Akbaruddin Owaisi: ఒకటి కూల్చివేస్తే వంద కడతాం.. ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలపై హైడ్రా విచారణపై అక్బరుద్దీన్ ఒవైసీ సవాల్
Akbaruddin Owaisi: ఒకటి కూల్చివేస్తే వంద కడతాం.. ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలపై హైడ్రా విచారణపై అక్బరుద్దీన్ ఒవైసీ సవాల్
Akbaruddin Owaisi: సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ (Full Tank Level) పరిధిలో నిర్మించారంటూ ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలపై హైడ్రా (HYDRAA) విచారణ జరుపుతున్న నేపథ్యంలో, చాంద్రాయణగుట్ట ఎంఐఎం (MIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గౌస్‌నగర్‌లోని విద్యా క్యాంపస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఫాతిమా కళాశాల పేరుతో తమను భయపెట్టాలని చూస్తున్నారని, కానీ తాము ఎలాంటి అవినీతికి లేదా అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
తమ విద్యాసంస్థలను కూల్చివేస్తామంటూ వస్తున్న బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని, చట్టపరంగా వాటిని ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసని అక్బరుద్దీన్ హెచ్చరించారు. “ఒక్క విద్యాసంస్థను కూల్చేస్తే.. పేద ప్రజల కోసం వంద విద్యాసంస్థలను నిర్మించి చూపిస్తామని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. భవనాలు ఉన్నా లేకపోయినా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే తమ ప్రయాణం ఆగిపోదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం సందర్భంగా సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. 366 మంది పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి పేరిట రూ.కోటీ 19 లక్షలను బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడంతో పాటు, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ విచారణలు, కూల్చివేతల హెచ్చరికల మధ్య అక్బరుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నగర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.