హైదరాబాద్‌లో పది లక్షల మంది ఓటర్లు గల్లంతు..సీఈసీ స్పందన ఇదే..
Voter List
అధికారుల ప్రకారం, ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. “10 లక్షల పేర్లు శాశ్వతంగా తొలగించబడ్డాయి” అనే వాదనకు అధికారిక ధృవీకరణ లేదు. తుది ఓటర్ల జాబితా విడుదలకు ముందు అభ్యంతరాలు, దరఖాస్తులు, ధృవీకరణ ప్రక్రియ కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎన్యూమరేషన్) ప్రక్రియలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో నమోదైన మొత్తం 47,36,669 మంది ఓటర్లలో దాదాపు 9,95,315 మంది (సుమారు 21 శాతం) ఆచూకీ అధికారులకు లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో కొందరు మరణించి ఉండవచ్చని.. మరికొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం లేదా స్వగ్రామాలకు తిరిగి వెళ్లి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతులను మినహాయించి మిగిలిన వారిని ప్రస్తుతం ఆచూకీ తెలియని ఓటర్లు జాబితాలో చేర్చారు.
అధికారుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 88,933 మంది ఆచూకీ లేని ఓటర్లు ఉన్నారు. ఇక అంబర్‌పేటలో అత్యల్పంగా 38,208 మంది ఉన్నారు. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉండటంతో తుది గణాంకాల్లో కొంత మార్పు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నప్పటికీ.. రాజకీయ పార్టీల సహకారం కోరుతున్నప్పటికీ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు 27,26,655 మంది (57.56 శాతం) మాత్రమే తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించగా.. వారి వివరాలను డిజిటలైజ్ చేశారు. అలాగే 4,91,236 మంది (10.37 శాతం ఓటర్లు ఆన్లైన్ ద్వారా ఫారాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గడువును రెండుసార్లు పొడిగించిన నేపథ్యంలో ఇకపై పెద్ద సంఖ్యలో కొత్త దరఖాస్తులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాల ప్రకారం రాజకీయ నాయకుల ఇళ్లు, మతపరమైన ప్రదేశాలు, ఇతర సున్నిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉండకూడదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 94 భవనాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఇతర అనుకూల ప్రాంతాలకు మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అదే సమయంలో నిబంధనల ప్రకారం 39 పోలింగ్ కేంద్రాల నామకరణంలో మార్పులు.. ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న 71 కేంద్రాలను విలీనం లేదా రద్దు చేయడం, ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 4 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలను ప్రతిపాదించారు. ఈ పునర్వ్యవస్థీకరణతో ప్రస్తుతం ఉన్న 4,062 పోలింగ్ కేంద్రాల సంఖ్య 3,995కు తగ్గనుంది. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయ్యాక తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
- హైదరాబాద్‌లో పది లక్షల మంది ఓటర్లు గల్లంతు..సీఈసీ స్పందన ఇదే..
- ఎండలను తట్టుకునేందుకు కుక్క మాంసం సూప్ తాగండి.. ప్రజలకు ఉత్తర కొరియా సంచలన సూచన..
- చిరంజీవికి కూటమి ప్రభుత్వం మెగా ఆఫర్ ఇచ్చినట్లేనా.. తమ్ముడి బాటలోకే అన్న కూడా వస్తున్నారా..
- నీళ్లు బదులు డేటాని తాగాలా.. వైజాగ్ గూగుల్ డేటా సెంటర్‌పై కోర్టులో కేసు.. ఎవరేశారంటే..
- బంగారం ధర 37% పడిపోతుందా..? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక చెబుతున్న సంచలన విషయాలు ఇవే…