రంగనాథ్ ఎందుకు టార్గెట్ అయ్యారు.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల వెనుక ఏం జరిగింది?
Telangana High Court and AV Ranganath
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఇటీవలి కాలంలో న్యాయ, రాజకీయ చర్చల కేంద్రంగా మారారు. తెలంగాణ హైకోర్టు పలు కేసుల్లో కోర్టు ఆదేశాల అమలు, కూల్చివేతల విధానం, అధికారుల అఫిడవిట్ల నాణ్యత వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
తెలంగాణలో అక్రమ ఆక్రమణల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చుట్టూ తీవ్ర వివాదం ముదురుతోంది. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను ఆ పదవి నుండి తక్షణమే తప్పించి.. ఆయన స్థానంలో మరొక సమర్థుడైన అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సంచలన ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను పదేపదే ఉల్లంఘించడమే కాకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న కారణంతో ధర్మాసనం ఈ ఘాటు నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంట సర్వే నంబర్లు 1, 2 పరిధిలో ఉన్న సుమారు 40 ఎకరాల వివాదాస్పద భూమి చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది. ఈ స్థలంలోకి హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా ప్రవేశించి యంత్రాలతో ఫెన్సింగ్ వేస్తున్నారంటూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, సదరు భూముల్లోకి హైడ్రా అధికారులు వెళ్లకూడదని గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు మళ్లీ ఆ భూముల్లోకి వెళ్లారన్న ఆరోపణలతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. గతంలో రంగనాథ్‌ను స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా న్యాయవ్యవస్థ ఆదేశాలను ధిక్కరిస్తూ వ్యవహరిస్తే హైడ్రా కమిషనర్‌తో పాటు అధికారులను ఆర్మీ కస్టడీకి అప్పగించి బ్యారక్స్‌లో ఉంచడానికి వెనుకాడబోమని.. అవసరమైతే ఆర్మీ బలగాలను రంగంలోకి దించుతామని కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఒక ఐపీఎస్ అధికారి స్థాయి వ్యక్తిపై న్యాయస్థానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
లోతుకుంట కేసే కాకుండా, విభిన్న వ్యవహారాల్లో రంగనాథ్‌పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడం పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రంగనాథ్ కోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేసి, తాము ఎలాంటి ఉల్లంఘనలు చేయలేదని.. పిటిషనర్లు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన సమర్పించిన అఫిడవిట్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం, చట్టాన్ని గౌరవించని అధికారి హైడ్రా లాంటి కీలక సంస్థకు నాయకత్వం వహించడానికి తగడని స్పష్టం చేస్తూ ఆయనను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఆదేశించింది.
హైకోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలు హైడ్రా భవిష్యత్తు కార్యకలాపాలపై, రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు భూమాఫియా నిజాలను మరుగున పరిచి కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని.. రాజ్యాంగ బద్ధంగా, పారదర్శకంగానే పనిచేస్తున్నానని రంగనాథ్ పేర్కొనగా.. ప్రభుత్వం ఈ తీర్పుపై ఎలా స్పందిస్తుంది.. కొత్త కమిషనర్‌గా ఎవరిని నియమిస్తుంది అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
- Erravalli Lands: ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సర్వే నంబర్ 325లో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణానికి ఆదేశం..
- Bathukamma Celebrations 2026: బతుకమ్మ పండుగ తేదీలు.. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 వరకు 9 రోజులు పాటు ఉత్సవాలు.. ఏ రోజు ఏ పేరుతో పిలుస్తారంటే..
- Telangana ACB Bribe Cases: అవినీతి సొమ్ముతో ఏసీబీకి అడ్డంగా దొరుకుతున్న అధికారులు.. రూ.4 లక్షల లంచంతో GHMC అధికారి, రూ.1 లక్ష కేసులో DMHO అరెస్ట్..
- Who is Neha Bora? ఎవరీ నేహా బోరా..? జంతర్ మంతర్ ఆందోళనల్లో మెరిసిన ధిక్కార స్వరం.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి?
- Dussehra 2026: దసరా తొలి రోజు అమ్మవారి అవతారం.. శైలపుత్రి దేవి వెనుక కథ ఇదే..