Skip to content
తెలంగాణ వార్తలు

జానపద కళలకు జీవం పోద్దాం… తెలంగాణ వారసత్వాన్ని పరిరక్షిద్దాం

Prajapaksham 01 Aug 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
జానపద కళలకు జీవం పోద్దాం… తెలంగాణ వారసత్వాన్ని పరిరక్షిద్దాం

folk arts

నాగులపల్లి వెంకటేశ్వరరావు ( మీడియా ఆఫ్ తెలంగాణ సెక్రటరీ)

కళాకారుడు బతికితేనే కళ బతుకుతుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాష, జీవనవిధానం, చరిత్రను భావితరాలకు అందించిన గొప్పవారసత్వ సంపద జానపదకళలు. ఇవి కేవలం వినోద సాధనాలు మాత్రమే కాదు. ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే శక్తివంతమైన సమాచార మాధ్యమాలు. ఒకప్పుడు గ్రామీణ సమాజ జీవనంలో విడదీయరాని భాగం గా ఉన్న ఈ కళారూపాలు నేడు ఆధునిక జీవనశైలి ప్రభావంతో కనుమరుగయ్యే ప్రమాదంలోఉన్నాయి.
తెలంగాణ అనగానే ఒగ్గుకథ, బుర్రకథ, హరికథ, పల్లెసుద్దులు, వీధినాటకం, చిందు యక్షగానం, గుస్సాడినృత్యం, పేరిణి శివ తాండవం, డప్పు, కోలాటం, గంగిరెద్దుల ఆట, లంబాడీ నృత్యం, బతుకమ్మ జానపద గీతాలు వంటి అనేక కళారూపాలు గుర్తుకువస్తాయి. ఇవి తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సాంస్కృతిక సంపద. తెలంగాణ ఉద్యమ చరిత్రలో జానపద కళారూపాల పాత్ర అపూర్వమైనది. తొలి దశ నుంచి మలిదశ ఉద్యమం వరకు ఒగ్గుకథ, బుర్రకథ, పల్లెసుద్దులు, వీధినాటకాలు, జానపద గీతాలు ఉద్యమానికి ఊపిరిగా నిలిచాయి. గ్రామగ్రామాన తిరుగుతూ కళాకారులు తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో నింపారు. సభలకు ముందు నిర్వహించిన జానపద ప్రదర్శనలు ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేశాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో జానపద
కళాకారుల సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మన జానపద కళలను దేశం కూడా గుర్తించింది. కిన్నెర కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్య, యక్షగానం కళాకారుడు పద్మశ్రీ గడ్డంసమ్మయ్య, జానపద సంగీత విద్వాంసుడు పద్మశ్రీ దాసరికొండప్ప, సంప్రదాయ కళాకారిణి పద్మశ్రీ దళిపర్తి ఉమామహేశ్వరి వంటి ప్రముఖులకు భారత ప్రభు త్వం పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేసింది. ఇది తెలంగాణ జానపద కళల గొప్పతనానికినిదర్శనం. అయితే, ఒగ్గు కథలో మహోన్నత స్థానం సంపాదించిన మిద్దె రాములు గారిని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ఆయనకు ప్రతిభాపురస్కారం, రాజీవ్‌ పురస్కారం, హంస అవార్డు వంటి అనేక గౌరవాలు లభించాయి. వాస్తవానికి ఒగ్గు కథకు విశిష్ట సేవలందించిన మరో మహానుభావుడు చుక్క సత్తయ్య 2004లో భారత రాష్ట్రపతి డాక్టర్‌ ఏ.పి.జె. అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ ఇద్దరు మహానుభావుల సేవలు తెలంగాణ జానపద కళలకు దేశవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చాయి. హైదరాబాద్‌లోని శిల్పారామంలో పేరిణి వంటి కొన్ని కళారూపాలకు సందర్భానుసారంగా ప్రదర్శనల అవకాశాలు కల్పించడం అభినందనీయం. అయితే, ఇది ఒక్క శిల్పారామానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జానపద కళారూపాలకు నిరంతర అవకాశాలు కల్పించే విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి.
