Iran US War: అమెరికా-సౌదీ దాడిలో 20 మంది పీఎంఎఫ్ సభ్యులు మృతి
Iran US War: అమెరికా-సౌదీ దాడిలో 20 మంది పీఎంఎఫ్ సభ్యులు మృతి
ఐదు ఇరాన్ క్షిపణులు కూల్చేసిన జోర్డాన్
హోర్ముజ్‌లో మూడు చమురు ట్యాంకర్లు ధ్వంసం
సౌదీ నౌకలు లక్ష్యంగా దాడులు: హౌతీల ప్రకటన
ఎవ్వరూ ఊహించని విధంగా జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దిగ్భ్రాంతికర ఆకస్మిక దాడులు చేసింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఆ ఆకస్మిక దాడులతో అమెరికా సెంట్కామ్ ఉలిక్కిపడింది. ఈ దాడుల తర్వాత తూర్పు ఇరాక్‌లో ఉన్న ఇరాన్ అనుకూల పీఎంఎఫ్ (పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్) పారామిలిటరీ స్థావరాలపై అమెరికా సెంట్కామ్, సౌదీ అరేబియా కూటమి దళాలు సమన్వయంతో విస్తృతంగా దాడులు చేశాయి. నినేవెహ్లో జరిగిన ఈ దాడుల్లో 20 మంది పీఎంఎఫ్ సభ్యులు హతులయ్యారు. ఇలా మొదటిసారి అమెరికాతో కలిసి సౌదీ అరేబియా యుద్ధ దాడుల్లో పాల్గొంది.
అమెరికా బలగాలపైన, సౌదీ అరేబియా చమురు కేంద్రాలపైనా దాడులు చేయాల్సిందిగా ఇరాన్ ఆదేశాల మేరకు ఈ పీఎంఎఫ్ బలగాలు మంగళవారం 30 డ్రోన్లతో సౌదీ అరేబియా కేంద్రాలపై దాడులు చేశాయి. దీనికి ప్రతీకారంగా ఉత్తర ఇరాక్‌లో ఉన్న పీఎంఎఫ్ ఆయుధ కేంద్రాలు, రవాణా వ్యవస్థలపై దాడులు చేసినట్లు సెంట్కామ్ ప్రకటించగా, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని, కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది.
కాగా, హోర్ముజ్ జలసంధిలో మూడు చమురు నౌకలపై దాడులు చేసి వాటిని నిలిపివేశామని ఇరాన్ బుధవారం ప్రకటించింది. తమ హెచ్చరికలను ఉల్లంఘించి అక్రమ మార్గంలో ప్రయాణం చేసేందుకు ఈ నౌకలు ప్రయత్నం చేశాయని, అందువల్ల వాటిపై దాడి చేయాల్సి వచ్చిందని ఐఆర్జీసీ ప్రకటించింది.
సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి తుర్కీ అల్ మాలికీ మాట్లాడుతూ, ఆత్మరక్షణ కోసమే తాము ఇరాక్‌లో పీఎంఎఫ్ ఉగ్రవాదులపై దాడి చేశామన్నారు. ఉద్రిక్తతలను కోరుకోవడం లేదని, దురాక్రమణ చర్యలను ప్రతిఘటిస్తామని చెప్పారు. సౌదీ అరేబియాపై పీఎంఎఫ్ దాడి ద్రోహపూరితం, సార్వభౌమాధికార ఉల్లంఘన చర్య అని మండిపడ్డారు.
వరుసగా 13 రోజులపాటు ఇరాన్-అమెరికా మధ్య దాడులు జరిగిన తర్వాత శనివారం తెల్లవారుజామున అమెరికా దాడులు నిలిపివేయడంతో, అందుకు తగ్గట్టుగానే ఇరాన్ కూడా ప్రతిఘటన దాడులు నిలిపివేసింది. నాలుగు రోజుల విరామం తర్వాత ఊహించని రీతిలో జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. తాము ఎప్పుడూ ప్రతిఘటన వ్యూహాన్నే అమలు చేస్తామని ప్రకటించిన ఇరాన్ ఆకస్మిక దాడులే చేసింది.
అయితే స్థావరాలకు క్షిపణులు చేరకముందే ఐదు ఇరాన్ క్షిపణులను మార్గమధ్యలోనే కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ ఐఆర్జీసీ సైన్యాలు భారీ సంఖ్యలో క్షిపణులు ప్రయోగించాయని, వాటిని విజయవంతంగా అడ్డుకున్నామని సెంట్కామ్ ప్రకటించింది.
గడచిన వారాంతంలో దాడులు నిలిపివేసిన తర్వాత చర్చలకు ఒక అవకాశం వచ్చిందని ట్రంప్ ప్రకటించడంతో చమురు ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. కానీ తిరిగి పరిస్థితి తలక్రిందులైంది. మరోవైపు సౌదీ అరేబియా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు హౌతీ తిరుగుబాటు సైన్యాలు ప్రకటించాయి.
పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో బ్రెంట్ క్రూడాయిల్ ధర మళ్లీ నాలుగు శాతం మేర పెరిగింది. స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి.
ఇరాక్ కేంద్రంగా పనిచేసే పీఎంఎఫ్ పారామిలిటరీ దళాలు ఇరాన్ సర్వాధినేత చెప్పుచేతల్లో ఉండి, వారి ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాయి. 67 షియా తెగలకు చెందిన గ్రూపులతో ఈ పారామిలిటరీ ఏర్పడింది. ఇది ఇరాకీ సైన్యంలో విలీనమై ఉంది. ఈ గ్రూపులన్నీ ఇరాన్ చెప్పినట్లు వింటూ అనేక లక్ష్యాలను పూర్తి చేస్తాయి. తాము ఇరాన్ సర్వాధినేత అలీ ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఆదేశాల మేరకు ప్రవర్తిస్తామని పీఎంఎఫ్ ప్రధానాధిపతి ఫడక్ అల్ మహ్మదావీ 2024లోనే ఒక బహిరంగ ప్రకటన చేశారు.
ఇరాన్ ఉగ్రవాదం ప్రపంచానికి కేన్సర్: ట్రంప్
వివిధ దేశాల్లో ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులను ప్రపంచానికి పట్టిన కేన్సర్‌గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు. ఇరాక్‌లో పీఎంఎఫ్ ఛత్రం కింద పనిచేస్తున్న అనేక షియా తెగల ఉగ్రవాద గ్రూపులు ఇరాన్ ఆదేశంతో మంగళవారం సౌదీ అరేబియాపై దాడి చేశాయని, ఈ దాడులకు ప్రతిగా ఇరాక్ సహాయంతో ఎదురుదాడులు చేశామని, వారిని చితకబాదుతున్నామని ట్రంప్ చెప్పారు.
యెమెన్, లెబనాన్, ఇరాక్, గాజాలో ఇరాన్ అనుకూల ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయని, ఇవన్నీ ప్రపంచానికి పట్టిన కేన్సర్ అని అన్నారు. జోర్డాన్‌లో ఇరాన్ బుధవారం చేసిన దాడులను ఆకస్మిక దాడులుగా ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు స్పష్టంగా పెరుగుతున్నప్పటికీ తమ ప్రతినిధులను చర్చలకు పంపుతున్నానని తెలిపారు.