పూరీ జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం.. కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
Puri Jagannadh Mother Ammaji Passes Away at 96
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన నానమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోతో పాటు భావోద్వేగమైన సందేశాన్ని పంచుకున్నారు. ఇకపై తన్ను ఎవరు ‘చిన్నతల్లి’ అని పిలుస్తారని, ప్రేమగా ఎవరు ముద్దుపెడతారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నీతో మరో రోజు గడిపే అవకాశం వస్తే బాగుండేదని, నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లే మరోసారి పెద్ద హగ్ ఇస్తానంటూ నానమ్మ జ్ఞాపకాలను తలుచుకుని ‘ఐ మిస్ యూ నానమ్మ’ అని పవిత్ర రాసిన పోస్ట్ నెటిజన్లను కలచివేస్తోంది. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా పూరీ జగన్నాథ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
మరోవైపు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమాలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా పనులతో బిజీగా ఉన్న సమయంలో పూరీ జగన్నాథ్ ఇంట్లో ఈ విషాదం చోటుచేసుకోవడం సినీ వర్గాలను తీవ్రంగా బాధించింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.