Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Jr NTR Not Entering Politics: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం లేదు.. ఊరు-వాడ సేవా కార్యక్రమమే.. రాజకీయ కార్యక్రమం కాదని క్లారిటీ ఇచ్చిన అభిమాన సంఘం

Prajapaksham 13 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Jr NTR Not Entering Politics: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం లేదు.. ఊరు-వాడ సేవా కార్యక్రమమే.. రాజకీయ కార్యక్రమం కాదని క్లారిటీ ఇచ్చిన అభిమాన సంఘం

Jr NTR Not Entering Politics: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం లేదు.. ఊరు-వాడ సేవా కార్యక్రమమే.. రాజకీయ కార్యక్రమం కాదని క్లారిటీ ఇచ్చిన అభిమాన సంఘం

Jr NTR Not Entering Politics: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం ఊహాగానాలకు బ్రేక్ పడింది. జులై 18న జరిగేది స్వచ్ఛంద సేవా కార్యక్రమమేనని అభిమాన సంఘం స్పష్టత ఇచ్చింది. కాగా ప్రముఖ టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి విదితమే. ఈ ఊహాగానాలకు.. సామాజిక మాధ్యమాల చర్చలకు ఆయన అభిమాన సంఘం గట్టి ముగింపు పలికింది.

జులై 18వ తేదీన జరగబోయే ఈ కార్యక్రమానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని.. ఇది పూర్తిగా స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమమని అధికారిక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సేవే లక్ష్యంగా ‘ఊరు-వాడ’ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అభిమాన సంఘం వెల్లడించింది. ఈ సేవా కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెడుతూ అనవసర ప్రచారాలు చేయవద్దని.. తద్వారా అభిమానుల్లో గందరగోళం సృష్టించవద్దని మీడియాను, సోషల్ మీడియా వేదికలను అభిమాన సంఘం కోరింది.

ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు విజయ్ తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడం, అలాగే జూనియర్ ఎన్టీఆర్ తాతగారైన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు సినీ గ్లామర్ నుండి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ (TDP) స్థాపించిన చారిత్రక నేపథ్యాలను పోలుస్తూ సోషల్ మీడియాలో ఈ మధ్య చర్చ విపరీతంగా పెరిగింది. వీటికి తోడు 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ చురుగ్గా ప్రచారం నిర్వహించిన పాత జ్ఞాపకాలను సైతం ప్రస్తావిస్తూ నెటిజన్లు రకరకాల ఊహాగానాలకు తెరలేపారు.

అయితే అభిమాన సంఘం ఇచ్చిన తాజా వివరణతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతానికి అందరి దృష్టి ఈ ఊరు-వాడ సామాజిక కార్యక్రమంపైనే కేంద్రీకృతమైంది. తాను సినిమాలపైనే పూర్తి దృష్టి సారించానని, నటుడిగా ప్రేక్షకుల ఆదరణే తనకు పరమావధి అని ఎన్టీఆర్ గతంలో చాలా సందర్భాల్లో స్పష్టం చేసినప్పటికీ.. ఈ తాజా పరిణామంపై ఆయన స్వయంగా స్పందిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.