Skip to content
ప్రపంచం వార్తలు

ఎండలను తట్టుకునేందుకు కుక్క మాంసం సూప్ తాగండి.. ప్రజలకు ఉత్తర కొరియా సంచలన సూచన..

Prajapaksham 06 Aug 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
ఎండలను తట్టుకునేందుకు కుక్క మాంసం సూప్ తాగండి.. ప్రజలకు ఉత్తర కొరియా సంచలన సూచన..

Kim zong and Dogs

ఉత్తర కొరియాలో వేసవి తీవ్రతను తట్టుకునేందుకు కుక్క మాంసంతో తయారుచేసే సంప్రదాయ సూప్ బోషింటాంగ్ తీసుకోవాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. స్థానికంగా ఈ సూప్ శరీరానికి శక్తినిస్తుందని, వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుందని కొందరు విశ్వసిస్తున్నారు. అయితే, ఈ ఆరోగ్య ప్రయోజనాలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.జంతు హక్కుల సంస్థలు ఈ ఆచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. దక్షిణ కొరియా వంటి దేశాల్లో కుక్క మాంసం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర కొరియాలో మాత్రం ఈ సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోందని నివేదికలు చెబుతున్నాయి.

కొరియా ద్వీపకల్పాన్ని గత కొద్ది రోజులుగా సూర్యుడు దహించి వేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 40°C దాటి నమోదు అవుతున్నాయి. ఇక రాత్రివేళల్లో కూడా ఉష్ణోగ్రతలు 25°C కంటే ఎక్కువగా ఉంటూ ఉష్ణమండల రాత్రులుగా మారడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తీవ్రమైన వడగాలులను, వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేడిని తట్టుకోవడానికి, వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి పౌరులు అసాధారణమైన కుక్క మాంసం సూప్ తీసుకోవాలని ఉత్తర కొరియా అధికారిక ప్రభుత్వ మీడియా బహిరంగంగా సూచించింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాలోని అధికారిక వర్కర్స్ పార్టీకి చెందిన ప్రముఖ వార్తాపత్రిక రోడాంగ్ సిన్మున్ ఆదివారం నాటి తన సంచికలో వేసవి వడగాలుల ఎదుర్కొనేందుకు కొన్ని ప్రత్యేక ఆరోగ్య మార్గదర్శకాలను ప్రచురించింది. తీవ్రమైన వేడి వాతావరణం వల్ల మానవ శరీరంలో కలిగే ఉష్ణ ఒత్తిడి, అలసట నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల జాబితాను అందులో పేర్కొంది.

ప్యాంగ్‌యాంగ్ జనరల్ ఆసుపత్రికి చెందిన ఒక సీనియర్ వైద్యాధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. వేసవిలో అధిక వేడి, ఉష్ణమండల రాత్రుల కారణంగా మనుషుల్లో హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, బిపి, హైపర్ థైరాయిడిజం వంటి దీర్ఘకాలిక సమస్యలు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రథమ చికిత్స చర్యలలో భాగంగా శరీరానికి అధిక శక్తినందించే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని పత్రిక పేర్కొంది.

ఈ క్రమంలో చల్లదనాన్నిచ్చే.. పుచ్చకాయ, పెసలు, దోసకాయల వంటి సాంప్రదాయ ఉత్పత్తులతో పాటు అత్యంత అధిక పోషక విలువలు ఉన్న ఆహారం అంటూ కుక్క మాంసం సూప్, చేపల గంజి, బీన్స్ గంజిలను ప్రతిఒక్కరూ ఆహారంలో భాగం చేసుకోవాలని సిఫార్సు చేసింది.

ఉత్తర కొరియా సంస్కృతిలో కుక్క మాంసంతో చేసే ఈ ప్రత్యేకమైన సూప్‌ను డాంగోగి గుక్ అని పిలుస్తారు. దీనిని అక్కడ అత్యంత శ్రేష్ఠమైన, సంప్రదాయబద్ధమైన వంటకంగా భావిస్తారు. ఉత్తర కొరియా మాజీ దౌత్యవేత్త రి చోల్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్యాంగ్‌యాంగ్‌లో డాంగోగి చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇది సాధారణ పౌరులకు అందుబాటులో లేనంత ఖరీదైన ఆహారంగా ఉంటుంది. కేవలం సమాజంలోని ఎగువ వర్గాలు, ప్రభుత్వ ప్రముఖులు మాత్రమే దీనిని తరచుగా భుజించగలుగుతారు.

కొరియన్ పురాతన విశ్వాసాల ప్రకారం.. తీవ్రమైన వేసవి రోజుల్లో కుక్క మాంసం తినడం వల్ల శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రత సమతుల్యమై, అలసట, వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రభుత్వం దీనిని ప్రతి వేసవిలోనూ విశేషంగా ప్రచారం చేస్తుంటుంది. ప్యాంగ్‌యాంగ్ యంత్రాంగం దశాబ్దాలుగా ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. రాజధాని నగరంలో కేవలం కుక్క మాంసంతో రకరకాల డిష్‌లు తయారు చేసే ప్రత్యేక రెస్టారెంట్లను సైతం నిర్వహించడంతో పాటు, ఏటా జాతీయ స్థాయిలో వంటల పోటీలను కూడా నిర్వహిస్తుంటుంది.

రెండు కొరియా దేశాల వైఖరిలో ఆకాశమంత తేడా: ఒకే ద్వీపకల్పంలో ఉన్నప్పటికీ.. కుక్క మాంసం వినియోగంపై ఉత్తర కొరియా – దక్షిణ కొరియాల విధానాలు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం.

  1. ఉత్తర కొరియా: తమ ప్రాచీన సంస్కృతిలో భాగమని చెబుతూ, కుక్క మాంసం వినియోగాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయంగా జంతు సంక్షేమ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్యాంగ్‌యాంగ్ సర్కార్ అస్సలు పట్టించుకోవడం లేదు.
  2. దక్షిణ కొరియా: దక్షిణ కొరియా మాత్రం దీనికి భిన్నంగా చారిత్రాత్మక అడుగు వేసింది. మానవ వినియోగం కోసం కుక్కలను పెంచడం, వధించడం, విక్రయించడం, పంపిణీ చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ దక్షిణ కొరియా పార్లమెంట్ చట్టం ఆమోదించింది. ఈ చట్టం మూడేళ్ల పరివర్తన వ్యవధి ముగిసిన తర్వాత ఫిబ్రవరి 2027 నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఈ గడువు ముగిసిన తర్వాత ఎవరైనా కుక్క మాంసం విక్రయిస్తే వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా 30 మిలియన్ల దక్షిణ కొరియన్ వాన్ల వరకు జరిమానా విధించబడుతుంది.

మరోవైపు కొరియా ప్రాంతంలో వేసవి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. జూలై చివరి వారం నుండి ప్యాంగ్‌యాంగ్‌తో పాటు ప్రధాన నగరాల్లో రాత్రివేళల్లో కూడా ఉష్ణోగ్రతలు 25°C కన్నా తగ్గకపోవడంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సాపేక్ష ఆర్ద్రత (Humidity) 70 శాతానికి పైగా నమోదవుతుండటంతో కాసేపు బయట తిరిగినా తీవ్రంగా చెమటలు పట్టి, డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు.

దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 33°C నుండి 35°C, కొన్ని ప్రాంతాల్లో 40°C కి చేరుకోవడంతో కొరియన్ సెంట్రల్ బ్రాడ్‌కాస్టింగ్ స్టేషన్.. తీవ్రమైన వేడి హెచ్చరికను జారీ చేసింది. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, తగినన్ని నీళ్లు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.