Skip to content
జాతీయం వార్తలు

Sonam Wangchuk: ‘నేను చనిపోవాలా.. లేక…’ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేకుండానే దీక్ష విరమణపై సోనం వాంగ్‌చుక్ వివరణ.. చనిపోవడం పరిష్కారం కాదంటూ భావోద్వేగ వ్యాఖ్యలు

Prajapaksham 24 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Sonam Wangchuk: ‘నేను చనిపోవాలా.. లేక…’ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేకుండానే దీక్ష విరమణపై సోనం వాంగ్‌చుక్ వివరణ.. చనిపోవడం పరిష్కారం కాదంటూ భావోద్వేగ వ్యాఖ్యలు

Sonam Wangchuk Reveals Why He Called Off Hunger Strike Despite No Resignation

Sonam Wangchuk: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌ నెరవేరకుండానే 26 రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించడంపై వస్తున్న విమర్శలు, భిన్నాభిప్రాయాలపై ప్రముఖ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ స్పందించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో దీక్ష విరమించిన అనంతరం.. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ ఇచ్చారు.

తన ముందు రెండు దారులు మాత్రమే ఉన్నాయని.. ఒకటి నిరాహార దీక్షను అలాగే కొనసాగించి ప్రాణాలు వదలడం, లేదా దీక్ష ముగించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమని వాంగ్‌చుక్ తెలిపారు. వేలాది మంది ప్రజలు, మద్దతుదారులు తన ప్రాణాలను కాపాడుకోవాలని, భవిష్యత్ పోరాటాల కోసం తాను సజీవంగా ఉండటం చాలా ముఖ్యమని సూచించారని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయనంత మాత్రాన ఈ ఉద్యమం విఫలమైనట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి రాజీనామా చేయకపోవడం వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం లేదని.. కానీ ఒకవేళ ఆయన రాజీనామా చేసి ఉంటే ఆయనకు ఉన్న గుర్తింపు, పేరు చెడిపోకుండా ఉండేదని అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తాను ఈ నిర్ణయానికి వచ్చానని వెల్లడించారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు కాకూడదని, కేసులు పడితే వారి జీవితాలు తీవ్ర ఇబ్బందుల్లో పడతాయని తెలుసుకొనే ప్రభుత్వం నుంచి హామీ పొందినట్లు చెప్పారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. అంతేకాకుండా దేశంలో పరీక్షల నిర్వహణ తీరుపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయని వాంగ్‌చుక్ వెల్లడించారు.