Skip to content
క్రైమ్ వార్తలు

7 రోజుల్లో డబ్బు రెట్టింపు అంటూ రూ.95 లక్షల టోకరా…ఇన్‌స్టాగ్రామ్ పెట్టుబడి పేరుతో మోసం..

Prajapaksham 03 Aug 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
7 రోజుల్లో డబ్బు రెట్టింపు అంటూ రూ.95 లక్షల టోకరా…ఇన్‌స్టాగ్రామ్ పెట్టుబడి పేరుతో మోసం..

7 రోజుల్లో డబ్బు రెట్టింపు అంటూ రూ.95 లక్షల టోకరా...ఇన్‌స్టాగ్రామ్ పెట్టుబడి పేరుతో మోసం..

ముగ్గురిపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు

ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో పెట్టుబడిపై భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించి పలువురి నుంచి దాదాపు రూ.95 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో సీసీఎస్ డిటెక్టివ్ విభాగం ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

రాజేంద్రనగర్‌కు చెందిన రవి పంతగాని ఫిర్యాదు మేరకు.. 2025 సెప్టెంబరులో ఇన్‌స్టాగ్రామ్‌లోని పలు పేర్లతో ఉన్న ఖాతాల ద్వారా స్వల్పకాలిక పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. రూ.5,500 పెట్టుబడికి రూ.5,000, రూ.10 వేల పెట్టుబడికి రూ.9,500, రూ.20 వేల పెట్టుబడికి రూ.22 వేల వరకు లాభం ఇస్తామని నమ్మించారు.

ఈ ప్రచారాన్ని నమ్మిన బాధితుడు బతూల్ ఫాతిమాను సంప్రదించగా, అత్తాపూర్‌లోని డి కేఫ్ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసి, అలీ జాన్ రజ్వీతో కలిసి షేర్లలో పెట్టుబడి పెట్టి రెండు వారాల్లో రూ.10 లక్షలకు బదులుగా రూ.18 లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం ‘ఇన్వెస్ట్‌మెంట్ డిస్కషన్స్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసి, బాధితుడి నుంచి విడతల వారీగా రూ.10 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు.

నిర్దేశిత గడువు ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో మరో ఒప్పందం చేసుకుని, భద్రతగా ఐదు సంతకం చేసిన చెక్కులు ఇచ్చారని, అయినప్పటికీ డబ్బు తిరిగి ఇవ్వకుండా నిందితులు పరారయ్యారని బాధితుడు ఆరోపించాడు.

విచారణలో ఇదే తరహాలో సయ్యద్ ఆసిఫ్ పాషా, సయ్యద్ షాబాజ్, సయ్యద్ అఫ్రోజ్, మహ్మద్ యూసుఫుద్దీన్, సయ్యద్ సర్ఫరాజ్, ఎండి అజర్ ఉద్దీన్, బీబీ అష్రఫ్ తదితరులతో పాటు మరికొందరి నుంచి కూడా మొత్తంగా రూ.90 నుంచి రూ.95 లక్షల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు తెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు ఆధారంగా బతూల్ ఫాతిమా, జకియా ఫాతిమా, అలీ జాన్ రజ్వీలపై సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ టి. అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు: Crime financial crime