ఇంట్లో వెలిగించే అగరుబత్తుల పొగ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా?
ఇంట్లో వెలిగించే అగరుబత్తుల పొగ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా?
ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి ఒక కొత్త విషయం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. సిగరెట్ తాగని, పొగాకు ఉత్పత్తులు వాడని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం, ఇంట్లో ఎక్కువసేపు దోమల కాయిల్స్ వాడటం, ఇతరులు తాగే పొగను (సెకండ్‌హ్యాండ్ స్మోక్) పీల్చడం, జన్యుపరమైన కారణాలతో పాటు అగరుబత్తుల పొగ కూడా ప్రమాదాన్ని పెంచే అంశాల్లో ఒకటిగా గుర్తిస్తున్నారు. ఈ కారణాలకు గురైన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని కాదు. కానీ ఇలాంటి పొగను ఎక్కువ కాలం, తరచూ పీల్చడం వల్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అగరుబత్తుల పొగ ఎందుకు ప్రమాదకరం?
యశోద మెడిసిటీ ఆస్పత్రి మెడికల్ ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ అభిషేక్ యాదవ్ మాట్లాడుతూ, ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయని చెప్పారు. దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యమే అయినప్పటికీ, అగరుబత్తుల పొగ కూడా ఒక ప్రమాద కారకంగా మారుతోందని వివరించారు.
అగరుబత్తుల తయారీలో పలు రకాల రసాయనాలు ఉపయోగిస్తారని ఆయన తెలిపారు. వాటిని వెలిగించినప్పుడు విడుదలయ్యే పొగను మనం పీల్చడం వల్ల ఆ రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. ఈ పొగకు తరచూ, ఎక్కువసేపు గురికావడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగవచ్చని చెప్పారు. అందుకే అగరుబత్తులను అవసరానికి మించి ఉపయోగించకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. వీలైతే నెయ్యి దీపాలు, కర్పూరం లేదా సుగంధ తైలాలు వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చని తెలిపారు. ఇవి హానికరమైన పొగను తక్కువగా విడుదల చేస్తాయి.
ఈ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయొద్దు
ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో ప్రధాన సమస్య ఏమిటంటే, తొలి లక్షణాలను చాలామంది సాధారణ జలుబు లేదా అలర్జీగా భావించి నిర్లక్ష్యం చేస్తారని డాక్టర్ అభిషేక్ యాదవ్ చెప్పారు. మూడు వారాలకుపైగా దగ్గు కొనసాగినా, దగ్గులో రక్తం వచ్చినా, తరచూ ఆయాసం వచ్చినా, కారణం లేకుండా బరువు తగ్గినా లేదా ఛాతీలో నొప్పి నిరంతరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఎక్కువ రోజులు దగ్గు ఉంటే పరీక్షలు చేయించుకోండి
కొంతమంది నెలల తరబడి దగ్గు ఉన్నా దానిని క్షయ (టీబీ) లేదా అలర్జీ అనుకుని నిర్లక్ష్యం చేస్తారని డాక్టర్ అభిషేక్ తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఊహాగానాలపై ఆధారపడకుండా సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమన్నారు. అవసరమైతే వైద్యుల సలహాతో ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయించుకోవాలని ఆయన సూచించారు. ముందుగానే వ్యాధిని గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.