NTR Health: షర్మిల సంగతి సరే.. జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకురావడం లేదా చంద్రబాబు, లోకేష్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్ వేయలేరా..
NTR and Chandrababu
NTR Health: టాలీవుడ్ అగ్రకథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమైందన్న వార్త తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు సమగ్ర పరీక్షలు నిర్వహించిన అనంతరం, కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించింది.
ఎన్టీఆర్ బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు. అయితే, అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల నుంచి ఈ అంశంపై పూర్తి స్థాయిలో మౌనం వ్యక్తమవడం ఇప్పుడు సరికొత్త రాజకీయ విశ్లేషణలకు, సోషల్ మీడియా చర్చలకు దారితీసింది.
సాధారణంగా ప్రజాదరణ పొందిన వ్యక్తులు, సినీ ప్రముఖులు లేదా రాజకీయ నాయకులు అనారోగ్యానికి గురైనప్పుడు పార్టీలకూ, రాజకీయ సిద్ధాంతాలకూ అతీతంగా పరామర్శలు, శుభాకాంక్షలు తెలుపడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వంటి కూటమి అగ్రనేతలు స్పందించకపోవడం గమనార్హం.
ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సమయంలో కూటమి నాయకులు అత్యంత వేగంగా స్పందించి.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఆ సమయంలో సొంత చెల్లెలి అనారోగ్యంపై జగన్ స్పందించలేదని ఆరోపిస్తూ అధికార పార్టీ సోషల్ మీడియా తీవ్ర విమర్శలు గుప్పించింది. మరి జూనియర్ విషయంలో స్పందిచకపోవడం వెనుక మతలబు ఏంటోనని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
ఇదే విషయాన్ని తెరపైకి తెస్తూ నెటిజన్లు అధికార, ప్రతిపక్ష నేతలను ప్రశ్నిస్తున్నారు. అత్యంత దగ్గరి బంధువు, రాష్ట్రంలో అపారమైన అభిమాన గణం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గాయపడితే, కనీసం పరామర్శ సందేశం కూడా పంపకపోవడం వెనుక ఉన్న కారణాలేమిటనే చర్చ జోరందుకుంది. షర్మిల విషయంలో చూపించిన చొరవ వెనుక రాజకీయ కోణం ఉందని, ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ఆ స్పందనలు వచ్చాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ విషయంలో ఏ రాజకీయ ప్రయోజనం లేకపోవడం వల్లే కూటమి నాయకులు మౌనం వహించారనే విమర్శలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.