Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ఆర్‌బిఐ ఉపశమన చర్యలు.. కనిపించని పరిష్కారాలు..

Prajapaksham 06 Aug 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఆర్‌బిఐ ఉపశమన చర్యలు.. కనిపించని పరిష్కారాలు..

RBI

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) దేశ ఆర్థిక పరిస్థితులపై తీసుకుంటు న్న చర్యలు ఉపశమన తప్ప, పరిష్కారం దిశగా దారి చూప లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆర్‌బిఐ నేతృత్వంలోని ద్రవ్య విధా న కమిటీ రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడం కూడా అలాంటిదే. నిజానికి ఈ నిర్ణయం ఆర్థిక రంగంలో పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, దేశీయ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, వాతావరణ మార్పుల ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం వడ్డీ రేట్లలో మార్పులు చేయకుండా స్థిరత్వాన్ని కొనసాగించడం సమంజసమైన నిర్ణయమే. ఈ నిర్ణయం బ్యాంకింగ్‌ వ్యవస్థకు కొంత భరోసా కల్పిస్తుంది. పరిశ్రమలకు, వ్యాపార వర్గాలకు, గృహ రుణాలు తీసుకున్న వారికి ముందస్తు ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఇస్తుంది. పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని కొంత మేర తగ్గిస్తుంది. అయితే దీనిని దేశ ఆర్థిక సమస్యలకు సమగ్ర పరిష్కారంగా చిత్రీకరించడం సరైంది కాదు. ఇది ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే. దేశం ఎదుర్కొంటున్న పేదరికం, నిరుద్యోగం, ఆదా య అసమానతలు, ద్రవ్యోల్బణం వంటి లోతైన సమస్యలకు ఇది ఒక్కటే సమాధానం కాదు. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులు రిజర్వు బ్యాంకు నుంచి స్వల్పకాలిక రుణాలు పొందే సమయంలో చెల్లించే వడ్డీ. ఈ రేటు తగ్గితే బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయం తగ్గుతుంది. ఫలితంగా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు మరింత పెట్టుబడులు పెడతాయ ని, ప్రజలు వినియోగాన్ని పెంచుతారని, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని ద్రవ్య విధాన సిద్ధాంతం చెబుతుంది. అదే రేటు పెరిగితే రుణాల వ్య యం పెరిగి డిమాండ్‌ తగ్గుతుందని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని భావిస్తారు. ఈ సిద్ధాంతం పాఠ్యపుస్తకాలలో సులభంగా కనిపించినా, వాస్తవ జీవితంలో పరిస్థితులు అంత సరళంగా ఉండవు. మన దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే ద్రవ్యోల్బణానికి కారణం ఎప్పుడూ అధిక వినియోగం కాదు. తరచూ సరఫరా వ్యవస్థలో లోపాలు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం, ప్రకృతి వైపరీత్యాలు, నిల్వల సమస్యలు, రవాణా వ్యయాల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, యుద్ధాలు, దిగుమతుల వ్యయం పెరగడం వంటి అంశాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలవుతుంటాయి. ట మాటా ధరలు పెరిగినప్పుడు రెపో రేటు పెంచినా రైతు పొలంలో దిగుబడి పెరగదు. వరదల కారణంగా కూరగాయల సరఫరా తగ్గితే వడ్డీ రేటు పెంపు మార్కెట్‌లో సరుకును పెంచదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే రవాణా వ్యయం పెరిగి ప్రతి వస్తువు ధరపై ప్రభావం పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ద్రవ్య విధానం ప్రభావం పరిమితంగానే ఉంటుంది.