నేను 2010 నుండి 2013 వరకు ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో ఉపసంచాలకుడు (ఐఇసి)గా పనిచేసిన సమయంలో ప్రతి సంవత్సరం సుమారు రూ.1 కోటిబడ్జెట్‌ను పల్లెసుద్దులు, హరికథ, వీధి నాట కం వంటి జానపద కళారూపాల ద్వారానే హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రమాల కు వినియోగించాం. గ్రామా ల్లో ప్రజలు వ్యవసాయపనులు ముగించుకుని విశ్రాంతిగా ఉన్న సమయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. ఆ అవగాహన కార్యక్రమాల కారణం గా రెండు సంవత్సరాలలో హెచ్‌.ఐ. వి. వ్యాప్తి తగ్గింది. స్థానిక భాషలో, స్థానిక కళారూపాల ద్వారా అందించిన సందేశాన్ని ప్రజలు సులభంగా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు కళాకారులకు ఉపాధి కూడా లభించింది. ఒకే కార్యక్రమంతో ప్రజా చైతన్యం, ప్రభుత్వ ప్రచారం, కళాకారులకు జీవనాధారం, కళల పరిరక్షణ అనే నాలుగు లక్ష్యాలు సాధ్యమయ్యాయి. అంతకు ముందు సమాచార ప్రజా సంబంధాల శాఖ కూడా జిల్లా ప్రజా సంబంధాల అధికారుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి జానపద కళారూపాలను విస్తృతంగా వినియోగించేది. దీంతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంతో పాటు కళాకారులకు నిరంతర ఉపాధి లభించేది. ఆ విధానం కారణంగా అనేక జానపద కళారూపాలు సజీవంగా నిలిచాయి. నేడు కూడా అదే విధానాన్ని పునరుద్ధరించి, ప్రతి ప్రభుత్వ శాఖ తమ అవగాహన కార్యక్రమాల్లో జానపద కళారూపాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పట్టణీకరణ, ఉపాధి కోసం వలసలు, యూ ట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర డిజిటల్‌ మాధ్యమాల ప్రభావంతో జానపదకళలకు ఆదరణ తగ్గుతోంది. అనేకమంది కళాకారులు వాచ్‌మెన్‌లు, కూలీలు, డ్రైవర్లు, ఇతర చిన్న ఉద్యోగాల్లో చేరుతున్నారు. వారి పిల్లలు కూడా ఈ కళలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మన అమూల్యమైన జానపద వారసత్వం భావితరాలకు అందకుండా పోయే ప్రమాదం ఉంది.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జానపద కళలను తెలంగాణ సాంస్కృతిక వారసత్వంగా గుర్తించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. రాష్ట్ర సాంస్కృతిక సారథి, భాషా సాంస్కృతిక శాఖ, సమాచార ప్రజాసంబంధాల శాఖ, పర్యాటక శాఖ, ఆరోగ్యశాఖలు సంయుక్తంగా ప్రతి జిల్లాలో జానపద కళాకారుల నమోదుతో వార్షిక ప్రదర్శనల క్యాలెండర్‌ రూపొందించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, పాఠశాలలు, కళాశాలలు, పర్యాటక కేంద్రాలు, శిల్పారామం, రాష్ట్ర ఉత్సవాలు, జిల్లా ఉత్సవాల్లో క్రమం తప్పకుండా జానపద కళా ప్రదర్శనలు నిర్వహించాలి. జానపద కళలకు జీవనాధారం కల్పించడం అంటే కేవలం కళాకారులను ఆదుకోవడం మాత్రమే కాదు; తెలంగాణ సంస్కృతిని, చరిత్రను, భాషను, ఆత్మను భావితరాలకు సజీవంగా అందించడం. కళాకారుడు బతికితేనే కళ బతుకుతుంది. కళ బతికితేనే సంస్కృతి బతుకుతుంది. సంస్కృతి బతికితేనే తెలంగాణ తన ప్రత్యేకతను శాశ్వతంగా నిలబెట్టుకోగలదు.

ట్యాగ్‌లు: Hyderabad news latest news Telangana