Jharkhand Paper Leak: డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గం.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
Jharkhand Paper Leak: డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గం.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
జార్ఖండ్‌లో పబ్లిక్ సర్వీసు కమిషన్ సహా ఇతర నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై జరుగుతున్న భారీ ఆందోళనల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. శనివారం వివిధ సంఘాలతో చర్చలు జరిపింది. అయితే, తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు. దీంతో ఈ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.
రాష్ట్ర మంత్రులతో కూడిన ఐదుగురు సభ్యుల ప్రభుత్వ బృందం మొదట జేఎల్‌కేఎం నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో నేతృత్వంలోని ఆందోళనకారుల బృందంతో సమావేశమైంది. ఈ సమస్యపై మహతో చేస్తున్న నిరాహార దీక్ష ఏడవ రోజుకు చేరుకుంది. ఆ తర్వాత వారు కాంగ్రెస్ మద్దతుగల ఎన్‌ఎస్‌యూఐ, ఏసీఎస్, జేసీఎం ప్రతినిధి బృందాలతో సమావేశమయ్యారు.
శుక్రవారం రాత్రి, ప్రభుత్వం జేపీఎస్సీ/జేఎస్‌ఎస్‌సీ సంస్కరణల వేదికకు చెందిన 10 మంది సభ్యుల బృందంతో ఇలాంటి చర్చలే జరిపింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థుల డిమాండ్లు న్యాయమైనవని, వాటిని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దృష్టికి తీసుకెళ్తామని వరుస సమావేశాల అనంతరం ప్రభుత్వ బృందంలో సభ్యుడైన రాష్ట్ర మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు.
పాలక జేఎంఎం విద్యార్థి విభాగమైన ‘జార్ఖండ్ ఛాత్ర మోర్చా’ (జేసీఎం), 14వ జార్ఖండ్ పీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రద్దుతో సహా ఐదు డిమాండ్లను ప్రభుత్వ బృందం ముందు ఉంచింది.
అనుమానాస్పదంగా ఉన్న అన్ని జేపీఎస్సీ, జేఎస్‌ఎస్‌సీ పరీక్షలపై 90 రోజుల్లోగా సీఐడీ విచారణ జరపడం, ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ తరహాలో ‘జార్ఖండ్ టెస్టింగ్ ఏజెన్సీ’ (జేటీఏ)ని ఏర్పాటు చేయడం వంటి ఆరు డిమాండ్లను ఎన్‌ఎస్‌యూఐ ప్రభుత్వం ముందు ఉంచిందని ఆ సంఘం ప్రతినిధి సంజీవ్ షా తెలిపారు.
ఆదివాసీ ఛాత్ర సంఘ్ నాయకుడు కార్తీక్ ఒరాన్ మాట్లాడుతూ, అక్రమాలు జరిగిన పరీక్షలను రద్దు చేయడంతో పాటు, నియామక పరీక్షల్లో గిరిజన, ప్రాంతీయ భాషలను అర్హత పరీక్షలుగా చేర్చాలని తాము డిమాండ్ చేశామన్నారు.
రాష్ట్ర మంత్రి చమ్రా లిండా మాట్లాడుతూ, ‘వివిధ గిరిజన సమూహాల సభ్యులు కూడా ఉన్న విద్యార్థి సంఘాలతో జరిగిన సమావేశం బహుశా ఇదే చివరి సమావేశం కావచ్చు. వారు నియామకాల్లో పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీ, గిరిజన భాషల పరిరక్షణతో సహా మరో రెండు అంశాలను లేవనెత్తారు’ అని చెప్పారు.
ప్రభుత్వ బృందం మొదట మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ, జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థుల వేదికతో సమావేశమైంది. సుమారు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి.
కాగా, ‘మేము లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు త్వరగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, 14వ జేపీఎస్సీ పరీక్ష రద్దుతో సహా మా డిమాండ్లన్నీ నెరవేరే వరకు మా ఆందోళనలు కొనసాగుతాయి’ అని ఆ వేదిక నాయకుడు ఒకరు తెలిపారు.
ఈ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, నియామక ప్రక్రియలో విద్యార్థులు లేవనెత్తిన అక్రమాలు లేదా లోపాలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి దీపికా పాండే సింగ్ తెలిపారు.
నియామక ప్రక్రియలో సంస్కరణల కోసం అభ్యర్థుల నుంచి సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం jpsc.jssc.feedback@gmail.com అనే ఇ-మెయిల్ ఐడిని అందుబాటులోకి తెచ్చిందని ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ చెప్పారు.
ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన 15వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్చలను చేపట్టింది.
14వ జార్ఖండ్ పీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష, అలాగే ఆ సంస్థ నిర్వహించిన అన్ని పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని మహతో పీటీఐతో అన్నారు. విద్యార్థులు రెండు వారాలకు పైగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆయన పేర్కొన్నారు.
‘నా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. రక్తపోటు, చక్కెర స్థాయిలు పడిపోతున్నాయి. ఛాతీలో ఇన్‌ఫెక్షన్ ఉందని డాక్టర్ చెప్పారు, ఆసుపత్రిలో చేరాలని సూచించారు. ఇదే పరిస్థితి కొనసాగితే నాకు ప్రమాదకరం. నేను కేవలం వినగలుగుతున్నాను, ఆలోచించగలుగుతున్నాను, నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నాను’ అని ఆయన తెలిపారు.
ఆరోపిత అక్రమాలపై సీబీఐ లేదా రాష్ట్రం వెలుపలికి చెందిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తుల కమిటీతో స్వతంత్ర విచారణ జరపాలని నిరసనకారులు కోరుతున్నారు.
జేపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేశారు. అలాగే, ఆ సంస్థ మాజీ చైర్మన్ ఎల్. ఖియాంగ్జేను జులై 28 నుంచి నాలుగు సార్లు విచారించారు.