Skip to content
తెలంగాణ వార్తలు

IPS Trainee Harassment Case: మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో మరో మలుపు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం నాటకమని అనుమానిస్తున్న పోలీసులు

Prajapaksham 21 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
IPS Trainee Harassment Case: మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో మరో మలుపు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం నాటకమని అనుమానిస్తున్న పోలీసులు

IPS Trainee Harassment Case: మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో మరో మలుపు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం నాటకమని అనుమానిస్తున్న పోలీసులు

IPS Trainee Harassment Case: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై జరిగిన లైంగిక వేధింపుల కేసు తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధాన నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తలు.. ఆ తర్వాత వెలుగు చూసిన వాస్తవాలతో ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది.

మహిళా ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు శనివారం రాత్రి ఉదయ్ కృష్ణారెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైన ఉదయ్, అమీర్‌పేట్‌లోని తన స్నేహితురాలి గదికి వెళ్లి ఆహారం తీసుకోకుండా అధిక మోతాదులో మద్యం సేవించి స్పృహ కోల్పోయాడు. సోమవారం ఉదయం ఆయన నిద్రలేవకపోవడంతో గదిలోని శానిటైజర్, మద్యం బాటిళ్లను చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆత్మహత్యాయత్నంగా భావించి ఎస్సార్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అయితే రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు ఆయన శరీరంలో ఎలాంటి విషపూరిత పదార్థాలు లేవని, కేవలం అధికంగా మద్యం సేవించడం వల్లే స్పృహ కోల్పోయాడని ల్యాబ్ నివేదికలో స్పష్టం చేశారు. దీంతో ఉదయ్ ఆత్మహత్యాయత్నం చేయలేదని, కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించి సానుభూతి పొందేందుకే ఈ నాటకం ఆడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా ఆసుపత్రిలో చేరడానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి మద్యం మత్తులో ఒక లేఖ రాసినట్లు తెలిసింది. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, సదరు మహిళా అధికారిణితో తనకు ఏడాదిగా ఉన్న స్నేహబంధానికి సంబంధించిన వాట్సప్ చాట్‌లు, ఫొటోలను ఆమె భర్తకు పంపినట్లు అందులో పేర్కొన్నాడు. తన పరిస్థితికి ఆ మహిళతో పాటు మరో నలుగురు కారణమని లేఖలో ఆరోపించాడు.

ఈ ఘటనపై జాతీయ పోలీస్ అకాడమీ తీవ్రంగా స్పందిస్తూ సమగ్ర విచారణకు ఉన్నతస్థాయి అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖకు వివరాలు అందించి కఠిన చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు అత్తాపూర్ పోలీసులు సిసిటివి ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా మరియు వాట్సప్ చాట్‌లను విశ్లేషిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు.