30 ఏళ్లుగా ఎవరెస్ట్ శిఖరంపైనే మృతదేహం.. కుటుంబానికి అప్పగించేందుకు భారత్ యత్నాలు
30 ఏళ్లుగా ఎవరెస్ట్ శిఖరంపైనే మృతదేహం.. కుటుంబానికి అప్పగించేందుకు భారత్ యత్నాలు
భారతదేశానికి చెందిన పర్వతారోహకుడు, ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్)లో పనిచేసిన యోధుడు డోర్జే మోరూప్ (మరణించేనాటికి ఆయన వయస్సు 48) మృతదేహం అవశేషాలు గడచిన 30 సంవత్సరాలుగా ఎవరెస్ట్ శిఖరంపై 8,500 మీటర్ల ఎత్తున మంచుదిబ్బల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఈ మృతదేహం కాళ్లకు ఉన్న ‘గ్రీన్ బూట్స్’ అక్కడకు వెళ్లే పర్వతారోహకులను నిరంతరం ఆకర్షిస్తూనే ఉంటాయి. అందుకే డోర్జే మోరూప్ పేరు ఎవరికీ తెలియకపోయినా, ఆయనను పర్వతారోహకులు “గ్రీన్ బూట్స్”గా గుర్తుపెట్టుకుంటారు. ఆయన అదేవిధంగా ఇప్పటివరకూ ప్రసిద్ధి చెందారు.
పర్వతారోహకులకు మంచులో కూరుకుపోయిన ఆయన మృతదేహం ఒక విషాదకర హెచ్చరికగా ఉంటుంది. మోరూప్ మృతదేహంతోపాటే వంద సంవత్సరాల క్రితం ఎవరెస్ట్ పర్వతారోహకుల రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి వివిధ రకాల ప్రమాదాల్లో మరణించిన దాదాపు 300 మంది పర్వతారోహకుల మృతదేహాలు ఇదేవిధంగా ఎవరెస్ట్ శిఖరంపై వివిధ ప్రాంతాల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఈ మృతదేహాలు ఎవరివో గుర్తించి వెలికితీయడం ఎంతో పెద్ద శ్రమతో కూడిన సాహసకార్యం.
కానీ చాలాకాలానికి గానీ మోరూప్ మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. ఆనాడు ఆయనతోపాటు ఎవరెస్ట్ ఎక్కి సగం దూరం వెళ్లి వెనక్కు తిరిగి వచ్చేసిన ఆయన సహచరులు చెప్పిన సమాచారం, వారు చెప్పిన ప్రదేశం, గుర్తులు, జాడలను బట్టి ఇప్పుడు మోరూప్ మృతదేహాన్ని గుర్తించారు. ఆయన కుటుంబానికి ఆ సమాచారం చేరవేశారు.
ఇప్పుడు ఆయన మృతదేహాన్ని సురక్షితంగా తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన తండ్రి మృతదేహాన్ని విజయవంతంగా కిందకు తీసుకువస్తే లడఖ్‌లోని త్యాగమూర్తుల ఉద్యానవనంలో ఆయనకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని మోరూప్ కుమారుడు పంఛోక్ డోర్జే చెప్పారు.
ఐటీబీపీకి చెందిన భారత సైనికుడు డోర్జే మోరూప్ మాత్రం అందుకు విరుద్ధంగా అత్యంత ప్రమాదకరమైన చైనా ప్రాంతం నుంచి నేపాల్-టిబెట్ మధ్య ఉన్న ఎవరెస్ట్ ప్రాంతాన్ని అధిరోహించి చరిత్ర పుటల్లో నిలిచిపోవాలని, ఒక గొప్ప వీరుడుగా భారత్‌కు తిరిగి వచ్చి ఘనస్వాగతం పొందాలని భావించాడు.
భారత్-చైనా సరిహద్దుల్లో లాన్స్‌నాయక్ హోదాలో ఐటీబీపీ తరఫున కాపలా కాసే డోర్జే మోరూప్‌కు పర్వతారోహణ ఎప్పుడూ కొత్త విషయం కాదు. తన భార్యకు కూడా ఆయన అదే విషయం చెప్పారు. ఆ విధంగా ఆయన 1996లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఆయన ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించినట్లు చైనా ప్రభుత్వం నుంచి కూడా విజయచిహ్నంగా ఒక సర్టిఫికెట్ వచ్చింది. కానీ ఆయన మాత్రం తిరిగి కిందకు చేరుకోలేదు.
మోరూప్‌తోపాటు మొత్తం ఆరుగురు పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఆనాడు అధిరోహించారు. వీరిలో ముగ్గురు తీవ్రమైన ప్రతికూల వాతావరణం మధ్య వెనుదిరిగి వచ్చేశారు. కానీ మోరూప్‌తోపాటు మిగిలిన ముగ్గురు త్సేవాంగ్ స్మాన్లా, త్సేవాంగ్ షాల్టోర్ మాత్రం 8,849 మీటర్ల ఎత్తు వరకూ ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించారు.
1996 మే నెల 10వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు డోర్జే ఎవరెస్ట్ శిఖరానికి చేరుకుని కీర్తి పొందారు. తిరుగు ప్రయాణ సమయంలో కిందికి దిగుతున్నప్పుడు దురదృష్టవశాత్తూ హిమపాతం వారిపై విరుచుకుపడింది. వారు ముగ్గురూ ఆ మంచులోనే సమాధి అయిపోయారు. వారి మృతదేహాలు మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూరుకుపోయాయి. సురక్షితంగా అక్కడే ఉండిపోయాయి.
కానీ డోర్జే కాళ్లు మాత్రం మంచులోంచి బయటకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన కాలికి తగిలించుకున్న గ్రీన్ బూట్స్ అటుగా వెళ్లే పర్వతారోహకులకు ఒక విషాద హెచ్చరికగా కనిపిస్తాయి. కానీ ఆ మృతదేహం ఎవరిదో తెలియదు. చివరకు ఆ మృతదేహం డోర్జేదే అని ఇప్పుడు గుర్తించారు.
తాను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తప్పకుండా తిరిగి వస్తానని, విమానాశ్రయానికి వచ్చి తనకు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని తన భార్య యాంగ్‌స్కట్‌కు డోర్జే చెప్పివెళ్లారు. అందువల్ల తన భర్త మరణించలేదని యాంగ్‌స్కట్ ఇప్పటివరకూ వాదిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆయన మరణవార్త, మృతదేహాన్ని గుర్తించిన వార్త వారి కుటుంబానికి చేరుకుంది.