Skip to content
జాతీయం వార్తలు

Jharkhand Job Scam: రూ.70 లక్షలు తీసుకుని ఇంటర్వ్యూలు ఫిక్స్‌.. జార్ఖండ్‌ JPSC స్కామ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి..

Prajapaksham 13 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Jharkhand Job Scam: రూ.70 లక్షలు తీసుకుని ఇంటర్వ్యూలు ఫిక్స్‌.. జార్ఖండ్‌ JPSC స్కామ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి..

Jharkhand Job Scam

Jharkhand Job Scam: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నియామక పరీక్షలలో జరిగిన భారీ అవకతవకలు, అవినీతి నెట్‌వర్క్‌పై రాష్ట్ర నేర పరిశోధన విభాగం (CID) విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. నియామక అవకతవకలకు నిరసనగా జార్ఖండ్ విద్యార్థులు వారాలుగా రాంచీ వీధుల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తుండటంతో సీఐడీ దర్యాప్తును తీవ్రతరం చేసి, ఇప్పటివరకు 20 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసింది.

ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పరీక్షల నిర్వహణ ఏజెన్సీ (TDPL) మార్కెటింగ్ మేనేజర్ అభయ్ తివారీ సీఐడీ ముందు వాంగ్మూలం ఇస్తూ.. బోర్డుల మార్కింగ్ ఆధారంగా జరిగిన క్రయవిక్రయాల నెట్‌వర్క్‌ను పూర్తిగా బట్టబయలు చేశాడు.

సీఐడీకి అభయ్ తివారీ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. జేపీఎస్సీ పరీక్షల్లో అర్హత పొందేందుకు అభ్యర్థుల నుంచి దశలవారీగా భారీ ఎత్తున లంచాలు వసూలు చేశారు. కేవలం తమకు అనుకూలమైన ఇంటర్వ్యూ బోర్డు సమక్షంలో హాజరై మార్కులు పెంచుకునేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15 లక్షల వరకు దండుకున్నారు. తుది ఎంపిక పూర్తయ్యేసరికి 12, 13వ జేపీఎస్సీ పరీక్షల్లో ఒక్కో పోస్టుకు రూ. 60 లక్షల నుండి రూ. 70 లక్షల వరకు రేటు వసూలు చేసినట్లు వెల్లడైంది.

ఇంటర్వ్యూలకు ఒక రోజు ముందే అభ్యర్థుల రోల్ కోడ్‌లను డీకోడ్ చేసి.. డబ్బులు చెల్లించిన అభ్యర్థులను జేపీఎస్సీ మాజీ ఛైర్మన్ ఎల్. ఖియాంగ్టే లేదా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అజిత భట్టాచార్య బోర్డులకు పంపించేవారని వాంగ్మూలంలో పేర్కొన్నారు.

ఈ అక్రమ మార్గం ద్వారా ఉద్యోగాలు పొందిన పోలీస్ సూపరింటెండెంట్ రాబిన్ కుమార్, డీఎస్పీ శైలేష్ సింగ్, డిప్యూటీ జైలర్ రాజేష్ కుమార్ రజక్ సహా పలువురు అధికారుల పేర్లను నిందితుడు బయటపెట్టాడు. లావాదేవీల సొమ్మును నేరుగా కాకుండా పీఏలు, స్థానిక దళారీలు, కోచింగ్ సెంటర్ నిర్వాహకుల ద్వారా చేరవేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) పరీక్షలకు కూడా ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వసూలు చేసినట్లు వెల్లడైంది.

ఈ కుంభకోణం తీవ్రరూపం దాల్చడంతో జేపీఎస్సీ మాజీ ఛైర్మన్ ఎల్. ఖియాంగ్టేను సీఐడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఆయన అరెస్ట్ అనంతరం తీవ్ర ఒత్తిడికి లోనైన కమిషన్ ముగ్గురు సభ్యులు—డాక్టర్ అజిత భట్టాచార్య, డాక్టర్ అనిమా హన్స్దా, డాక్టర్ జమాల్ అహ్మద్ తమ పదవులకు రాజీనామా చేశారు. సీఐడీ ప్రస్తుతం వీరిని పిలిపించి బ్యాంక్ రికార్డులు, డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా ఆధారంగా తీవ్రస్థాయిలో విచారిస్తోంది.