివి ప్రజల్లో సానుకూల ముద్ర వేశాయి.

మొత్తమ్మీద పుష్కరకాల మోదీ ప్రభుత్వ అప్రతిహత యాత్రకు తాజాగా ముగిసిన పార్లమెంటు సమావేశాలు బ్రేకులు వేశాయి. సమన్వయ లోపాలను దాటుకొని ‘ఇండియా’ కూటమి పక్షాలు మరింత చేరువయ్యాయి.

ట్యాగ్‌లు: BJP editorial Indian Politics