Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Weather Alert: హల్దియా సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. పశ్చిమ బెంగాల్, ఒడిషాతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు..

Prajapaksham 28 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Weather Alert: హల్దియా సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. పశ్చిమ బెంగాల్, ఒడిషాతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు..

Bay of Bengal Depression Cross Near Haldia

Weather Alert: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం ఇది బెంగాల్ భూభాగంపై వాయుగుండంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు జిల్లాలపై దీని ప్రభావం కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ వాయుగుండం నేపథ్యంలో తీర ప్రాంతాల రేవుల్లో హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ప్రధాన ఓడరేవుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయగా.. మిగిలిన కోస్తా ఓడరేవుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సముద్రం తీవ్ర అలజడిగా ఉన్నందున.. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణ శాఖ ప్రకారం ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు ఐటీ కంపెనీలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఉద్యోగులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా వీలైనంత త్వరగా కార్యాలయాల నుంచి లాగ్‌అవుట్ అయ్యేలా అనుమతులు ఇవ్వాలని సంస్థలను కోరారు.

సోమవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

మరోవైపు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద జలాలు చేరుతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు దాదాపు నిండుకుండలను తలపిస్తున్నాయి. సోమవారం నాటికి జూరాల ప్రాజెక్టుకు సుమారు 24 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అయితే శ్రీశైలం జలాశయానికి కేవలం 163 క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 4,070 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తుండటం గమనార్హం.

అటు మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిపై ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 63,618 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని ప్రధాన జలాశయాలకు మరింత వరద నీరు చేరే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశమున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.