ఇటీవలి సంవత్సరాలలో వాతావరణ మార్పులు ఆర్థిక వ్యవస్థలపై చూపుతున్న ప్రభావం మరింత తీవ్రమవుతోంది. ప్రపంచ వాతావరణ సంస్థలు, వాతావరణ శాస్త్రవేత్తలు ఎల్‌ నినో పరిస్థితుల గురించి వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎల్‌ నినో ప్రభావం సాధారణ వాతావరణ చక్రాన్ని దెబ్బతీసి అనే దేశాలలో వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. భారతదేశంలో నైరుతి రుతుపవనాల బలహీనత, కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం, మరికొన్ని ప్రాంతాల్లో అతివృష్టి సంభవించే అవకాశాలు పెరుగుతాయి. దాని ప్రత్య ప్రభావం ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల ఉత్పత్తిపై పడుతుంది. ఉత్పత్తి తగ్గితే మార్కెట్‌లో సరఫరా తగ్గుతుంది. సరఫరా తగ్గితే ధరలు పెరుగుతాయి. ఈ పరిస్థితూల్లోనే కేవలం రెపో రేటు ద్వారా నియంత్రించడం అసాధ్యం. ఈ పరిస్థిల్లోనే పేదరిక నిర్మూలన కూడా ఆర్‌బిఐ నుంచి ఒక స్పష్టమైన, సమగ్ర దృష్టికోణాన్ని కోరుకుంటుంది. వడ్డీ రేటు తగ్గిందని మాత్రమే ఒక పేద కుటుంబం జీవితం మారదు. ఆ కుటుంబానికి స్థిరమైన ఆదాయం ఉండాలి. పిల్లలకు నాణ్యమైన విద్య అందాలి. అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుల్లో కూరుకుపోకుండా ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండాలి. వ్యవసాయం లేదా చిన్న వ్యాపారానికి మార్కెట్‌ ఉండాలి. మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగాలి. యువతకు నైపుణ్య శిక్షణ లభించాలి. ఈ అంశాలు లే బ్యాంకు రుణాలు చౌకగా లభించినా పేదరికం తగ్గదు. ఇంకో వాస్తవా కూడా గుర్తించాలి. బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రయోజనాలు అందరికీ సమానం అందడం లేదు. పెద్ద కంపెనీలు, పట్టణ మధ్యతరగతి, స్థిరమైన ఆదాయం ఉన్నవారు బ్యాంకు రుణాలను సులభంగా పొందగలుగుతున్నారు. కానీ చిన్న రైతు, చిరు వ్యాపారి, అసంఘటిత రంగ కార్మికుడు, వీధి వ్యాపారి ఇప్పటికీ సాంప్రదాయిక రుణదాతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ వర్గాలకు రెపో రేటు తగ్గినా ప్రత్యక్ష ప్రయోజనం పరిమితంగానే ఉంటుంది. ఆర్థిక సమ్మిళిత అభివృద్ధి అంటే బ్యాంకింగ్‌ సేవలు చివరి వ్యక్తికి చేరినప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి నేటి అవసరం తాత్కాలిక నిర్ణయాల కంటే దీర్ఘకాలిక దృష్టి. ధరలు అదుపులో ఉండాలి. అదే సమయంలో ఉత్పత్తి పెరగాలి. పెట్టుబడులు రావాలి. ఉపాధి విస్తరించాలి. వ్యవసాయం లాభసాటిగా మారాలి. దేశీయ పరిశ్రమలు ప్రపంచ పోటీలో నిలవాలి. ఇంధన స్వావలంబన పెరగాలి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు అధికం కావాలి. ప్రజల కొనుగోలు శక్తి బలోపేతం కావాలి. ఇవన్నీ సమన్వయంతో ముందుకు సాగినప్పుడే దేశం భవిష్యత్తు ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగలదు. స్థూలంగా చెప్పాలంటే, వడ్డీ రేట్లు ఆర్థిక విధానానికి దిశానిర్దేశం చేయగలవు. కానీ దేశ భవిష్యత్తును నిర్మించలేవు. దూరదృష్టితో కూడిన పాలన, ఉత్పాదక పెట్టుబడులు, శాస్త్రీయ వ్యవసాయం, బలమైన పారిశ్రామికీకరణ, నాణ్యమైన విద్య, సమర్థవంతమైన ఆరోగ్య వ్యవస్థ, క్రమశిక్షణతో కూడిన ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వంటి అంశాలే దేశాన్ని సరైన దిశగా నడిపిస్తాయి. రెపో రేటు ఒక సాధనం మాత్రమే. సమగ్ర ఆర్థికాభివృద్ధికి అది ప్రారంభం కావచ్చు. కానీ గమ్యం మాత్రం కాదు.