Skip to content
ప్రపంచం వార్తలు

Trump Warns Iran: ఒప్పందానికి రండి.. లేదంటే కథ ముగించేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు..

Prajapaksham 07 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Trump Warns Iran: ఒప్పందానికి రండి.. లేదంటే కథ ముగించేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు..

Trump Warns Iran: ఒప్పందానికి రండి.. లేదంటే కథ ముగించేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు..

Trump Warns Iran: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పతాకస్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియ టెహ్రాన్ లో కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మర్యాదగా తమతో ఒప్పందానికి రావాలని.. లేదంటే వారి కథ ముగించేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వైట్‌హౌస్ వేదికగా.. అలాగే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ విషయంలో అమెరికా ఏ రకంగానైనా విజయం సాధించి తీరుతుందనే ధీమా వ్యక్తం చేశారు. మేం ఎలాగైనా గెలవబోతున్నాం. అయితే ఒక ఒప్పందానికి వస్తాం.. లేదా వాళ్ల కథ ముగించేస్తాం. ఇరాన్ పని పట్టడం మాకేమీ పెద్ద కష్టం కాదు. మేం అనుకుంటే కేవలం ఒక్క గంటలోనే ఇరాన్‌లోని వంతెనలన్నింటినీ నేలమట్టం చేయగలం. కానీ, అక్కడ ఉన్న 91 మిలియన్ల (9 కోట్లకు పైగా) ప్రజలు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒప్పందానికే మొగ్గు చూపుతానని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే, ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదని.. ఆ దేశం నుంచి రేడియోధార్మిక పదార్థాలను, సంపన్న యురేనియంను తాము స్వాధీనం చేసుకోబోతున్నామని ఆయన తేల్చిచెప్పారు.

గత నెలలో అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి, కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ ట్రంప్ తన దూకుడు ఏమాత్రం తగ్గించడం లేదు. ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ అగ్రనాయకత్వం, మతాధికారులు భారీగా హాజరైన నేపథ్యంలో అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకులంతా ఒకేచోట గుమికూడారు. ఒక్క దెబ్బతో వారందరినీ మట్టుబెట్టే అవకాశం మాకు వచ్చింది. కానీ మేం అలా చేయలేదు. ఎందుకంటే వారందరినీ చంపేస్తే ఆ తర్వాత మేం ఎవరితో చర్చలు జరపాలని అన్నారు. అంతేకాకుండా ఖమేనీ అంత్యక్రియలకు అంత పెద్ద ఎత్తున జనం తరలిరావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. చాలామంది ఇరాన్ ప్రజలు ఖమేనీకి వ్యతిరేకమనుకున్నా, బహుశా వాళ్లు పెట్టుకున్నవన్నీ నకిలీ కన్నీళ్లు కావచ్చని వ్యాఖ్యానించారు.

ట్రంప్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో బదులిచ్చింది. ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ట్రంప్‌పై విమర్శల దాడి చేసింది. జూలై 4న 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న అమెరికాకు అసలు నాగరికత, చరిత్రే లేవని ఎద్దేవా చేసింది.మీరు మనుషులను చంపగలరు.. కానీ ఆదర్శాలను కాదు. మీరు ఆయతుల్లా ఖమేనీని చంపి ఉండొచ్చు కాని.. నిజానికి మీరు ఒక సెంటు (పర్ఫ్యూమ్) సీసాను పగలగొట్టారు.. ఆ సువాసన ఇప్పుడు అన్ని వైపులా మరింతగా వ్యాపించింది. ఈ విషయాలు మీకు అర్థం కావు… ఎందుకంటే అమెరికాకు అటు నాగరికత లేదు, ఇటు చరిత్ర లేదు.. అసలు గౌరవమే లేదని ఇరాన్ దీటుగా బదులిచ్చింది. ఖమేనీ అంత్యక్రియలకు తరలివచ్చిన అశేష జనసందోహాన్ని చూసైనా అమెరికా వాస్తవాన్ని గ్రహించాలని హితవు పలికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *